Chairman’s Desk: దశాబ్దం క్రితం హిందువులు ఈ స్థాయిలో చైతన్యం చూపించిన దాఖలాల్లేవు. అప్పుడు కూడా పూజలు, పునస్కారాలు, ఆలయాల సందర్శనలు ఉన్నా.. ఇప్పుడు జరుగుతున్నది మాత్రం వేరే లెవల్. అంతకుముందు పుణ్యక్షేత్రాల్లో మాత్రమే భక్తుల రద్దీ ఉండేది. ఇప్పుడు మాత్రం సాధారణ ఆలయాల్లోనూ భక్తుల తాకిడి పెరుగుతోంది. మన మతం, మన సంప్రదాయాల్ని బహిరంగంగా ప్రదర్శించాలనే తాపత్రయం హిందువుల్లో బాగా పెరిగింది. గతంలో ఇళ్లలో చేసుకునే పూజలు కూడా ఇప్పుడు సామూహిక రూపం తీసుకున్నాయి. పనిగట్టుకుని ఉత్సవాలు చేసే సంస్కృతి కూడా బాగా విస్తరించింది. పనిలోపనిగా చారిత్రక ఆలయాలు, పాత ఆచారాలపైనా నమ్మకం పెరిగిపోయింది. ప్రముఖుడైన రాజు కట్టించిన ఆలయం ఎంత దూరంలో ఉన్నా వెళ్లిపోతున్నారు. ఎవరైనా దాన్ని మూఢనమ్మకం అంటే.. వారితో వాదనకు దిగుతున్నారు. మా మత విశ్వాసాల్ని కించపరిచే అధికారం మీకెక్కడదని నిలదీస్తున్నారు. దీనికి తోడు సోషల్ మీడియాలోనూ హిందుత్వం గురించి, హిందూ మతం గురించిన పోస్టులు పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. దీంతో ఇన్నాళ్లూ తాము స్తబ్ధుగా ఉన్నామని హిందువులు భావిస్తున్నారు. ఇప్పుడు కూడా మన మతం గురించి మనం చెప్పుకోకపోతే.. ఎలాగనే ధోరణి ప్రబలింది.
ముక్కోటి ఏకాదశికి తిరుమలకు లక్షల్లో జనం తరలి వస్తున్నారంటే వారిలో ఆ భక్తి భావన ఏ రకంగా విస్తృతమైందో.. ఏ విధంగా పెరిగిందో అర్ధం అవుతోంది. గతంలో తమిళనాడులోని తిరువణ్ణమలైలోని, అరుణాచలానికి వేలాల్లో భక్తులు వెళ్లేవారు. ఇప్పుడు లక్షల్లో సందర్శిస్తున్నారు. అరుణాచల గిరి ప్రదక్షిణ ఆధ్యాత్మిక భావోద్వేగంతో ముడిపడి ఉంటుందని అందరూ చెబుతున్నారు. ఎక్కడో మధ్యప్రదేశ్‌లో ఉండే ఉజ్జయినీ ఆలయానికి తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు తండోపతండాలుగా వెళ్తున్నారంటే.. భక్తి విశ్వాసాలు ఏ స్థాయిలో పెరిగాయో అర్ధం చేసుకోవచ్చు. చిన్న చిన్న కమ్యూనిటీల్లో కూడా వినాయక చవితి, శ్రీరామ నవమి, దసరా, దుర్గమ్మ పూజ లాంటి హిందూ పండగలు జనం అంతా కలిసి సామూహికంగా జరుపుకోవడం, జనంలో పెరిగిన హైందవ భావనకు ఒక ఉదహరణ. మనది హిందూ దేశమనే భావనకు బలం పెరుగుతోంది. పదేళ్ల కిందటి పరిస్థితులతో పోల్చి చూస్తే ఈ భావనకు సామాన్య హిందువుల్లో ఆమోదం లభిస్తోంది.
