దేశంలో సంచలనం సృష్టిస్తున్న కాక్రోచ్ పాలిటిక్స్.. కొత్త రాజకీయ సమీకరణాలకు ఊపిరులూదుతుందా? జెన్ జీ పాలిటిక్స్‌కి కాక్రోచ్ మూవ్‌మెంట్ వేదిక కానుందా? ప్రతి 20-30 సంవత్సరాలకు దేశంలో రాజకీయ పునరేకీకరణ జరగడం, కొత్త తరహా రాజకీయం పుట్టడం సహజంగా జరిగేదే. ఇది సైక్లిక్ ప్రక్రియలో జరుగుతుంటుంది. ప్రపంచంలో చాలా చోట్ల జెన్ జీ పాలిటిక్స్ ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. కొన్ని చోట్ల ప్రభుత్వ స్థాపనకు కూడా జెన్ జీలు సిద్ధమయ్యారు. నీట్ వైఫల్యాన్ని ఎండగడుతూ కాక్రోచ్ జనతా పార్టీ దేశ రాజధానిలో చేసిన ఉద్యమం అంత తేలికగా తీసిపడేయలేం. విద్యార్థులు, నిరుద్యోగులు, యువతీ, యువకులు వాళ్ల భావావేశాలు రాజకీయాలవైపు మళ్లీతే కచ్చితంగా దేశంలో అదో కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీయక తప్పదు. కాక్రోచ్ ఉద్యమమనండి..కాక్రోచ్ పాలిటిక్స్ అనండి..ఇప్పుడు భవిష్యత్ రాజకీయాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.
దేశంలో పెరుగుతున్న పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం, అవినీతి అక్రమార్జనలు వీటన్నింటిపైనా దేశ యువత మనసుల్లో అసంతృప్తి, ఆవేదన విపరీతంగా గూడుకట్టుకుని ఉండిపోయాయి. దేశంలో ఒక వర్గం లౌకిక రాజకీయాల పేరుతో ఒక దిశగా తీసుకెళ్తే.. మరోవర్గం మత రాజకీయం పేరుతో మరో దిశగా తీసుకెళ్లాయి. ప్రధాన సమస్యలైనటువంటి నిరుద్యోగం, అవినీతి, విద్య, వైద్యం, ఆధునిక సౌకర్యాలు.. ఇవి మాత్రం ఇప్పటికీ దేశంలో ప్రజలందరికీ సమానంగా అందడమనేది ఒక కలగానే మిగిలిపోయింది. దీని ఫలితమే విద్యార్థులు, యువతీ, యువకుల్లో, ప్రధానంగా జెన్‌జీల్లో దేశ రాజకీయాల పట్ల అసంతృప్తి, ఆగ్రహం, ఆవేదన పెరిగిపోయేలా చేస్తున్నాయి. కులం, మతం, వర్గం వీటి ఆధారంగానే ఇండియాలో రాజకీయాలు నడుస్తున్నాయి తప్ప.. అభివృద్ధి, సంక్షేమమనేది ఒక మిథ్యగానే మిగిలిపోయింది. అందుకే ఆ అసంతృప్తిల్లో నుంచి పెల్లుబికిందే కాక్రోచ్ జనతా పార్టీ.
గడిచిన రెండేళ్లుగా జరిగిన పరీక్షా పత్రాల లీకులను ప్రస్తావిస్తూ, దీని కారణంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తూ వారి పేర్లనూ అభిజిత్ దీప్కే చదివి వినిపిస్తున్న సమయంలో ఢిల్లీ జంతర్‌మంతర్‌లో నిరసనకారులంతా సంఘీభావం తెలుపుతూ మొబైల్ ఫోన్ల టార్చ్ లైట్ వెలిగిస్తూ ఫోన్లను పైకెత్తారు. ఈ విద్యార్థుల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మరోసారి డిమాండ్ చేశారు. మొత్తం మీద ఒక సెటైరికల్ మీమ్‌గా మొదలైన కాక్రోచ్ జనతా పార్టీ, భారీ ఉద్యమానికి తెరలేపింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి వచ్చి సీజేపీకి మద్దతు తెలిపిన వారంతా ఇప్పుడీ ఉద్యమాన్ని ఏ దిశగా ముందుకు తీసుకెళ్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది. శనివారం నిర్వహించిన కార్యక్రమం కేవలం ట్రైలర్ మాత్రమే అని, అసలు ఉద్యమం ఇంకా ముందుందని సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే సోషల్ మీడియాలో హెచ్చరించారు.
