Site icon NTV Telugu

Chairman’s Desk: ఏపీకి శాశ్వత రాజధాని కావాల్సిందే కానీ..!

Cd

Cd

Chairman’s Desk: ఆంధ్రులకు రాజధాని శాపం ఉన్నట్టుగా ఉంది. పిల్లి పిల్లల్ని తిప్పినట్టుగా చెన్నయ్, కర్నూలు, హైదరాబాద్‌, ఇప్పుడు అమరావతి. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు కావస్తోంది. ఇప్పటి వరకు ఒక స్థిరమైన రాజధాని ఏర్పడలేదు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు కూడా మూడేళ్లలో రాజధానిని ఏర్పాటు చేసుకోగలిగాయి. రాజకీయ కారణాలు, వ్యక్తిగత ప్రయోజనాలు, ఇలా రకరకాల కారణాలతో ఏపీ రాజధాని అర్ధంకాని బ్రహ్మపదార్ధంగా మారిపోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే… ఏ రాష్ట్ర రాజధాని కూడా ఒకేసారి సమగ్రంగా ఏర్పడలేదు. అది కొన్ని దశాబ్దాలు, శతాబ్దాల వరకు విస్తృతమవుతూ వచ్చింది. దాని అవసరాలకు తగినట్టుగా పెరుగుతూ ఉంటుంది. హైదరాబాద్‌ కూడా ఒక్కరోజులో అవతరించలేదు. ఏ ఒక్క పాలకుడూ దీనిని నిర్మించలేదు.ఎందుకంటే ఒకప్పడు 1990లో హైదరాబాద్‌ లిమిట్స్ ఇటు జూబిలీహిల్స్, అటు కూకట్‌పల్లి, ఇటు దిల్‌సుఖ్ నగర్ వరకే ఉండేది. కానీ ఆ తరువాత జనాభా అవసరాలకు తగినట్టుగా అది పెరుగుతూ వచ్చింది. దీనికి 400 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆ విషయాన్ని ఎవరూ మరిచిపోకూడదు. అంచెలవారీగా చేసుకుంటూ వెళ్తుంటే, ఒక రెండు దశాబ్దాల నాటికి పూర్తవుతుంది. బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, కార్యకలపాలు ప్రారంభిస్తే క్రమంగా కొన్నాళ్లకు ఒక రూపం వస్తుంది. ప్రస్తుతం ఏపీ ప్రజలు కూడా ఇదే అనుకుంటున్నారు. రాష్ట్రాభివృద్ధికి రాజధాని కీలకం కాబట్టి.. ఆ పనులు త్వరగా ఓ కొలిక్కి తీసుకురావాలని ఆశపడుతున్నారు. ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.

Read Also: Sreeleela : వరుస ఫ్లాప్స్ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన శ్రీలీల రెమ్యునరేషన్!

ఏపీ ప్రజలకు రాజధాని నిర్మాణం పూర్తి కావాలి. ఇప్పటిదాకా ఏ అధికారి ఎక్కడుంటారో తెలియటం లేదు. ఎవర్ని కలవాలంటే ఎక్కడకు వెళ్లాలనే విషయంపై క్లారిటీ లేదు. మిగతా రాష్ట్రాల్లో రాజధానికి వెళ్తే.. అన్ని పనులు పూర్తవుతున్నాయి. కానీ ఏపీలో మాత్రం అలా ఎక్కడికి వెళ్తే అన్ని పనులు జరుగుతాయనేది ఇంకా తేలలేదు. ఎందుకంటే ఇప్పటికీ అన్ని ఆఫీసులూ అమరావతి నుంచి పనిచేయటం లేదు. నిజంగా ఉద్యోగులందరూ తరలివచ్చినా.. అక్కడ సరిపడ సౌకర్యాలు కూడా లేవు. ఇటు ప్రజల అవసరాలు, అటు ఉద్యోగుల సౌకర్యాలు కూడా తీర్చకుండా.. విస్తృత నగర నిర్మాణం పేరుతో కాలయాపన చేయడం ఎంతవరకు సబబనేది ఏపీ నేతలు ఆలోచించుకోవాలి.