మునుపటి రోజులకు భిన్నంగా హిందూ మతం, హిందుత్వ భావనతో ఏర్పాటయ్యే గ్రూపులకు మంచి ఆదరణ లభిస్తోంది. పూజలు, ఉత్సవాల విషయంలోనూ తోటి హిందువులతో పోటీ పెట్టుకునే పోకడ వచ్చేసింది. ఫలానా ఉత్సవాలు మీ ఊళ్లో బాగా జరిగాయా.. మా ఊళ్లో బాగా జరిగాయా అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. గణేష్ ఉత్సవాలు మొదలుకుని దేవీ నవరాత్రుల వరకు జనం దేన్నీ వదిలిపెట్టడం లేదు. ఉత్సవం ఏదైనా ఘనంగా నిర్వహించాల్సిందేనని తపన బాగా పెరిగింది. ఏ కారణంతో ఈ భావన మొగ్గ తొడిగినా.. అది అంతిమంగా ఆలయాలు కళకళలాడటానికి దారితీస్తున్నాయని ఆధ్యాత్మికవేత్తలు సంతోషిస్తున్నారు. ఒకప్పుడు ఆలయాల సందర్శన అంటే అంతగా ఆసక్తి చూపనివారు సైతం.. ఇప్పుడు పనిగట్టుకుని వెళ్తున్నారు. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో ప్రత్యేక సందర్భాల్లో ఆలయాలకు వెళ్లకపోతే.. మీరు హిందువులేనా అని అడిగే పరిస్థితి వచ్చేసింది. క్రమంగా గుడికి వెళ్లడం కూడా ఓ సామాజిక హోదాకు చిహ్నంగా మారిపోయింది. దీంతో కుటుంబాలకు కుటుంబాలకు పిల్లాపాపలతో సహా వీలైతే పుణ్యక్షేత్రానికి, లేకపోతే అందుబాటులో ఉన్న గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకునే ధోరణి బాగా పెరిగింది. గతంలో దర్శనం సాఫీగా జరిగేలా ఉంటేనే వెళ్దాం.. లేకపోతే లేదు అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. ఎన్ని కష్టాలు పడ్డా.. దర్శనం కాకుండా వెనుదిరిగే ప్రసక్తే లేదని ఎవరికి వారే గట్టి సంకల్పం చేసుకుంటున్నారు. అడపాదడపా తొక్కిసలాటలు జరిగినా.. వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎంత రద్దీ ఉన్నా.. చివరకు ఆలయ నిర్వహణాధికారులే రావద్దని ప్రకటనలు చేసినా.. జనం అవేవీ పట్టించుకోవడం లేదు. పైగా దైవదర్శనానికి రావద్దని చెప్పటానికి మీరెవరని ఎదురు ప్రశ్నిస్తున్నారు. రద్దీ పెరిగినప్పుడు తగిన ఏర్పాట్లు చేయటానికే యంత్రాంగం ఉందని వారికి కర్తవ్యబోధ చేస్తున్నారు. ఈ స్థాయిలో వెల్లివిరుస్తున్న హైందవ చైతన్యం ఏదో ఒక రాష్ట్రానికో, ప్రాంతానికో పరిమితం కావడం లేదు. ప్రాంతాలు, రాష్ట్రాలు, కులాలు, మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా ఈ భావన పెరిగిపోతోంది.
ఇంకా చెప్పాలంటే.. ఇప్పటిదాకా ఇలా ఉండకపోవడమే పెద్ద తప్పు అని చాలా మంది హిందువులు అనుకుంటున్నారు. పెల్లుబుకుతున్న భక్తి భావనకు అనుబంధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకూ ఆదరణ పెరిగింది. భజనలు, కీర్తనలు, పాటలు, ప్రసంగాలు, ప్రవచనాలు.. ఇలా ఒకటేమిటి.. దేవుడితో ముడిపడ్డ ప్రతి విషయానికీ డిమాండ్ పెరిగింది. చాలా ఆలయాల్లో కేవలం పూజలు చేసుకోవడమే కాదు.. ఆ పూజలు పద్ధతి ప్రకారం జరుగుతున్నాయా.. లేదా అని కూడా భక్తులు నిశితంగా గమనిస్తున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా.. ఆలయ బోర్డులకు ఫిర్యాదులు చేస్తున్నారు. గుడి ప్రతిష్ఠకు తగినట్టుగా పూజలుండాలని సూచనలు చేస్తున్నారు. అవసరమైతే పీఠాధిపతులు, స్వామీజీల మార్గదర్శనం తీసుకోవాలని కూడా సలహాలిస్తున్నారు. దీంతో గతంలో మాదిరిగా ఏమరుపాటుగా ఉంటే కుదరదని అన్ని ఆలయాల బోర్డులు అప్రమత్తమయ్యాయి. ఎవరికి వారు ఎప్పటికప్పుడు భక్తుల దగ్గర సూచనలు తీసుకుంటూ.. పొరపాట్లుంటే సవరించుకుంటున్నారు.
