టాటా గ్రూప్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల కాలానికి కొనసాగించాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. గురువారం జరిగిన బోర్డు సమావేశంలో మెజారిటీ ఓట్లతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాటా సన్స్ వెల్లడించింది. అయితే ఈ నిర్ణయంపై టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టాటా ట్రస్ట్స్‌కు టాటా గ్రూప్‌లో 66 శాతం వాటా ఉంది.
బోర్డు నిర్ణయం
చంద్రశేఖరన్ గత నెలలో తన ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత చైర్మన్‌గా కొనసాగేందుకు తనను తాను ప్రతిపాదించుకోబోనని ప్రకటించారు. అయితే గురువారం జరిగిన బోర్డు సమావేశంలో ఆయన తన నిర్ణయాన్ని పునఃపరిశీలించేందుకు బోర్డు చేసిన విజ్ఞప్తిని అంగీకరించినట్లు టాటా సన్స్ తెలిపింది. ఆ తర్వాత చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల కాలానికి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా తిరిగి నియమించేందుకు బోర్డు మెజారిటీ ఓట్లతో తీర్మానం చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఆయన ప్రస్తుత పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 20తో ముగియనుంది.
గత ఏడాది నుంచే..
చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్లకు కొనసాగించే అంశంపై టాటా సన్స్ బోర్డు 2025 సెప్టెంబర్‌లోనే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. అయితే చట్టపరమైన నిబంధనల ప్రకారం అవసరమైన అధికారిక అనుమతులు పొందేందుకు 2026 ఫిబ్రవరిలో తీర్మానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. అయితే అప్పట్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తీర్మానాన్ని వాయిదా వేశారు. అనంతరం మే, జూన్ నెలల్లో జరిగిన బోర్డు సమావేశాల్లోనూ ఈ అంశంపై చర్చ జరిగినప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేకపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆగస్టు 12న చంద్రశేఖరన్ తన ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత తిరిగి నియామకానికి తనను తాను ప్రతిపాదించుకోబోనని నిర్ణయించుకున్నట్లు టాటా సన్స్ తెలిపింది.
ఒప్పించిన నామినేషన్ కమిటీ
సెప్టెంబర్ 3న టాటా సన్స్ బోర్డులోని నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ (NRC) సమావేశమైంది. చంద్రశేఖరన్ కొనసాగకూడదన్న నిర్ణయం, ఆయనను తిరిగి నియమించే అంశంపై కమిటీ చర్చించింది. చంద్రశేఖరన్ టాటా గ్రూప్‌కు అందించిన సేవలు, సంస్థ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం.. తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఆయనను కోరాలని NRC ఏకగ్రీవంగా నిర్ణయించింది. తదుపరి బోర్డు సమావేశంలో ఆయనను మరోసారి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమించాలని సిఫారసు చేసింది.
RBI నిబంధనలపై కూడా చర్యలు
అమలులో ఉన్న RBI మార్గదర్శకాలకు అనుగుణంగా అవసరమైన చర్యలను ప్రారంభించాలని కూడా టాటా సన్స్ బోర్డు నిర్ణయించింది. ఇందుకోసం RBI, టాటా ట్రస్ట్స్, ఇతర సంబంధిత వాటాదారుల నుంచి మార్గదర్శకత్వం తీసుకోవాలని నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది.
నోయెల్ టాటా వ్యతిరేకం
మరోవైపు టాటా ట్రస్ట్స్ మాత్రం బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకించింది. చంద్రశేఖరన్‌ను మరోసారి నియమించేందుకు చేసిన ప్రతిపాదనకు టాటా ట్రస్ట్స్ తరఫున నామినీ డైరెక్టర్‌గా ఉన్న నోయెల్ టాటా వ్యతిరేకంగా ఓటు వేశారని ట్రస్ట్స్ తెలిపింది. ఈ కారణంగా బోర్డు తీర్మానం చట్టపరంగా చెల్లదని, దానికి ఎలాంటి ఆధారం లేదని టాటా ట్రస్ట్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. చంద్రశేఖరన్ 2027 ఫిబ్రవరి 20న ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత తిరిగి నియామకానికి తనను తాను ప్రతిపాదించుకోకూడదన్న నిర్ణయం ఇప్పటికే ఆమోదించబడిందని టాటా ట్రస్ట్స్ స్పష్టం చేసింది. ఆ నిర్ణయం తుది రూపం దాల్చిందని, మెజారిటీ వాటాదారుగా టాటా ట్రస్ట్స్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. గురువారం జరిగిన బోర్డు సమావేశంలోనూ టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా ఇదే అభిప్రాయాన్ని పునరుద్ఘాటించినట్లు ట్రస్ట్స్ పేర్కొంది. దీంతో చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్లకు కొనసాగించాలన్న టాటా సన్స్ బోర్డు నిర్ణయంపై సంస్థలోని బోర్డు, టాటా ట్రస్ట్స్ మధ్య విభేదాలు బహిరంగంగా బయటపడినట్లైంది. మళ్లీ ఎలాంటి రగడ మొదలవుతుందో చూడాలి.