ఈ కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ప్రదర్శనపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, లెఫ్ట్ పార్టీలు ఈ నిరసనకు పూర్తి మద్దతు ప్రకటించాయి. అయితే, విపక్షాల కూటమిలోనే భిన్న స్వరాలు వినిపించాయి. ఈ సీజేపీ నిరసన అంతా ఆప్ సృష్టించిన వ్యూహమేనని కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం నేతలు వ్యాఖ్యానించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ నిరసనలపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా స్పందించింది. దేశ యువతను తప్పుదోవ పట్టించి, వారిని ప్రతికూల రాజకీయాల వైపు మళ్లించేందుకు కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆరోపించారు. రాంచీలో జరిగిన మేధావుల చర్చా వేదికలో అభిజిత్ దిప్కే పేరు ఎత్తకుండా పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కొందరు విదేశాల్లో కూర్చుని భారత యువతకు దిశానిర్దేశం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉందని, కానీ అది నియమ నిబంధనల పరిధిలోనే ఉండాలని సూచించారు. పొరుగు దేశాల్లో జరిగినట్లుగా వ్యవస్థకు వ్యతిరేకంగా చేసే ఇలాంటి ప్రచారాలు దేశ యువత భవిష్యత్తుకు మంచిది కాదని నబీన్ హితవు పలికారు.
కాక్రోచ్. తెలుగులో బొద్దింక. ఇప్పుడీ బొద్దింకే దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఇప్పటికే సోషల్ మీడియాలో పెను ఉద్యమంలా మారిన కాక్రోచ్.. ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర ధర్నాతో క్షేత్రస్థాయి నిరసనలకూ సిద్ధమేనని చాటింది. దీంతో దేశంలో ఏళ్లుగా పాతుకుపోయిన పార్టీలు ఉలిక్కిపడుతున్నాయి. దేశ పాలనపై, వ్యవస్థలపై సెటైరికల్‌గా ప్రారంభమైన ఈ బొద్దింక పార్టీ.. నిరాదారణకు గురై నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయిన యువత, నిరుద్యోగులకు బ్రహ్మాస్త్రంలా మారుతోంది. స్వచ్ఛందంగా.. యువత ఈ పార్టీలో చేరుతున్నారు. ఇందులో జెన్-జీ యువతే ఎక్కువగా..ఉండటంతో.. భారత్‌లోనూ జెన్-జీ ఉద్యమానికి పురుడుపోసుకుంటుందా అన్న చర్చలు నడుస్తున్నాయి. కాకపోతే జంతర్ మంతర్ ధర్నా జరిగిన తీరు చూస్తే.. కాక్రోచ్‌లకు ఆవేశమే కానీ..ఆచరణలో నిలకడ లేదనే వాదన కూడా వినిపిస్తోంది. కనీసం ఒక్కరోజు కుదురుగా ధర్నా చేయలేని బొద్దింకలు.. రాజకీయాల్లో మార్పు తేగలవా అనే సెటైర్లూ పడుతున్నాయి. కానీ ప్రతిసారీ ఓ క్రమపద్ధతిలో నిర్మించిన ఉద్యమాలే అధికార కేంద్రాలను కదిలిస్తాయనేవి పాత లెక్కలు. ఇతర దేశాల్లో ఉదాహరణలు చూస్తే.. జెన్ జీని తక్కువగా అంచనా వేయలేమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