దేశంలో పెరిగిన హైందవ భావన.. కేవలం ఆలయాల్లో రద్దీకే పరిమితం కావడం లేదు. పనిలోపనిగా కొత్త కొత్త ఆలయాల నిర్మాణం పాడుబడ్డ ఆలయాల పునరుద్దరణ ఇవన్నీ కూడా దేశంలో వేగంగా జరుగుతున్నాయి. భక్తి భావన అనేది ఒక ఉద్యమంలా జనంలో పెరుగుతోంది. దీనికి కచ్చితంగా కేంద్రంలో మోడీ సారథ్యంలో బీజేపీ చేసిన ప్రయత్నమేనని అంగీకరించక తప్పదు. అయోధ్య ఆలయం పునురుద్దరించడం, కాశీలో సంస్కరణలు చేపట్టడం దేశంలో ఇలా ఎన్నో ఆలయాలను సంస్కరించడం ద్వారా ప్రజల్లో ఆ భావన బాగా పెంచగలిగారు. ప్రధాని స్వయంగా ఆలయాలను సందర్శించడం పూజా పునస్కారాల్లో, యాగాల్లో, యజ్ఞాల్లో పాలు పంచుకోవడం ద్వారా దేశ ప్రజలను ప్రభావితం చేయగలిగారు. సహజంగానే హిందూ మతంలో కరుడుగట్టిన మత ఛాందసవాదంఉండదు. ముఖ్యంగా మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి, ధనిక వర్గాలు హిందూ మతస్తులే కానీ, పండుగ రోజు దేవుడికి దండం పెట్టుకోవడమే తప్ప మత ఆచారాలను ఒక నిత్య క్రతువుగా చేయరు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితిలో మార్పు వచ్చింది. స్వయంగా దేశ ప్రధాని కూడా పూజలు చేస్తుంటే.. అంత బిజీ షెడ్యూల్‌లోనూ ఆలయాల సందర్శన చేస్తుంటే.. మనం హిందువులం అని చెప్పుకుంటే సరిపోతుందా.. మన శక్తిమేర మనమూ చేయాలికదా అనే ఆలోచన హిందువులందరిలో మొగ్గ తొడిగింది. అందుకు నిదర్శనందగానే కుంభమేళాలో ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి. చార్‌ధామ్ యాత్రకు ఏటా యాత్రికులు పెరుగుతున్నారు. వైష్ణోదేవి, ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం.. ఇలా ఒకటేమిటి. కాస్త పేరున్న గుడి అయితే చాలు.. దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు దర్శనానికి వచ్చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయి రద్దీ చూడని ఆలయాలు కూడా మారిన పరిస్థితులకు అనుగుణంగా సిద్ధమౌతున్నాయి.
