Stock Market: ఢిల్లీ జనాభా కంటే తక్కువ జనాభా ఉన్న ఒక చిన్న దేశం, మన దేశాన్ని వెనక్కి నెట్టి ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద స్టాక్ మార్కెట్‌గా అవతరించింది. ఆ దేశం మరేదో కాదు తైవాన్. బ్లూమ్‌బర్గ్ డేటా ప్రకారం.. తైవాన్ స్టాక్ మార్కెట్ విలువ ఏకంగా 4.95 ట్రిలియన్ డాలర్లకు (సుమారు రూ. 411 లక్షల కోట్లు) చేరుకుంది. దీంతో భారత్ మార్కెట్ విలువ అయిన 4.92 ట్రిలియన్ డాలర్లను తైవాన్ అధిగమించింది. ప్రస్తుతం ప్రపంచ ఈక్విటీ మార్కెట్ రేంకింగ్స్‌లో అమెరికా, చైనా, జపాన్, హాంగ్‌కాంగ్ ల తర్వాత తైవాన్ ఐదో స్థానంలో నిలిచింది. ఈ పరిణామం ఆర్థిక నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే భారత్‌లో లిస్ట్ అయిన కంపెనీల సంఖ్య ఎక్కువ, ఆర్థిక వ్యవస్థ పరంగా తైవాన్ కంటే భారత్ చాలా పెద్దది, పైగా 140 కోట్లకు పైగా జనాభా ఉంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరుగుతున్న రిటైల్ ఇన్వెస్టర్ల బేస్ సైతం భారత్ సొంతం. మరోవైపు తైవాన్ జనాభా కేవలం 2.3 కోట్లు మాత్రమే. అయినప్పటికీ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి బిలియన్ల కొద్దీ నిధులను వెనక్కి తీసుకుంటూ, తైవాన్ మార్కెట్లలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. దీనికంతటికీ కారణం ఒకే ఒక్క కారణం ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (AI).
తైవాన్ మార్కెట్ ఈ స్థాయికి చేరడం వెనుక ఆ దేశానికి చెందిన చిప్ తయారీ దిగ్గజం ‘తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ’ (TSMC) కీలక పాత్ర పోషించింది. ప్రపంచంలోనే అతిపెద్ద సెమీకండక్టర్ తయారీ సంస్థ అయిన TSMC, ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ఏఐ (AI) విప్లవం వల్ల విపరీతంగా లాభపడింది. తైవాన్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్‌లో ఈ ఒక్క కంపెనీ వాటాయే దాదాపు 42 శాతంగా ఉందంటే దీని హవా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏఐ చిప్‌లకు డిమాండ్ పెరగడంతో ఈ ఏడాది ఈ కంపెనీ షేర్లు 49 శాతం లాభపడ్డాయి. ఎన్విడియా, యాపిల్, ఏఎమ్‌డి, క్వాల్కమ్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలకు అవసరమైన అడ్వాన్స్‌డ్ చిప్‌లను ఈ కంపెనీయే తయారు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లంతా ఏఐ, సెమీకండక్టర్ రంగాలు వైపు పరుగులు తీస్తుండటంతో తైవాన్, దక్షిణ కొరియా లాంటి తయారీ హబ్‌లకు భారీగా పెట్టుబడులు తరలివచ్చాయి. ఇక, తైవాన్ దూసుకుపోతుంటే, భారత్ మాత్రం భిన్నమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు, కంపెనీల త్రైమాసిక లాభాల వృద్ధి మందగించడం, విదేశీ ఇన్వెస్టర్లు నిరంతరం షేర్లను విక్రయించడం వంటి సమస్యలు ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా, అంతర్జాతీయంగా నడుస్తున్న ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంతో నేరుగా ముడిపడి ఉన్న పెద్ద కంపెనీలు భారత స్టాక్ మార్కెట్లలో లేవు. తైవాన్ తరహాలో ప్రపంచాన్ని శాసించే సెమీకండక్టర్ లేదా ఏఐ హార్డ్‌వేర్ కంపెనీలు మన దేశంలో ఇంకా లిస్ట్ కాలేదు.