Read Also: US Iran Tensions: ఇరాన్‌పై దాడికి యూఎస్ సిద్ధం.. ఖతార్ ఎయిర్‌బేస్‌లో విమానాల మోహరింపు..

విభజన జరిగిన పన్నెండేళ్లు కావస్తోంది. కానీ ఇంతవరకూ ఏపీ రాజధాని రూపు దిద్దుకోలేదు. మూడు ప్రభుత్వాలు వచ్చినా.. రాజధాని కొలిక్కిరాకపోవడం.. ఏపీకి లోటుగానే ఉంది. దేశంలో పాత రాష్ర్టాలు, కొత్త రాష్ర్టాలనేకం ఉన్నాయి. కొన్నిటికి పాత రాజధానులు కొనసాగుతుండగా, కొన్నిటికి కొత్తవి ఏర్పడ్డాయి. కాని దేశంలో ఏ ఒక్క ప్రాంతానికి రాజధాని ఒక సమస్యగా మారలేదు.1947 నుంచి ఇప్పటి వరకు ఈ సమస్యను ఎదుర్కొంటూ వస్తున్న ఏకైక జాతి ఆంధ్రులు మాత్రమే. ఇది విచిత్రంగా కనిపిస్తుంది. విభజిత ఆంధ్రప్రదేశ్ కు ఒక సుదీర్ఘమైన చరిత్ర, సంస్కృతులున్నా యి. భూములు, గనులు, ప్రకృతి సంపదలు, సముద్ర తీర రూపంలో యావద్దేశంలోనే పేరుపొందిన సంపన్న ప్రాంతాల్లో అది ఒకటి. 19వ శతాబ్దపు మధ్య కాలం నుంచి, వ్యవసాయ ఆధునీకరణలు, జాతీయ-అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానాలు, పారిశ్రామిక-వాణిజ్యాభివృద్ధులు, వ్యవసాయ మిగులునూ వాణిజ్య మిగులునూ ఆధారం చేసుకొని ఆంధ్రులు మద్రాస్‌ ప్రెసిడెన్సీ ప్రాంతాలన్నిటా ఎదుగుతూ పోయాయి. ఈ విధంగా ఆంధ్రులు మద్రాస్ ప్రెసిడెన్సీలోనే గాక, దేశంలోనే బలమైన వర్గాలలో ఒకటిగా తయారు అయ్యాయి. ఇటువంటి ఆంధ్ర జాతికి తమదైన రాజధాని ఒకటి స్థిరమైన రూపంలో ఎప్పుడో ఏర్పడి ఉండవలసింది. అది ఈ సరికి ఎంతో అభివృద్ధి చెందవలసింది.

కాని ఇదేమీ జరుగలేదు. దేశంలోని మరే జాతికీ, ప్రాంతానికి లేనివిధంగా, రాజధాని లేని అయోమయ స్థితి కనిపిస్తోంది. రాష్ట్ర విభజన దగ్గర్నుంచీ ఏపీకి సమస్యలున్నాయి. కానీ విభజన తర్వాత రాజధాని నిర్మాణం కొత్త సమస్యగా తయారైంది. నిజానికి విభజన జరిగాక తొలి ఐదేళ్లలోనే శాశ్వత రాజధాని నిర్మించాల్సింది. అప్పట్లో ప్రధాని మోడీ స్వయంగా అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు మొదట తాత్కాలిక రాజధాని అన్నారు. నిర్మించిన కొన్ని భవనాలు కూడా తాత్కాలికమే అన్నారు. దీంతో శాశ్వత భవనాల నిర్మాణం మొదలు కాకుండానే తొలి ఐదేళ్లు గడిచిపోయాయి. ఆ తర్వాత వచ్చిన జగన్.. మూడు రాజధానులంటూ కొత్త ఆలోచన చేశారు. ఆ తర్వాత ఆ తీర్మానం వెనక్కు తీసుకున్నారు. పాత రాజధాని ప్రతిపాదనలు పక్కన పడేశారు. అలాగని కొత్తగా ఎక్కడా నిర్మాణాలు చేపట్టలేదు. అలా ఐదేళ్లూ వృథా చేసేశారు. ఇప్పుడు మరోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మళ్లీ అమరావతి నిర్మాణమే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతున్నారు. ఇక్కడ రాజధాని నిర్మాణాన్ని త్వరగా కొలిక్కితెచ్చే ప్రక్రియ చేపట్టకుండా సుదీర్ఘకాలం రాజధాని నిర్మాణం పేరుతో సమయం గడిచిపోతోంది. ఈ సర్కారు హయాంలో అయినా రాజధాని పనులు ఓ కొలిక్కి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడ చంద్రబాబు సర్కారు భారీ ఆలోచనలు చేయటాన్ని ఎవరూ తప్పుబట్టడం లేదు. కానీ మొదట ప్రాథమిక మౌలిక వసతులతో ప్రభుత్వ పాలనకు ఆటంకం లేకుండా రాజధానికి ఓ రూపు ఏర్పడాలి. అప్పుడు రాజధాని గురించిన చర్చ ఆగిపోతుంది. అటు ప్రజలు, ఇటు ఉద్యోగులు కూడా నిశ్చింతగా ఉంటారు. ఆ తర్వాత దశల వారీగా రాజధాని అభివృద్ధి చెందే క్రమంలో.. విస్తృత నగరం ఏర్పాటవుతుంది. కానీ ఆ వాస్తవాన్ని విస్మరించి.. ఒకేసారి అతి పెద్ద నగరం నిర్మించాలనే ఆలోచనే రాజధాని నిర్మాణంలో ఆలస్యానికి కారణమౌతోంది.