దేశంలో ఇప్పటికే అనేకానేక రాజకీయపార్టీలున్నాయి. కానీ, ఏ పార్టీ కూడా బొద్దింకను పేరుగా పెట్టుకొని ఉండదు. తాజాగా ఓ 30 ఏళ్ల యువకుడు అభిజీత్ దీప్కే ఈ పని చేశాడు. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో పార్టీని స్థాపించాడు. సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ తమ నినాదమని ప్రకటించాడు. ఇది దేశంలోని పరిణామాలపై ఓ వ్యంగ్య బాణం. నిరుద్యోగులు సోమరిపోతుల్లా, బొద్దింకల్లా తయారై జర్నలిస్టులు, న్యాయవాదులు, సమాచార హక్కు కార్యకర్తల పేరుతో వ్యవస్థ మీద దాడి చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తన వ్యాఖ్యలను వక్రీకరించారని సీజేఐ పేర్కొన్నారు. అయినప్పటికీ, ఆ వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు నడుస్తున్నాయి. దీంట్లో భాగంగానే అభిజీత్ దీప్కే.. కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించినట్లుగా సోషల్ మీడియాలో గత నెల 16వ తేదీన ప్రకటించారు. పార్టీ యువత కోసం పని చేస్తుందని, ప్రజల సొమ్ము ఎటు పోతుందో నిలదీయటానికి పార్టీ పెట్టామని తెలిపారు. దీంట్లో చేరటానికి అర్హతలు.. నిరుద్యోగం, సోమరితనం , ఆన్‌లైన్‌కు అతుక్కొని ఉండటం, వ్యవస్థపై ఆగ్రహాన్ని అద్భుతంగా వెళ్లగక్కే నైపుణ్యం కలిగి ఉండటం అని పేర్కొన్నారు. అలా అభిజిత్ దీప్కే ఒక్కడితో మొదలైన ఈ పార్టీకి.. ఇప్పుడు సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ వచ్చి చేరారు.
మొదట్లో కాక్రోచ్ జనతా పార్టీ కేవలం సోషల్ మీడియా సెన్సేషన్ మాత్రమేననే వ్యాఖ్యానాలు వచ్చాయి. అయితే అవి నిజం కాదని, తమకు ఓ స్పష్టమైన కార్యాచరణ ఉందని కాక్రోచ్ జనతా పార్టీ తేల్చేసింది. తాము అధికారంలోకి వస్తే చేపట్టే పనుల పేరుతో సీజేపీ ఐదు అంశాలతో మేనిఫెస్టోను ప్రకటించింది. అందులో ఒకటి.. పదవీ విరమణ చేసే ఏ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా రాజ్యసభ సభ్యత్వాన్ని కానుకగా ఇవ్వబోము. రెండు..నిజమైన ఏ ఒక్క ఓటరు ఓటు హక్కు కోల్పోయినా దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ఉపా చట్టం కింద అరెస్టు చేసి విచారణ జరుపుతాం. 3 పార్లమెంటు సీట్ల సంఖ్యను పెంచకుండానే సగం సీట్లను మహిళలకు కేటాయిస్తాం, కేంద్ర క్యాబినెట్‌లో సగం పదవులు మహిళలకు ఇస్తాం. 4 అదానీ, అంబానీలకు చెందిన అన్ని మీడియా సంస్థల లైసెన్సులు రద్దు చేస్తాం. దేశంలో నిజమైన స్వతంత్ర మీడియా పని చేయటానికి దారులు వేస్తాం. 5. పార్టీ ఫిరాయించే ఎంపీ, ఎమ్మెల్యేల మీద 20 ఏళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
ఇప్పటికే చాలా దేశాల్లో జెన్-జీ ఉద్యమాలు వచ్చాయి. ప్రభుత్వాలపై తమ నిరసన గళాన్ని వినిపించి.. మార్పు సాధించాయి. భారత్‌లోనూ ఆర్థిక అసమానతలు, నిరుద్యోగంతో యువత.. నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు. పారదర్శకమైన అవినీతిలేని పాలన, అందరికీ అవకాశాలు, ఆర్ధిక అసమానాతలు లేని సమాజాన్ని, ప్రజల కోసం పని చేసే వ్యవస్థలను కోరుకుంటున్నాయి. వారిలోని ఆ ఆవేదనే.. ఈ కాక్రోచ్ పార్టీకి వస్తున్న ఆదరణ రూపంలో ప్రతిబింబిస్తుందా అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఐతే ఈ కాక్రోచ్ జనతా పార్టీ కేవలం సోషల్ మీడియా వేదికకే పరిమితం అవుతుందా లేక.. రాబోయే ఎన్నికల్లో దీని ప్రభావం ఏమైన కనిపిస్తుందా అన్న చర్చలు సైతం జరుగుతున్నాయి. జెన్-జీ యువత.. కేవలం మార్పు కోరుకునే వరకే పరిమితం అవుతారా లేక ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారా అన్న ఆసక్తి నెలకొంది.