హిందువుగా జీవించండి. హిందువై పుట్టినందుకు గర్వించండి అనే భావన ఇప్పుడు దేశవ్యాప్తమైంది. ఇలా చేయకపోతే మనం వెనుకబడతాం.. మన మతం పలుచనైపోతుందనే స్పృహ బాగా పెరిగిపోయింది. అందుకే ఆలయాల సందర్శన విషయంలో బడ్జెట్ లెక్కలు కూడా ఎవరూ వేసుకోవడం లేదు. పైగా దైవకార్యానికి లెక్కలేమిటని ప్రశ్నిస్తున్నారు. అవసరమైతే ఇతర ఖర్చులు తగ్గించుకునైనా యాత్రలు చేయాల్సిందే అనే పోకడ వచ్చేసింది. దీనికి అయోధ్యలో బాలరాముడి విగ్ర ప్రతిష్ఠే అతి పెద్ద నిదర్శనం. ఆ సమయంలో అయోధ్యకు దేశం నలుమూలల నుంచి యాత్రికులు తరలివచ్చారు. అలా వచ్చినవాళ్లు కేవలం దర్శనం కోసం రావడం మాత్రమే కాదు.. వ్రత దీక్ష తీసుకున్నవారు, ఉపవాసాలు చేసి వచ్చినవారు.. రకరకాలుగా రాముడిపై భక్తిని చాటుకోవటానికి వచ్చినవాళ్లు కనిపించారు. ఒక్కొక్కరి భక్తి పారవశ్యం.. మిగిలినవారందరిలోనూ భక్తి భావనను మరింత పెంచిందని భక్తులు కథలు కథలుగా చెప్పుకున్నారు. అలా కేవలం ఆలయాల సందర్శన అంటే.. వచ్చామా.. చూశామా.. వెళ్లామా అన్నట్టు ఉండకూడదనే భావన కూడా మొగ్గ తొడిగింది. ఆలయ సందర్శన అంటే ఆధ్యాత్మిక అనుభూతిని సొంతం చేసుకుని వెళ్లాలని భావిస్తున్నారు. అందుకోసం క్షేత్ర దర్శనం సందర్భంగా ఎలా ఉండాలి.. ఏం చేయాలి.. ఎలాంటి నియమాలు పాటించాలో.. తెలుసుకుని మరీ సేవిస్తున్నారు. అది చిన్నదా.. పెద్దదా అనే మీమాంస వదిలేసి.. దైవానికి సంబంధించిన ఏ పని అయినా అత్యంత శ్రద్ధాసక్తులతో చేసే అలవాటు పెరిగింది. ఎవరైనా పొరపాటు చిన్న తేడా చేసినా.. మీలాంటి వాళ్ల వల్లే హిందూమతం చులకనైపోతోందని ఫైరైపోతున్నారు. దీంతో గతంలో మాదిరిగా హిందూ మతాన్ని కాని, ఆచారాల్ని కానీ లైట్ తీస్కునే పరిస్థితి లేదు.
పైగా ఈ విషయంలో ఇతర మతాలతో పోల్చుకునే ధోరణి కూడా వచ్చేసింది. వారు వారి మతాల్ని అంత నిష్ఠగా గౌరవిస్తున్నప్పుడు.. మనం ఎందుకు ఉండకూడదనే ఆలోచన హిందువుల్లో మార్పు తెచ్చింది. వారంలో ప్రతిరోజూ ఆలయాలకు వెళ్లేంత మంది దేవుళ్లు, దేవతలు ఉన్నా.. ఇన్నాళ్లూ మనమే పట్టించుకోలేదనే స్వీయ అపరాధ భావన వారిని కుదురుగా ఉండనీయడం లేదు. దీంతో పంచాంగాలు చూసుకుని మరీ తిథులు తెలుసుకుని.. అందుకు తగ్గట్టుగా పూజలు చేసే ధోరణి పెరిగింది. ఇల్లు, బహిరంగ ప్రదేశం, గుడి, పుణ్యక్షేత్రం.. ఎక్కడ వీలైతే అక్కడ.. పూజ, వ్రతం, హోమం, ఉత్సవం.. ఎలా వీలైతే అలా చేసే ధోరణి ఊపందుకుంది. ఎక్కడ చేసినా.. ఎలా చేసినా అది చేయాల్సిన తిథిలోనే చేస్తున్నారు. ఆ విషయంలో ఎక్కడా తేడా రాకుండా ఎవరికి వారే జాగ్రత్తపడుతున్నారు.
