Uber Layoffs: ఉబర్‌లో భారీ లేఆఫ్స్.. 3,300 మంది ఉద్యోగులకు షాక్! భారత్‌లో ప్రభావం ఎంత?

Uber Layoffs

Uber Layoffs

Uber Layoffs: గ్లోబల్ రైడ్-హెలింగ్ దిగ్గజం ఉబర్ (Uber) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా తన వర్క్‌ఫోర్స్‌లో సుమారు 10 శాతం ఉద్యోగాలను తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ సీఈఓ దారా ఖోస్రోషాహీ ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో వెల్లడించారు. తాజా నిర్ణయంతో దాదాపు 3,400 ఉద్యోగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ ఉద్యోగాల కోత తక్షణ ఆర్థిక సంక్షోభం కారణంగా తీసుకున్న నిర్ణయం కాదని ఉబర్ స్పష్టం చేసింది. సంస్థలోని అనవసరమైన మేనేజ్‌మెంట్ లేయర్లను తగ్గించడం, బ్యూరోక్రసీని తొలగించడం, సంస్థాగత నిర్మాణాన్ని సరళీకృతం చేయడం, నిర్ణయాలు వేగంగా తీసుకునేలా చేయడం వంటి లక్ష్యాలతో ఈ చర్య చేపడుతున్నట్లు తెలిపింది.

మేనేజ్‌మెంట్ లేయర్లపై కత్తెర

ఉబర్ తన సంస్థాగత నిర్మాణాన్ని మరింత సమర్థవంతంగా మార్చే ప్రక్రియలో భాగంగా మేనేజ్‌మెంట్ స్థాయిలను తగ్గిస్తోందని సమాచారం. వివిధ టీమ్‌ల మధ్య సమన్వయం కోసం ఉన్న కొన్ని పాత్రలను కూడా తొలగిస్తున్నట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. సీఈఓకు ఏడు లేదా అంతకంటే ఎక్కువ స్థాయిల కింద పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యను సుమారు 20 శాతం తగ్గించినట్లు సమాచారం. అలాగే ఒకరు లేదా ఇద్దరు ఉద్యోగులతో కొనసాగుతున్న చిన్న టీమ్‌ల సంఖ్యను దాదాపు 50 శాతం మేర తగ్గించింది. దీంతో సంస్థలో నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని ఉబర్ భావిస్తోంది.

70కి పైగా దేశాల్లో ఉబర్ సేవలు
ప్రస్తుతం ఉబర్ ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాలు, 15,000కు పైగా నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2025 డిసెంబర్ 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదిక ప్రకారం.. ఉబర్, దాని అనుబంధ సంస్థల్లో కలిపి సుమారు 34,000 మంది ఉద్యోగులు ఉన్నారు. తాజా 10 శాతం ఉద్యోగాల కోత అమలైతే.. వేలాది మంది ఉద్యోగులపై ప్రభావం పడనుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. టెక్ రంగంలో ఇప్పటికే కొనసాగుతున్న ‘ఆపరేషనల్ ఎఫిషియెన్సీ’ చర్యలకు ఉబర్ నిర్ణయం మరో ఉదాహరణగా నిలిచిందని చెబుతున్నారు.

భారత్‌లోనూ ఉద్యోగాలపై ప్రభావం
ఉబర్ తాజా లేఆఫ్స్ ప్రభావం భారత్‌పైనా పడే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. తాజా నిర్ణయంతో భారత్‌లోనూ కొంతమంది ఉద్యోగుల పాత్రలు ప్రభావితమవుతాయని ఉబర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. అయితే భారత మార్కెట్ తమకు అత్యంత కీలకమని కంపెనీ స్పష్టం చేసింది. ఆసియా – పసిఫిక్ ప్రాంతంలో వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు భారత్‌లో ప్రాంతీయ కార్యకలాపాలను బలోపేతం చేయాలని ఉబర్ భావిస్తోందని చెబుతున్నారు. దీంతో ఉద్యోగాల కోత ఉన్నప్పటికీ.. భారత్‌లో కంపెనీ కార్యకలాపాలను కొనసాగించడంతో పాటు కీలక విభాగాలపై మరింత దృష్టి పెట్టే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఇదే సమయంలో ఉబర్ ఉద్యోగాల సంఖ్య తగ్గించడంతో పాటు పని విధానంలోనూ మార్పులు చేస్తోంది. ప్రస్తుతం రిమోట్‌గా పనిచేస్తున్న చాలా మంది ఉద్యోగులను తిరిగి ఆఫీస్ నుంచి పనిచేసేలా ఆదేశిస్తున్నట్లు సమాచారం. కంపెనీ హైబ్రిడ్ వర్క్ పాలసీ ప్రకారం ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీస్ నుంచి పనిచేయాల్సి ఉంటుంది. సంస్థలోని టీమ్‌ల మధ్య సమన్వయం పెంచడం, నిర్ణయాలు వేగంగా తీసుకోవడం, ఉత్పాదకతను మెరుగుపరచడం వంటి లక్ష్యాలతో ఈ మార్పులు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

ఆర్థిక సంక్షోభం వల్ల కాదంటున్న ఉబర్
తాజా ఉద్యోగాల కోతపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొన్నప్పటికీ.. ఉబర్ మాత్రం ఇది ఆర్థిక ఇబ్బందుల కారణంగా తీసుకున్న నిర్ణయం కాదని స్పష్టం చేస్తోంది. సంస్థను మరింత సరళమైన, వేగవంతమైన, సమర్థవంతమైన నిర్మాణంలోకి తీసుకెళ్లేందుకే ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు కంపెనీ వెల్లడించింది. టెక్ పరిశ్రమలో ఖర్చులు తగ్గించడం, మేనేజ్‌మెంట్ లేయర్లను కుదించడం, చిన్న టీమ్‌లను విలీనం చేయడం వంటి చర్యలు పెరుగుతున్న సమయంలో ఉబర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతపై మరోసారి చర్చకు తెరతీసింది.