1970ల్లో జరిగిన విద్యార్థి ఉద్యమాలు, ఆ తర్వాత జనతా పార్టీ ఆవిర్భావం ఎమర్జెన్సీ తర్వాత ఏర్పడిన జనతా పార్టీ ప్రభుత్వం ఇవన్నీ విద్యార్థి ఉద్యమాల ప్రభావంతో వచ్చినవే. ఆనాడు విద్యార్థి ఉద్యమాల్లో దేశాన్ని ప్రభావితం చేసినవాళ్లంతా ఇప్పుడు వృద్ధులైపోయారు. వాళ్ల వారసులు వంశపారంపర్య రాజకీయాలకు తలవంచేశారు. అందుకే ఇప్పుడు మళ్లీ దేశంలో ఈ జనరేషన్ యువత కొత్త రాజకీయానికి సిద్ధమవుతోంది. ఈ కాక్రోచ్ పాలిటిక్స్ దేశమంతా వ్యాపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రాష్ట్రాల వారీగా ప్రాంతీయ సమస్యలు, స్థానిక సమస్యలను అడ్రెస్ చేస్తూ దేశ వ్యాప్తంగా కాక్రోచ్‌లు విస్తరిస్తే ఇప్పుడున్న రాజకీయ పార్టీలకు కచ్చితంగా చెమటలు పడతాయి. 2029లో రాజకీయాలు, రాజకీయ సమీకరణాలను కాక్రోచ్ పాలిటిక్స్ మార్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
నీట్ పేపర్ లీకేజీ, సీబీఎస్‌ఈ ఓఎస్‌ఎం అవకతవకల తరుణంలో ఒక్క పిలుపుతో వేల మంది ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు పోటెత్తారు. ఆ పిలుపునిచ్చింది దేశంలోనే అత్యంత సీనియర్ పార్టీగా, దేశానికి స్వాతంత్ర్యం తేవడంలో కీలక పాత్ర పోషించామని చెప్పుకొనే కాంగ్రెస్ కాదు. ప్రజల హక్కులు, సమస్యలపై గళమెత్తే కమ్యూనిస్టు పార్టీ కూడా కాదు. విద్యార్థులకు నష్టం వాటిల్లితే లాఠీ దెబ్బలు తినైనా సరే నిలబడి కొట్లాడే వామపక్ష విద్యార్థి సంఘాలు కాదు. సోకాల్డ్ ప్రతిపక్ష పార్టీలేమీ కాదు. ఆఖరుకు పైన చెప్పుకొన్న అందరూ కలిసి.. ప్రభుత్వాన్ని నిగ్గదీసేందుకు ఇచ్చిన సంయుక్త పిలుపు కూడా కాదు. ఒక సగటు పౌరుడు.. అదీ వ్యంగ్యాత్మకంగా ఏర్పాటు చేసిన కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు.. దేశ యువతరాన్ని ఉద్యమ బాట పట్టించేలా చేసింది. ప్రతిపక్షాలకు మించిన సవాలును అధికార పక్షానికి విసిరింది. అదే సమయంలో ప్రతిపక్షాలు కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితిని సృష్టించింది.
ప్రతి యుగానికి ఒక ప్రత్యేకమైన తరం ఉంటుంది. 21వ శతాబ్దపు శబ్దాల మధ్య రూపుదిద్దుకున్న ప్రపంచం ముందు పెను సవాళ్లుగా మారిన సరికొత్త ప్రశ్నలకు, సమాధానాలు వెతుకుతున్న తరం జెన్-జీ. 1997 నుంచి 2012 మధ్య కాలంలో జన్మించిన యువత. ఇది మునుపటి తరాలకన్నా భిన్నంగా ఆలోచించే, స్పందించే, జీవించే తరం. ఈ తరం సభ్యులు డిజిటల్ నేటివ్స్. వారికి సమయం, భౌగోళిక సరిహద్దులు పెద్దగా అర్థం కావు. సమాచారం తక్షణమే కావాలి, వ్యవస్థలు తక్షణమే స్పందించాలి. ఇలాంటి మానసిక నిర్మాణంలో పెరిగిన వారు వాతావరణ మార్పులు, లింగ సమానత్వం, మానవ హక్కుల అంశాలపై బలమైన నిబద్ధతను కనబరుస్తున్నారు.