ఇంతకుముందు పండగల విషయంలో సందేహాలొస్తే.. ఏరోజైతే ఏముందిలో అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడలా అనుకోవడం లేదు. ఏ పండగ ఏ రోజు వచ్చిందో తెలుసుకోవటానికి ఎక్కడిదాకా అయినా వెళ్లి సందేహ నివృత్తి చేసుకుంటున్నారు. అంతేకాదు ఆ రోజే ఎందుకు చేయాలో.. అలా ఏ ధర్మగ్రంథంలో ఉందో.. అది ఎందుకు ప్రామాణికమో కూడా ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత తాము తెలుసుకున్న సమాచారాన్ని సోషల్ మీడియాలో తెలిసినవారితో షేర్ చేసుకుంటున్నారు. కొందరైతే ప్రతిరోజూ ఉదయాన్నే తిథి, వార, నక్షత్రాలతో సహా ఆ రోజు ప్రత్యేకతను చెప్పే పోస్ట్ తోనే సోషల్ మీడియాలో రోజు ప్రారంభిస్తున్నారు. కొంతమందైతే ఎక్కడైనా పురోహితులు ప్రత్యామ్నాయాలు చెప్పినా ఒప్పుకోవడం లేదు. మీరే ఆచారాలు తప్పిస్తే.. ఎలాగని వారికీ క్లాస్ పీకుతున్నారు. ఇలా హిందువుల్లో పెరిగిన మతవిశ్వాసం చూసిన తర్వాత ప్రభుత్వాలు కూడా హిందూ పండగల విషయంలో గతానికి మించిన శ్రద్ధ తీసుకుంటున్నాయి. ఒకటికి పదిసార్లు పండితుల్ని సంప్రదించాకే తేదీలు ప్రకటిస్తున్నాయి. అవసరమైతే స్వామీజీలు, పీఠాధిపతుల మార్గదర్శనం తీసుకుంటున్నాయి. అంతే కానీ అనవసర రిస్క్ తీసుకోవటానికి సిద్ధపడటం లేదు.
దేశవ్యాప్తంగా హిందువుల్లో పెరిగిన చైతన్యం.. చాలా ఆలయాల్లో ఆగిపోయిన సంప్రదాయాలను మళ్లీ మొదలుపెట్టేలా చేస్తోంది. గతంలో ప్రత్యేకమైన పూజలకు మాత్రమే పురోహితులను పిలిచేవాళ్లు.ఇప్పుడు ప్రతి పండక్కీ ఇళ్లలో పురోహితుల్న పిలిచి పూజలు చేయించుకునే సంస్కృతి వచ్చేసింది. చాలా మంది పండగలకు ముందే పురోహితులకు చెప్పి.. తప్పకుండా తమ ఇంటికి రావాలని పిలుస్తున్నారు. వచ్చేదాకా వారి వెంట పడుతున్నారు. ఇంకొందరు మరో అడుగు ముందుకేసి.. ఎందుకైనా మంచిదని ఇద్దరు ముగ్గురికి చెప్పి జాగ్రత్తపడుతున్నారు. ఇలా వ్యక్తిగతం నుంచి సామూహికం దాకా.. ఇంటి నుంచి గుడి దాకా.. ఎక్కడ చూసినా పొంగి పొర్లుతున్న హైందవ చైతన్యం.. మొత్తంగా సమాజాన్నే ఆధ్యాత్మిక తరంగాల్లో ముంచెత్తుతోంది. ఇదే అదనుగా మన దేవుళ్లు, దేవతల గురించి పురాణాల్లో ఉన్న ఎన్నో కథలు కొత్తగా ప్రాణం పోసుకుని.. జనం ముందుకొస్తున్నాయి. ఇప్పటివరకు తమకు తెలియని కథల్ని అందరూ ఆసక్తిగా వింటున్నారు. వీలైనంత ఎక్కువమంది దేవతలు, దేవుళ్ల మహిమల గురించి వినటానికి ఆసక్తి చూపుతున్నారు. చివరకు తమ సమీపంలో ఉన్న ఆలయ చరిత్రను తెలుసుకోవటానికి కూడా వెనుకాడటం లేదు. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు.. ఎవరికి అందుబాటులో ఉన్న గుడి వారికి పుణ్యక్షేత్రంతో సమానమేననే కొత్త కాన్సెప్ట్ వచ్చేసింది. కొన్ని ప్రాంతాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాల్ని అనుసరిస్తూ.. స్థానిక ఆలయాల్లో ఉత్సవాలకు కూడా కొత్తగా టెంకాయ కొడుతున్నారు. మతాచారాల విషయంలో తగ్గేదేలేదనేలా వ్యవహరిస్తున్నారు.
