NTV Telugu Site icon

Tesla: భారత్‌ వైపు టెస్లా చూపు.. ఈ వారం ఇండియాకు టెస్లా టీం..

Tesla

Tesla

Tesla: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా భారత్ వైపు చూస్తోంది. అమెరికా, చైనాల మధ్య ఏర్పడిని ఘర్షణాత్మక పరిస్థితుల కారణంగా పలు కంపెనీలు ఇండియాను తమ గమ్యస్థానంగా ఎంచుకుంటున్నాయి. భారత్ వంటి అతిపెద్ద మార్కెట్ ను వదులుకునేందుకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఏ సంస్థ ఇష్టపడటం లేదు. ఇప్పుడున్న భారత ప్రభుత్వం, రానున్న రోజుల్లో చైనాకు ధీటుగా తయారీ రంగంలో భారత్ ను అగ్రగామిగా నిలిపేందుకు పనిచేస్తోంది. మరోవైపు చైనా, భారత సంబంధాలు కూడా చెప్పుకోదగిన రీతిలో లేవు. దీంతోనే భారత్ వైపు టెస్లా దృష్టిసారిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం టెస్లాకు చెందిన కార్ల తయారీ ప్లాంట్ చైనాలో ఉంది. చైనాలో తయారైన కార్లను ఇక్కడ అమ్మేందుకు భారత్ అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా ఉన్న మార్కెట్ ను వద్దనుకోవడానికి టెస్లా సుముఖంగా లేదు. దీంతో టెస్లా బృందం ఈ వారం భారత పర్యటనకు వస్తోంది. సీనియర్ టెస్లా ఇంక్. ఎగ్జిక్యూటివ్‌ల బృందం ఈ వారంలో భారతదేశాన్ని సందర్శించి కేంద్ర ప్రభుత్వ అధికారులను కలవడంతో పాటు భారత్ లో ఫ్లాంట్లను ఏర్పాటు చేసేందుకు పీఎంఓ ఆఫీస్ తో సహా ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశం కానున్నట్లు తెలిసింది.

Read Also: Recession: ఆర్థికమాంద్యం తప్పదు.. యూఎస్ ట్రెజరీ వార్నింగ్.. భారత ఐటీ ఉద్యోగులకు గడ్డు కాలమే..!

భారతదేశంలో టెస్లా కార్ల తయారీ గురించి చర్చించే అవకాశం ఉంది. గతంలో టెస్లా భారత్ లో ప్లాంట్ నెలకొల్పేందుకు సమ్మతించలేదు. దీంతో చైనాలో తయారైన కార్లను ఇక్కడ అమ్మేందుకు అనుమతులను అడిగింది. అయితే భారత్ అందుకు ఒప్పుకోలేదు. భారత్ లో అధిక దిగుమతి పన్నులు, ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని గతంలో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ విమర్శించారు. మస్క్ తన కంపెనీ వాహనాలను విక్రయించడానికి, సర్వీస్ చేయడానికి అనుమతించని ఏ ప్రదేశంలోనూ తయారీ ప్లాంట్‌లను ఏర్పాటు చేయదని గతంలో చెప్పారు. ఇదిలా ఉంటే టెస్లా ప్రొడక్షన్, బిజినెస్ డెవలప్మెంట్ టీమ్ ఎగ్జిక్యూటివ్స్ మరోసారి టెస్లా కార్లపై దిగుమతి సుంకాలను తగ్గించాలని కోరే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.

ఇప్పటికే టెస్లాకు ప్రత్యర్థులుగా ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఏజీ స్థానికంగా అసెంబుల్ చేసిన కార్లను విక్రయించడానికి చర్యలు తీసుకుంది. అత్యధికంగా వేగం అభివృద్ధి చెందుతున్న, అధిక జనాభా కలిగిన భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ పెరుగుతోంది. దీంతో పలు విదేశీ కంపెనీలు కూడా ఇండియన్ మార్కెట్ పై కన్నేశాయి. నిజానికి చెప్పాలంటే భారతదేశాన్ని అసెంబ్లింగ్ స్థావరంగా చేసేందుకు టెస్లా ఇప్పటికీ దూరంగా ఉంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు చైనాను వదిలి భారత్, ఇండోనేషియా వంటి దేశాల వైపు చూస్తున్నాయి. ఆపిల్ మన దేశంలో అసెంబ్లింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసింది. గ్లోబల్ ప్రొడక్షన్ లో 7 శాతం మనదేశం నుంచే ఉత్పత్తి అవుతోంది.