జెన్ -జీ ఒక శక్తిమంతమైన తరం అనటానికి నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లో జరిగిన సంఘటనలే నిదర్శనం. సాంకేతిక యుగంలో పుట్టిన జెన్- జీ ప్రపంచవ్యాప్తంగా సమాచార విప్లవం, సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి పరిణామాల మధ్య పెరిగింది. వీరి జీవితాలు వేగం, వాస్తవం, వర్చువల్ ప్రపంచం అనే మూడు అంచుల్లో విస్తరించాయి. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలో పాల్గొన్న ఒక విద్యార్థి మా తరం వాళ్లలో కోపం చాలా ఉంది. దాన్ని ఎటు మళ్లించాలో ఈ ఉద్యమం మాకు చూపింది అని చెప్పిన అంశం.. దేశంలోని ఢక్కాముక్కీలు తిన్న, మహామహా నేతలు ఉన్న రాజకీయ పార్టీలకు ఒక సవాలు విసిరింది. పదమూడు లక్షల మంది విద్యార్థుల భవితవ్యాన్ని, వారి కుటుంబ సభ్యుల ఆకాంక్షలను క్రూరంగా తుంచిపారేసిన ఒక దుర్మార్గాన్ని ఖండిస్తున్నాం అంటూ ప్రకటనలకు, చిన్నచిన్న నిరసన ప్రదర్శనలకు పరిమితమైన పార్టీలు.. వేల సంఖ్యలో వెల్లువెత్తిన విద్యార్థులను, వారిలో ఆక్రోశాన్ని అర్థం చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందా? అనే చర్చను ప్రారంభించింది. ఈ ధర్నా లేదా నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు అనేక ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సొంత ఖర్చులపైనే ఇక్కడకు వచ్చామని చెబుతున్నారు. అంటే.. ఒక అంశం తీవ్రత.. వారిని జంతర్ మంతర్‌వైపు నడిపించింది. ఇదే తీవ్ర అంశంపై ప్రతిపక్షాలు ఎందుకు ఈ స్థాయిలో పిలుపునివ్వలేకపోయాయి? అన్యాయాలపై గొంతెత్తుదామని పిలుపునిస్తే కదలలేని జడత్వంతో విద్యార్థులు ఉన్నారనే నెగెటివ్ భావన ఆ రాజకీయ పార్టీల్లో పేరుకుపోయి ఉందా? నేటి పిల్లలు మొబైల్ ఫోన్లకు బానిసలయ్యారని పదే పదే ఆవేదన చెందే మేధావులు.. లేక జెన్ జీ భాషను, భావ వ్యక్తీకరణ శక్తిని ఆ పార్టీలు అంచనా వేయలేక పోతున్నాయా? ఇదే అంశంపై ఏ రాజకీయ పార్టీ ఆందోళనకు రానంత స్థాయిలో కాక్రోచ్ జనతా పార్టీ పిలుపుతో ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఈ అంశాలన్నింటిపై ప్రజలందరిలో చర్చ జరుగుతోంది.