ఏ రాష్ట్రం అయినా కొత్తగా ఏర్పాటైనప్పుడు.. దాని రాజధానికి కచ్చితంగా రూపం కావాలి. అది వీలైనంత త్వరగా ఏర్పడాలి. ఈ విషయం చాలా అవసరం. సాధారణంగానే రాజధానులు రాష్ట్రాలకు కీలకం. అలాంటిది విభజిత రాష్ట్రమైన ఏపీ అభివృద్ధి బాట పట్టాలంటే .. రాజధాని నిర్మాణం ఓ కొలిక్కిరావడం కూడా అవసరం. కానీ ఏపీలో రాజధాని పనులు వేగంగా సాగడం లేదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. పైగా రాజధాని నిర్మాణంపై చాలా సందేహాలున్నాయి. ఆ సంశయాలను తొలగించాల్సిన అవసరం ప్రభుత్వాలపైనే ఉంటుందనడంలో సందేహం లేదు. రాజధాని నిర్మాణాన్ని మొదట ప్రణాళికల పేరుతో కొన్నాళ్లు, తర్వాత నిధుల పేరుతో మరికొన్నాళ్లు సాగదీత వ్యవహారం కొనసాగింది. ఎప్పటికప్పుడు రాజధాని పనులు ఊపందుకున్న ఛాయలు కనిపించడం.. అంతలోనే నత్తనడకన నిర్మాణాలు సాగటం.. ఏపీ ప్రజలకు రొటీన్ తంతు అయిపోయింది. అందుకే వారికి అనుమానాలు ఎక్కువౌతున్నాయి.

జీవితంలో ఎదగాలని ప్రతి మనిషికి ఓ ప్రణాళిక ఉంటుంది. మనిషి ఎదగడానికి అతడి శక్తిసామర్థ్యాలు, ఆలోచనలు మాత్రమే కాదు.. నివసించే ప్రాంతం కూడా చాలా కీలక పాత్ర పోషిస్తోంది. ఏ రాష్ట్రంలో అయినా రాజధాని పరిసరాల్లో స్థిర నివాసం ఏర్పరుచుకుంటే.. మెరుగైన అవకాశాలు ఉంటాయని, జీవితంలో ఎదగొచ్చని సామాన్యులు అనుకోవడం సహజం. అలా అనుకుంటారు కనుకే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కు వలసలు భారీగా పెరిగాయి. ఇప్పుడు కూడా హైదరాబాద్ కు వలసలు కొనసాగుతున్నాయి. అదే ఏపీ విషయానికొస్తే.. ఇంతవరకూ రాజధాని నిర్మాణం పూర్తి కాలేదు. ఈ పరిస్థితి సుదీర్ఘకాలం కొనసాగడం మంచిది కాదు. ఇప్పటికే చాలా సమయం వృథా అయిందని నిపుణులు కూడా మొత్తుకుంటున్నారు.

దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర్నుంచీ చాలా రాష్ట్రాలు కొత్తగా ఏర్పడ్డాయి. అలాగే విభజన తర్వాత ఏపీ మాదిరిగా రాజధానులు కోల్పోయిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కానీ ఎక్కడా రాజధాని నిర్మాణం ఇంత సుదీర్ఘకాలం జరగలేదు. ప్రతి రాష్ట్రంలోనూ రాజధాని నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చి.. వీలైనంత త్వరగా దానికి రూపుదిద్దారు. దానికి ఎప్పుడో ఏర్పడ్డ గుజరాత్ నుంచి మొన్నీమధ్యే ఏర్పాటైన ఛత్తీస్ గఢ్ దాకా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఏపీలో ఇప్పటికైనా వీలైనంత త్వరగా రాజధాని నిర్మాణం పూర్తిచేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. ఇంకా ఎంతకాలం రాజధాని కోసం ఎదురుచూడాలని ప్రశ్నిస్తున్నారు. అటు భూములిచ్చిన రైతులదీ అదే కోరిక.

ఏపీ రాజధానిగా అమరావతి ఏర్పాటును ఎవరూ వ్యతిరేకించడం లేదు. సమస్యల్లా రాజధాని ఎప్పుడు ఏర్పడుతుంది? దాని విస్తృతి ఎంత అన్నదే! రాష్ట్రానికి ఒక స్థిరమైన రాజధాని కావాల్సిందే. అది అమరావతేనని నిర్ణయించేశారు కనుక దాంట్లో భిన్నాభిప్రాయాలు, బేధాభిప్రాయాలు అవసరం లేదు. 33వేల ఎకరాలు సమీకరించారు. ఆ 33వేల ఎకరాల్ని ఇప్పటి వరకు పూర్తిగా వినియోగించలేదు. మళ్లీ ఇప్పుడు 16వేల ఎకరాల భూ సమీకరణ ప్రారంభించారు. 33వేల ఎకరాలు సమీకరించి, ఆ రైతులందరికీ నష్ట పరిహారం చెల్లించి, వాళ్లకు స్థలాలిచ్చి, వాళ్లకు కాలనీలు నిర్మించి, అక్కడ ప్రజా జీవనాన్ని ప్రారంభించి, వారికి ఉద్యోగవకాశాలు ఇప్పించి, వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేసి, అవి పూర్తయిన తర్వాత.. అప్పుడు రాజధాని విస్తరణకు వెళ్తే బాగుంటుంది. రాజధాని నిర్మాణం అనేది దశల వారీగా జరగాలి. అది వదిలేసి, ఎవరెవరి ప్రయోజనాల కోసమో, మహాద్భుతాన్ని ఆవిష్కరించాలనే యావలో పడి, చివరవకి 12 ఏళ్లు కావస్తున్నా రాజధాని నిర్మాణం కొలిక్కి కాని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది. ఇప్పటికీ ఏపీ ఉద్యోగులకు కూడా ప్రజలకు సేవలు అందించటానికి తగిన వసతులు రాజధానిలో లేవనే అభిప్రాయాలున్నాయి. వారు వీకెండ్ వస్తే హైదరాబాద్ వచ్చేస్తున్నారు. ఇలాంటి స్థితిలో ఉద్యోగుల నుంచి మెరుగైన సేవలు ఆశించగలమా అనేది కీలక ప్రశ్న. అందుకే తొలిదశలో అనుకున్నట్టుగా గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని ప్రాథమిక మౌలిక వసతులతో పూర్తిచేస్తే.. ఆ తర్వాత జరగాల్సిన అభివృద్ధి అదే జరుగుతుంది. అప్పుడు సమయం గురించి ఎవరూ ప్రశ్నించరు. ఇప్పటిలాగా రాజాధానికి రూపం లేదనే మాట కూడా రాదు. కాబట్టి క్షేత్రస్థాయి వాస్తవాలను పరిశీలనలోకి తీసుకుని.. రాజధాని నిర్మాణం విషయంలో ఆచరణ సాధ్యమైన వ్యూహం రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది.