ఇప్పుడు యువత, మహిళలు, ఆలోచన విధానంలో చాలా మార్పు వచ్చింది. పూజ పునస్కారాలు, ఆలయాలు సందర్శనలు నిత్య జీవితంలో ప్రధాన భాగం అయ్యాయి. ఇప్పుడు ఏ ఆలయంలో చూసినా యువతే ఎక్కువగా కనిపిస్తున్నారు. చాంతాడంత క్యూలైన్ ఉన్నా.. చాలా ఓపికగా నిలబడి దైవదర్శనం చేసుకుంటున్నారు. సోషల్ మీడియా ఫుల్ యాక్టివ్‌గా ఉండే యువత అక్కడ కూడా తమ భక్తి పారవశ్యాన్ని చాటుతున్నారు. భగవద్గీత శ్లోకాలు, వాటి అర్ధాలను ప్రచారం చేస్తున్నారు. పండగలు, దేవుళ్లకు సంబంధించిన శ్లోకాలను సందర్భానుసారంగా షేర్ చేస్తున్నారు. పనిలోపనిగా వాటి మహత్తును వివరిస్తూ చిన్న నోట్ పెడుతున్నారు. దీంతో ఇప్పుడిదో కొత్త ట్రెండ్‌గా తయారైంది. ఈ మాత్రం కూడా చేయకపోతే హిందువులం ఎలా అవుతామనే ధోరణి అంతర్లీనంగా కనిపిస్తోంది. ఒక రకంగా దేశంలో ప్రాంతాలతో సంబంధం లేకుండా మనమంతా హిందువులం అనే భావన పెరిగింది. దీనివల్ల కొందరికి రాజకీయ ప్రయోజనాలు జరగవచ్చు కానీ,.. ప్రజల్లో మాత్రం హిందూ ధర్మం పట్ల, దైవం పట్ల విశ్వాసం నమ్మకం పెరిగాయి. ఇండియా హిందూ దేశం. ఇక్కడ ప్రధాన మతం హిందూ మతం. 80శాతం ప్రజలు హిందూ మతాన్ని అనుసరిస్తారు.. అనేది ప్రపంచ వ్యాప్తంగా కూడా అందరిలోకి వెళ్లింది. మిగతా దేశాలు కూడా హిందువులు, హిందూ పండగలు, సంప్రదాయాల విషయంలో జాగ్రత్తగా ఉంటున్నాయి. వారి మనోభావాలు దెబ్బతినకుండా నడుచుకుంటున్నాయి. అవసరమైతే ప్రత్యేక సడలింపులు కూడా ఇస్తున్నాయి. ఇందుకోసం భారత్ ప్రభుత్వం సలహాలు తీసుకునే దేశాలు కూడా ఉన్నాయంటే నమ్మాల్సిందే.
