సాధారణంగా కొంతమంది ఉద్యోగులు ఆఫీసుల్లో నిద్రపోతూ ఉంటారు. ఒక్కోసారి నిద్ర కారణంగా బాస్‌ల చేత చీవాట్లు కూడా తినాల్సి ఉంటుంది. ఎందుకంటే వర్కింగ్ అవర్స్‌లో ఉద్యోగులు నిద్రపోవడాన్ని ఏ కంపెనీలు అంగీకరించవు. అయితే విదేశాల్లో కొన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగులు నిద్రపోవడాన్ని అనుమతిస్తాయి. ఇప్పుడిప్పుడే ఈ సంస్కృతిని మన దేశంలోని పలు కంపెనీలు కూడా ఆచరణలోకి తేవడం ప్రారంభించాయి. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఉద్యోగులు ఆఫీసుల్లో నిద్రపోవచ్చని ప్రకటన చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. వేక్‌ఫిట్ సొల్యూషన్స్ అనే సంస్థ తమ ఉద్యోగులకు తగినంత విశ్రాంతి అవసరమని భావించి ఆఫీసులో నిద్రపోయేందుకు అనుమతి ఇస్తూ ఓ సర్క్యులర్ విడుదల చేసింది. ఐటీ ఉద్యోగుల్లో చాలా మంది ప్రాజెక్టులకు అనుగుణంగా విదేశాల్లో పనిచేసే ఉద్యోగులకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది.. తద్వారా నిద్రకు దూరం అవుతారని సదరు కంపెనీ తెలిపింది. దీంతో ఉద్యోగులకు పగటి నిద్ర విషయంలో ఇన్నాళ్లు న్యాయం చేయలేకపోయామని అభిప్రాయపడింది. ఈ అంశాన్ని ఇప్పుడు సీరియస్‌గా తీసుకుని ఉద్యోగులు రోజూ అరగంట పాటు ఆఫీసులో నిద్రపోయే అవకాశాన్ని కల్పిస్తు్న్నట్లు వివరించింది.
నిద్రమత్తులో ఉండే ఉద్యోగులు సరిగ్గా పనిచేయలేరని.. అప్పుడు పనిప్రభావం ప్రాజెక్టుపై పడుతుందని వేక్‌ఫిట్ సొల్యూషన్స్ సంస్థ తెలిపింది. అదే కొంతసేపు విశ్రాంతి తీసుకుంటే మిగతా వర్కింగ్ అవర్స్‌లో ఉద్యోగులు బాగా పని చేస్తారని అభిప్రాయం వ్యక్తం చేసింది. అటు నాసా అధ్యయన ప్రకారం వర్కింగ్ అవర్స్‌లో ఉద్యోగులు 26 నిమిషాల పాటు నిద్రిస్తే 33 శాతం వారి పనితీరు మెరుగైందని స్పష్టమైంది.
Andhra Pradesh: ఈ ఆర్టీసీ డ్రైవర్ ఆలోచనకు సలాం కొట్టాల్సిందే..!!