అయితే ఆరు దశాబ్దాలుగా హైదరాబాద్ పై ఆధారపడ్డ ఏపీ నేతలకు.. ఇప్పటికిప్పుడు ఏపీలోనూ హైదరాబాద్ లాంటి నగరాన్ని పునఃసృష్టించాలనే తాపత్రయం కనిపిస్తుంది. కానీ ఈ విషయంలో అంచనాలకు, వాస్తవాలకు ఉన్న అంతరమే రాజధానిపై అయోమయానికి తెరతీస్తోంది. అభివృద్ధి చెందుతూ వచ్చి.. ప్రస్తుతం ఆటోమోడ్ లోకి వెళ్లిన హైదరాబాద్ ను.. ఏపీలో ఉన్నపళంగా సృష్టించలేరనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. హైదరాబాద్ కు 400 ఏళ్ల చరిత్ర ఉంది. హైదరాబాద్ లో అభివృద్ధి ఒక్కసారిగా జరగలేదు. కాలానుగుణంగా జరుగుతూ వచ్చింది. అంతేకానీ చంద్రబాబు సీఎంగా ఉన్న తొమ్మిదేళ్లలోనో, వైఎస్ సీఎంగా ఉన్న ఆరేళ్లలోనో, కేసీఆర్ సీఎంగా ఉన్న పదేళ్లలోనో మొత్తం అభివృద్ధి అంతా జరిగిపోలేదు. హైదరాబాద్ లో అభివృద్ధి జరుగుతూ వచ్చి.. ప్రస్తుతం అది ఆటో మోడ్ లోకి వెళ్లిపోయింది. అందుకే ప్రభుత్వాలతో సంబంధం లేకుండా పెట్టుడులు వస్తున్నాయి. ఇలా కాలక్రమంలో హైదరాబాద్ ఎదిగిన తీరును పట్టించుకోకుండా.. ఏపీలో ఒక్కసారిగా హైదరాబాద్ లాంటి నగరం కట్టేయాలనుకోవడమే సమస్యగా మారుతోంది. హైదరాబాద్ లో వందల ఏళ్లలో జరిగిన అభివృద్ధిని.. ఏపీలో ఒక్కసారిగా చేసేయాలనుకోవడం సాధ్యం కాదు. మొదట ఏపీ నేతలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. వాస్తవాలకు అనుగుణంగా రాజధాని నిర్మాణం చేపడితే.. అది వీలైనంత త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అంతేకానీ ఇంకా హైదరాబాద్ పై ప్రేమతో అలాంటి నగరమే కావాలనే కోరికతో ఉంటే.. మాత్రం పరిస్థితి ఇలాగే ఉంటుంది. భౌగోళిక విస్తీర్ణం, వాతావరణం, పరిశ్రమలు, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాలు.. ఇలా ఏ అంశం చూసుకున్నా హైదరాబాద్ తో ఏపీ రాజధాని ప్రాంతానికి పోలిక లేదు.

హైదరాబాద్ 43 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇంత విశాల నగరంలో జరిగే అభివృద్ధిని.. కొన్ని వేల ఎకరాల్లో తలపెట్టిన కొత్త నగరంలో సాధ్యం చేస్తామని చెప్పడం హాస్యాస్పదమే అవుతుంది. హైదరాబాద్ కి కావలసినంత ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. వాతావరణం అన్ని రకాలుగా అనుకూలం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రోడ్స్… ఇతర మౌలిక సదుపాయాలన్నీ ఉన్నాయి. దీంతో ఈరోజుకి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు ముందుకు వస్తున్నారు. ప్రత్యేకంగా వాళ్ళని ఆహ్వానించాల్సిన అవసరం లేకుండానే వాళ్లకు అన్ని రకాలుగా అనుకూలమైన ప్రాంతం కనుక… హైదరాబాద్ కి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు.కానీ.. ఇదే మోడల్ లో మరొక చోట జరగాలంటే అది సాధ్యం కాకపోవచ్చు. హైదరాబాద్ ఆలోచన వదిలేసి.. ఏపీకి ఎలాంటి రాజధాని అవసరమో అలాంటిది నిర్మించుకుంటే.. త్వరగా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పన్నెండేళ్లు కావస్తున్న సంగతి గుర్తుంచుకుని.. ఇప్పటికైనా త్వరపడాలని నేతలు గుర్తుంచుకోవాలి. రాజధాని అనేది అవసరమే కానీ.. విలాసం కాదనే విషయం గమనంలోకి తీసుకోవాలి.