మతం ఇప్పుడు ఆర్థిక రంగంలో కూడా కీలకపాత్ర పోషిస్తోంది. దేశ జీడీపీలో పర్యాటక ఆదాయం వాటా 9.6 శాతం. ఇందులో దేశీయ పర్యాటకం 88శాతం. గతేడాది ఇండియా సందర్శించిన విదేశీ పర్యాటకులు కేవలం 90 లక్షలు కాగా, స్థానిక యాత్రికుల సంఖ్య కళ్లు చెదిరేలా 14 కోట్లను దాటింది. కేంద్ర ప్రభుత్వాలు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఢిల్లీ-ఆగ్రా-జైపూర్ స్వర్ణ త్రిభుజం మీద అధిక శ్రద్ధ పెడుతుంటాయి. వాస్తవానికి తమిళనాడు సందర్శించేవారు అత్యధికంగా 20 శాతం ఉన్నారు. ఢిల్లీ పర్యాటకులు వారిలో సగం ఉంటారు. దక్షిణాది రాష్ట్రాలు దేశవిదేశాల టూరిస్టులను ఆకర్షించడంలో ముందు వరసలో నిలుస్తాయి. కారణం మతపరంగా ప్రముఖమైన తిరుపతి, మదురై వంటి ప్రదేశాలు వీటిలో ఎక్కువగా ఉండటమే. తిరుపతి వల్ల ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే అతిపెద్ద దేశీయ పర్యాటక ప్రదేశంగా రూపొందింది. మతపరమైన పర్యాటకం ఇప్పుడు అతిపెద్ద వ్యాపారం. అందుకే కశ్మీర్లో అమర్‌నాథ్ యాత్ర దగ్గర్నుంచి.. కేరళలో శబరిమల యాత్ర వరకు ఎక్కడచూసినా అధిక సంఖ్యలో పర్యాటకులు కనిపిస్తున్నారు. ఏటా కొత్త రికార్డులు నమోదవుతూనే ఉన్నాయి. అందుకే ఇటీవలి కాలంలో ప్రముఖ ఆలయాల బోర్డులు భక్తుల రద్దీ నియంత్రణ, తగిన ఏర్పాట్ల విషయంలో సలహాల కోసం టీటీడీని సంప్రదిస్తున్నాయి. దశాబ్దాలుగా కోట్ల మంది భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం సజావుగా జరిగేలా చూస్తున్న టీటీడీ అనుభవాలు తమకూ అందించాలని కోరుతున్నాయి. ఈ పరిణామాలన్నీ పెరుగుతున్న ఆధ్యాత్మిక పర్యాటకానికి తిరుగులేని నిదర్శనాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
దేశంలో పెరుగుతున్న హిందూ చైతన్యం.. ప్రపంచాన్ని విశేషంగా ఆకర్షిస్తోంది. గతంలో హిందువుల్ని పెద్దగా పట్టించుకోని పశ్చమ దేశాల సంస్థలు కూడా ఇప్పుడు హిందువుల ఆచారాలు, సంప్రదాయాలు, ఆలయాల సందర్శనపై ప్రత్యేక సర్వేలు చేస్తున్నాయి. సేకరించిన సమాచారం ఆధారంగా సవివరమైన నివేదికలు రూపొందిస్తున్నాయి. గడచిన నాలుగైదేళ్లలో గతంలో కంటే అధికంగా మతం మీద మమకారం పెంచుకున్న భారతీయులు 25 శాతం పైగానే ఉన్నారని ప్యూ సంస్థ నిర్వహించిన గ్లోబల్ యాటిట్యూడ్ సర్వే తేల్చింది. ఇది ఏ ఒక్క మతానికో పరిమితం కాదు. అన్ని మతాల్లోనూ ఈ ధోరణి కనబడింది. మతం ఎంతో ముఖ్యమైందని భావిస్తున్న వారు ఏకంగా 80 శాతానికి పెరిగారు. నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ నివేదిక ప్రకారం, మత ప్రదేశాల సందర్శనలపై చేసిన సగటు వ్యయం ఇదే కాలంలో రెట్టింపు కంటే ఎక్కువైంది. మత వ్యాపారానికి ఆకాశమే హద్దు. అయితే దేశంలో మెజార్టీ హిందువులు కావడంతో.. హిందూ ఆలయాలన్నీ భక్తుల రద్దీతో బిజీగా ఉంటున్నాయి. చివరకు సీపీఎం కమ్యూనిస్టు ప్రభుత్వ హయాంలో కేరళ దేవాలయ బోర్డులు విగ్రహాల మహిమల గురించి ప్రచారం చేసే స్థితికి చేరింది. ఆ స్థాయిలో దేశంలో పరిస్థితులు మారిపోయాయి. మారిన ప్రజల ఆలోచనా ధోరణే ఈ మార్పుకు కారణమని చెప్పటానికి పెద్దగా సందేహించాల్సిన పనేం లేదు.