నిజానికి కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుక చాలా సింపుల్ ఆగ్రహంతో సంభవించింది. ఒక కేసులో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్.. నిరుద్యోగులు బొద్దింకల్లా మారి వ్యవస్థపై దాడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తప్పుడు లేదా నకిలీ డిగ్రీలతో లాయర్లుగా చలామణి అవుతున్నారని, సోషల్ మీడియాలో ప్రవేశించి వ్యవస్థను పరాన్నజీవుల్లా పీడిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై వివాదం రేగడంతో మరుసటి రోజే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. తన వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్థం చేసుకున్నదని భాష్యం చెప్పారు. దేశ యువతను తాను అవమానించలేదని, వారు దేశానికి మూల స్థంభాలని కుండబద్దలు కొట్టారు. కానీ.. అప్పటికే యువత ఆ వ్యాఖ్యలతో తీవ్ర ఆగ్రహంతో ఉంది. అదే సమయంలో అదే అంశాన్ని చేపట్టి, జస్టిస్ సూర్యకాంత్ సంబోధించిన కాక్రోచ్‌ల పేరుతో ఆవిర్భవించింది కాక్రోచ్ జనతా పార్టీ. అది ప్రారంభంలో ఒక సెటైరిక్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం అయి ఉండొచ్చు కానీ.. అది లేవనెత్తిన అంశాలు యువతకు కనెక్ట్ అయ్యాయి. ఆ యువత చదువుకున్నారు.. కానీ.. ఉద్యోగాలు రావడం లేదు. ఏటా కోట్ల ఉద్యోగాలంటున్న ప్రభుత్వం.. పకోడీలు వేయడం కూడా ఉద్యోగాల కోటా కింద జమకట్టేస్తున్న తరుణం. పరీక్షా పే చర్చ పేరుతో ఒక వైపు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మోటివేషనల్ క్లాసులు పీకుతున్న సమయంలో.. అవే పరీక్షల పత్రాలు బజారులో పల్లీబఠానీల తరహాలో అమ్ముడవుతున్న సందర్భం. వీటికి బాధ్యులెవరు? వీటికి అంతం ఎప్పుడు? కష్టపడి చదివిన విద్యార్థులను కాదని.. పరీక్ష పత్రాలు కొని పరీక్ష పాస్ అవుతున్న దారుణాలు ముగిసేదెన్నడు? యువతలో కోపం వెనుక దాగి ఉన్న ఈ ప్రశ్నలే.. వారిని కాక్రోచ్ జనతా పార్టీ సామాజిక మాధ్యమాలను ఫాలో అయ్యేలా చేసింది. చినుకు చినుకు కలిసి.. తుదకు వరదైనట్టు.. చిన్న కాల్వలన్నీ కలిసి.. ఉధృతంగా పొంగే వాగైనట్టు.. స్థాపించిన కొద్ది రోజులకే దేశ రాజకీయ ఉద్ధండులనే కళ్లింత చేయించింది కాక్రోచ్ జనతా పార్టీ.
ఇప్పటి జెన్ జీ తరం ఆలోచించేది తమ జీవితాలు ఎందుకు ఇలా ఉన్నాయి? తమకు ఉద్యోగం ఎందుకు రావడం లేదు? తమ తల్లిదండ్రుల ఖర్చులు ఎందుకు పెరిగిపోతున్నాయి? తమ మొబైల్ ఫోన్ నెట్ బిల్లు జేబులకు చిల్లులు ఎందుకు వేస్తున్నది? వీటికి సమాధానాలు చెప్పేవాళ్లు కరువయ్యారు. వారి భాషలో వారితో మాట్లాడేవారు కరువయ్యారు. నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా, వారి ఆవేదన, ఆక్రోశాన్ని అర్థం చేసుకునే పరిస్థితుల్లో ప్రధాన రాజకీయ పార్టీలు పూర్తిగా వైఫల్యం చెందాయనే భావన విద్యార్థుల్లో, యువతలో నాటుకుపోయిందనే అభిప్రాయాలున్నాయి. అందుకే ఒక విద్యావంతుడు ప్రారంభించిన ఉద్యమానికి, నిర్వహించిన నిరసన కార్యక్రమానికి వేలాది మంది స్వచ్ఛందంగా తరలి వచ్చారు.
ఒక ఉద్యమం వెనక ఒక పార్టీ ఉందంటూ బద్నాం చేసుకుంటున్నారు తప్పితే, ప్రజల ముందు ఏ విధంగా నమ్మకం కోల్పోతున్నామనే విషయాన్ని రాజకీయ పార్టీలు పసిగట్టకపోవడం శోచనీయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఈ ఉద్యమం ఇక్కడితో ఆగిపోతుందా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకూ మరిన్ని రూపాల్లో ఆందోళనలు ఉంటాయా? తదుపరి ఎజెండాపై సీజేపీ తన కార్యాచరణ ప్రకటిస్తుందా? వాటిపైనా యువత కదిలి వస్తుందా? వీటికి వచ్చే సమాధానాలు.. అవును అయితే.. అవి భావి భారత రాజకీయాలను కీలక మలుపు తిప్పడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా వచ్చే ఎన్నికల అజెండాను జెన్‌జీ నిర్దేశించినా ఆశ్చర్యపోనక్కర్లేదనే వాదన కూడా వినిపిస్తోంది.