ప్రతి రాజధానికీ తనదైన లక్షణాలు ప్రత్యేకంగా ఉంటాయి. అసలు ఏ రాజధానినీ మరో రాజధానితో పోల్చాల్సిన పని లేదు. దాని కారణంగా వచ్చే లాభమూ లేదు. పోనీ ఒకేసారి నిర్మాణం జరుపుకుంటున్న రెండు నగరాలను పోల్చినా.. అదో పద్ధతి. అంతేకానీ వందల ఏళ్ల నాడు ఏర్పడి.. ఇప్పుడు ఆటోమోడ్ లో దూసుకుపోతున్న హైదరాబాద్ కు.. ఇంకా రూపం తీసుకోని అమరావతికి పోలిక పెట్టడం.. అనవసర ప్రయాసే తప్ప మరోటి కాదు. అమరావతిలో అమరావతి మోడల్ అభివృద్ధే సాధ్యమౌతుందనేది క్షేత్రస్థాయి వాస్తవం. అక్కడ నేల విడిచి సాము చేయడం మానేస్తే.. రాజధాని పనులు కూడా త్వరగా ఓ కొలిక్కివస్తాయి. మొదట రాజధానికి ఓ రూపం తీసుకొచ్చి.. తర్వాత అక్కడ అభివృద్ధికి వేగవంతమైన ప్రణాళికలు అమలు చేయాలి. ఆ అభివృద్ధి కూడా ఓవైపు ప్రభుత్వం వైపు నుంచి మరోవైపు ప్రైవేట్ రంగం నుంచి సమాంతరంగా జరగాలి. అప్పుడు కొంతకాలానికి అమరావతి కూడా అభివృద్ధి పథంలో పయనించే నగరంగా పేరు తెచ్చుకుంటుంది.

ఏపీలో రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే కొంత కసరత్తు జరిగింది. 33 వేల ఎకరాల భూసమీకరణ పూర్తైంది. ఒక్క ఎకరంలో లక్ష చదరపు అడుగుల నిర్మాణాలు చేయొచ్చు. అలాంటిది 33 వేల ఎకరాలంటే.. దాదాపుగా 330 కోట్ల చదరపు అడుగుల నిర్మాణాలు చేపట్టొచ్చు. మొదట ఉన్న భూమిలో నిర్మాణాలు పూర్తిచేయాలి. ఆ తర్వాత కొత్తగా భూముల సమీకరణ గురించి ఆలోచించాలి. కానీ ఉన్న భూమిని సద్వినియోగం చేసుకోకుండా.. మళ్లీ వేల ఎకరాల సమీకరణ అంటే.. కొత్త సందేహాలు రావడం సహజం. ఇప్పుడు అందుబాటులో ఉన్న 33 వేల ఎకరాల్లో 20 వేల ఎకరాల్లో కమర్షియల్ నిర్మాణాలు చేసి.. మరో 13 వేల ఎకరాల్లో సామాన్యుల కోసం గృహ నిర్మాణాలు చేపట్టొచ్చు. ఇంతకంటే మెరుగైన ప్రత్యామ్నాయాలు కూడా ఆలోచించవచ్చు. ఇప్పటికే ఈ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలనే విషయంలో ప్రభుత్వానికి కొన్ని వ్యూహాలున్నాయి. కాకపోతే ఉన్న భూమిని మరింత మెరుగ్గా వినియోగించుకోవడం కోసం ఇంకా మేధోమథనం జరిపినా తప్పేం కాదు. అలా రాజధాని కోసం సేకరించిన సెంటు భూమి కూడా వృథా కావడం లేదని ప్రజలకు నమ్మకం కుదిరేలా చేయాలి. అప్పుడు మళ్లీ భూములు కావాలంటే.. కొందరైనా అర్థం చేసుకునే వీలుంటుంది. పైగా పనులు జరుగుతున్న వేగం చూసి.. ఆ ఊపులో భూసమీకరణకు ముందుకొచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. అంతేకానీ ఇచ్చిన భూములకు, ఆ భూములిచ్చిన రైతులకిచ్చిన హామీలకు అతీగతీ లేకుండా.. కొత్తగా భూములంటే అది తేడా కొడుతుంది. ఏపీలో రాజధాని ప్రాంతంలో ల్యాండ్ బ్యాంక్ తక్కువగా ఉంది. అందుకే రైతుల నుంచి సమీకరించాల్సి వచ్చింది. కాబట్టి వేసే ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. ఈ విషయాలేవీ ఏపీ నేతలకు తెలియదని కాదు. కానీ వారు రాజధాని విషయంలో అనవసర పోటీలకు పోయి.. జరగాల్సిన పని చూడటం లేదనే చర్చ జరుగుతోంది.