చరిత్రలో సాంస్కృతిక పునరుజ్జీవనం జరిగింది. ఇప్పుడు దేశంలో నిశ్శబ్దంగా హిందువుల్లో జరుగుతోంది కూడా అంతకు తక్కువేం కాదనే అభిప్రాయాలున్నాయి. అయితే ఇది ప్రతి హిందువులోనూ అంతర్లీనంగా జరుగుతోంది. ఎవరికి వారే తమ వంతుగా మతానికి ఎంతో కొంత సేవ చేయాలనే భావన పెంపొందించుకుంటున్నారు. ఆలయాలకు ఇచ్చే విరాళాలు పెరిగాయి. ఏడాదికోసారి పూజలు చేసేవాళ్లు.. ఇప్పుడు నిత్యపూజల కోసం వస్తున్నారు. ఎంత సంపాదిస్తే ఏంటి..? ఉడతాభక్తి దేవుడికి సమర్పించుకోవడమే ముఖ్యమనే ధోరణి బాగా పెరిగింది. కొంతమందైతే దానాలు, ఆధ్యాత్మిక సేవ విషయంలో గురువుల సలహాలు తీసుకుని మరీ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటివరకూ ఏం జరిగింది..? మనం ఇంతకుముందు ఎలా ఉన్నాం..? అనే విషయాలు గురించి ఎవరూ ఎక్కువగా ఆలోచించడం లేదు. గతం గతహ. ఇకముందేం చేయాలో చూద్దాం అనుకుంటున్నారు. తమలో వచ్చిన ఈ హైందవ చైతన్యం సజావుగా తర్వాతి తరాలకు కూడా వెళ్లాలనే తపనతో కనిపిస్తున్నారు. అందుకోసం గతానికి భిన్నంగా పెద్ద ఎత్తున పిల్లల్ని కూడా మత సంబంధమైన కార్యక్రమాల్లో బహిరంగంగానే భాగం చేస్తున్నారు. ఎవరైనా అభ్యంతరం చెప్పినా.. చిన్నప్పటి నుంచి మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెరగాలని చెబుతున్నారు. ఇటీవల విద్యాసంస్థల్లో కూడా దీక్షావస్త్రాలు అనుమతించకపోతే విద్యార్థుల తల్లిదండ్రులు ఊరుకోవడం లేదు. అవసరమైతే స్కూలు మానిపిస్తాం కానీ.. వస్త్రాల విషయంలో ఆంక్షలకు తలొగ్గేది లేదంటున్నారు. దీంతో విద్యాసంస్థలే తమ నిబంధనలు మార్చుకోవాల్సి వస్తుంది. అదే పదేళ్ల క్రితం ఇలాంటి ఘటనలు ఊహకు కూడా అందనివి. మొత్తం మీద దేశంలో హిందువులు జాగృతమయ్యారనే వాదన వినిపిస్తోంది. దీనికి తోడు కేంద్రంలో మోడీ సర్కారు ప్రోద్బలం ఉండనే ఉంది. ఎవరేమనుకున్నా.. తమ మత భావనల విషయంలో రాజీపడకూడదనే కొత్త ధోరణి హిందువుల్లో కనిపిస్తోంది. పదేళ్ల క్రితం హిందువుల్లో ఇలాంటి పోకడ లేదు. ఇప్పుడు మాత్రం మతాచారాల ప్రదర్శనకు కూడా వారు వెనుకాడటం లేదు. పైగా అలా చేయకపోతే మిగతా మతాలతో పోలిస్తే వెనుకబడిపోతామనే ఆలోచనతో ఉంటున్నారు. ఇన్నాళ్లూ ఇలా ఉండకపోవడమే తప్పు కానీ.. ఇప్పుడు చేసేది మాత్రం కరెక్టేననే నమ్మకం బాగా పెరిగింది. ఈ చైతన్యం వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయనే ప్రచారం జరుగుతున్నా.. జనం మాత్రం దాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఎవరికో రాజకీయ లబ్ధి వస్తే.. దాంతో మాకేం సంబంధమని ప్రశ్నిస్తున్నారు. ఇదీ ఈ వారం ఛైర్మన్స్ డెస్క్. మరో అంశంపై విశ్లేషణతో మళ్లీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.