ఏపీ రాజధాని విషయంలో అన్ని పార్టీలూ తప్పులు చేశాయి. ఏ ఒక్క పార్టీనీ వేలెత్తిచూపే పరిస్థితి లేదు. చంద్రబాబు ప్రపంచంలోనే గొప్ప రాజధాని కట్టాలనే తాపత్రయంతో.. రాజధాని పనులు ఓ కొలిక్కి తేవడం లేదనే భావన జనంలో ఉంది. అలాగే వైఎస్ జగన్ మూడు రాజధానుల పేరుతో.. అసలు రాజధాని అంటేనే ప్రజల్లో విసుగు వచ్చేలా చేశారు. రెండు ప్రధాన పార్టీలు వారివారి ఎజెండా కోసం, వ్యక్తిగత మైలేజీ కోసం, స్వప్రయోజనాల కోసం చివరికి రాజధాని నిర్మాణం పూర్తిచేయలేదు. తిలా పాపం తలా పిడికెడు పంచుకున్నారు. ఇప్పటికైనా ఏదో ఒక రాజధానిని నిర్మించుకుని, దానికి మినిమం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇచ్చి, ఆ తర్వాత దశల వారీగా అభివృద్ధి చేస్తే రాజధాని ఏర్పడుతుంది. అంతేకానీ రాజధాని క్రెడిట్ సొంతం చేసుకోవాలనే భ్రమలో పడి, చివరికి రాజధాని నిర్మాణం పూర్తికాని పరిస్థితి తెచ్చుకోకూడదు. భారీ ఆకాంక్షలతో సుదీర్ఘకాలం రాజధాని నిర్మాణం కొనసాగుతూనే ఉండటం ఎవరికీ మంచిది కాదు.

అమరావతి నిర్మాణం కోసం ఇప్పటిదాకా కొన్ని నిధులు ఖర్చుపెట్టారు. మరికొన్ని నిధులు సమీకరించి పెట్టారు. మొదట వాటి సద్వినియోగంపై దృష్టి పెట్టి.. తర్వాత కొత్తగా నిధుల గురించి వేట మొదలుపెట్టాలి. అలా చేస్తే.. కొత్తగా రుణాలిచ్చేవారు కూడా ఆసక్తి చూపే అవకాశం ఉంది. అంతేకానీ నిధులు ఖర్చవుతున్నాయి కానీ.. రాజధాని నిర్మాణం రూపు దిద్దుకోవడం లేదనే ప్రస్తుత పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగకూడదు. వీలైనంత త్వరగా రాజధానికి ఓ రూపమిచ్చి.. ఓ ప్రణాళిక ప్రకారం ముందడుగు వేస్తేనే.. ఏపీ తోటి రాష్ట్రాలతో సమానంగా ఎదగడానికి కనీసం దశాబ్ద కాలం పడుతుందని అంచనా. అలాంటిది ఇంతవరకూ రాజధాని నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో స్పష్టత లేకుండా మనుగడ సాగిస్తున్న రాష్ట్రం భవిష్యత్తు ఏమిటనేది తలుచుకుంటేనే సామాన్యులకు భయమేస్తోంది.

రాజధాని నిర్మాణం సుదీర్ఘంగా జరుగుతుండటంతో.. ఏపీలో వ్యాపార, వాణిజ్య రంగాలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. రాజధానికి రూపం రాకపోవడంతోనే.. ఏపీ ప్రజలు ఇంకా హైదరాబాద్ లో, బెంగళూరులో పెట్టుబడులు పెడుతున్నారు. అదే ఏపీ రాజధాని పూర్తయ్యుంటే.. ఈపాటికి కొందరైనా అక్కడ పెట్టుబడులు పెట్టేవారు. తర్వాత క్రమంగా పెట్టుబడుల జోరు పెరిగేది. ఇప్పటికే విలువైన సమయాన్ని నేతలు వృథా చేశారు. ఇప్పటికైనా జరిగిన పొరపాట్లు సరిదిద్దుకుని రాజధాని నిర్మాణం వేగవంతం చేయాలి. అప్పుడు ఏపీ కూడా అభివృద్ధి బాటలో పడుతుంది. రాజధాని అనేది ఐదు కోట్ల ఆంధ్రులకు సంబంధించిన విషయమని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. ఎవరికి వారు తమ స్టాండ్ కు అనుగుణంగా బలమైన వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారే కానీ.. ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు. ప్రజల్ని కన్విన్స్ చేద్దామనుకుంటున్నారు కానీ.. వారి మనసులో ఏముందో తెలుసుకోవాలనే ఉద్దేశం లేదు.

సామాన్యుడికి రాజధానిపై స్పష్టత కావాలి. కేవలం తమ కోసమే కాదు.. భవిష్యత్తు తరాల కోసం కూడా రాజధానిపై క్లారిటీ రావాలి. పని జరగకుండా పైపై కబుర్లు ఎన్ని చెప్పినా ఉపయోగం లేదు. పన్నెండేళ్లు కావస్తున్నా ఇంతవరకూ రాజధాని నిర్మాణం ఎందుకు పూర్తికాలేదంటే.. ఏం చెప్పాలో కూడా తెలియక ఏపీ ప్రజలు మథనపడుతున్నారు. మొన్నటిదాకా రాజధాని లేదనే సెటైర్లు భరించిన ఏపీ ప్రజలకు.. ఇప్పుడు రాజధాని నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందనే ఎకసెక్కాలు ఎదురౌతున్నాయి. ఏపీలో ఉన్న రెండు ప్రధాన పార్టీల పాలనలోనూ రాజధాని ఎప్పుడు పూర్తవుతుందనే ప్రశ్నకు సరైన సమాధానం దొరక్కపోవడంతో.. ప్రజల్లో మరింత గందరగోళం ఏర్పడుతోంది. ఈ అయోమయాన్ని ప్రభుత్వమే పోగొట్టాలి. ఇప్పటికే సమీకరించిన భూముల్లో నిర్మాణాలు పూర్తిచేయాలి. తద్వారా ఇప్పటికే భూములిచ్చిన రైతుల్లో నమ్మకం కలిగించాలి. ఆ తర్వాత రెండో విడత భూసమీకరణ అన్నా ఎవరూ వ్యతిరేకించే అవకాశం ఉండదు. కొత్తగా భూములిచ్చేవారు కూడా చొరవగా ముందుకొచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇప్పటికైనా ఏపీ సర్కారు ప్రాథమిక మౌలిక వసతులతో రాజధాని నిర్మాణం పూర్తిచేసే విషయం గురించి ఆలోచించాలి. రాజధానికి త్వరగా ఓ రూపు తీసుకొచ్చే పని చూడాలి. అప్పుడు పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేట్ రంగం కూడా ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. అలా ఏపీ ప్రజలకు రాజధాని నిర్మాణం పూర్తైందనే సంతృప్తితో పాటు.. మరింత అభివృద్ధికి మార్గం సుగమమైందనే నమ్మకం కూడా పెరుగుతుంది. ఈ సానుకూల సంకేతాలతో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోయే ఆస్కారం ఏర్పడుతుంది. ఇదీ ఈ వారం ఛైర్మన్స్ డెస్క్. మరో అంశంపై విశ్లేషణతో మళ్లీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.

Exit mobile version