Subhash Chandra: లోన్ మోసం కేసులో షాక్.. జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్ఐఆర్.. ఆరోపణలు ఇవే!

  • లోన్ మోసం కేసులో షాక్
  • జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్ఐఆర్
  • రూ.1,322 కోట్ల ఎల్‌ఐసీ హౌసింగ్ లోన్ మోసం కేసు
Cbi

Cbi

జీ గ్రూప్ అధినేత, ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్రపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కేసు నమోదు చేసింది. ఎల్‌ఐసీ (LIC) హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి తీసుకున్న రూ.1,322 కోట్లకు పైగా రుణాలకు సంబంధించి మోసం జరిగిందన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. ఆగస్టు 31న నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ కేసు ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైంది. సుభాష్ చంద్రతో సంబంధం ఉన్న సంస్థలు, వాటి డైరెక్టర్లు తప్పుడు, భారీగా పెంచి చూపిన నెట్‌వర్త్ పత్రాలను సమర్పించి రుణాలు పొందారని సంస్థ ఆరోపించింది. ఈ వ్యవహారంలో సుభాష్ చంద్రతో పాటు రుణాలు తీసుకున్న కంపెనీలు, వాటి డైరెక్టర్ల పాత్రపై సీబీఐ దర్యాప్తు చేయనుంది.

రూ.500 కోట్ల తొలి రుణం

2018 మార్చిలో వసంత్ సాగర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, పాన్ ఇండియా ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు వ్యాపార విస్తరణ కోసం ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ రూ.500 కోట్ల రుణం మంజూరు చేసింది. ఈ రుణానికి సుభాష్ చంద్ర వ్యక్తిగత హామీ ఇచ్చారు. అదే ఏడాది ఆగస్టులో డిజిటల్ సబ్‌స్క్రైబర్ మేనేజ్‌మెంట్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, స్పిరిట్ ఇన్‌ఫ్రాపవర్ అండ్ మల్టీవెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు మరో రూ.480 కోట్ల రుణాన్ని రుణ డిస్కౌంటింగ్ సదుపాయం కింద మంజూరు చేశారు. ఈ రుణానికి కూడా సుభాష్ చంద్ర వ్యక్తిగత హామీ ఇచ్చారు.

నెట్‌వర్త్ పత్రాలపై కీలక ఆరోపణలు

ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఫిర్యాదు ప్రకారం.. తొలి రుణం మంజూరులో సుభాష్ చంద్ర సమర్పించిన నెట్‌వర్త్ సర్టిఫికెట్ కీలకంగా మారింది. 2017 మార్చి 31 నాటికి తన నెట్‌వర్త్ 6.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.59,113 కోట్లు)గా ఉన్నట్లు ఆ సర్టిఫికెట్‌లో పేర్కొన్నట్లు ఫిర్యాదులో తెలిపింది. రెండో రుణం మంజూరులో ఆయన నెట్‌వర్త్ రూ.40,562 కోట్లుగా పేర్కొన్న మరో సర్టిఫికెట్‌ను ఉపయోగించినట్లు ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఆరోపించింది.

రెండు రుణాలు డిఫాల్ట్

ఈ రెండు రుణ సదుపాయాలు అనంతరం డిఫాల్ట్ అయ్యాయి. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఫిర్యాదు ప్రకారం.. వసంత్ సాగర్ రుణానికి సంబంధించి రూ.570.50 కోట్లు, డిజిటల్ రుణానికి సంబంధించి రూ.507.25 కోట్లు బకాయిలుగా ఉన్నాయి. వ్యక్తిగత దివాలా ప్రక్రియ సందర్భంగా సుభాష్ చంద్ర తన నెట్‌వర్త్‌పై గతంలో సమర్పించిన వివరాలను తిరస్కరించినట్లు ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ పేర్కొంది. 2024లో తన నెట్‌వర్త్ రూ.31.79 కోట్లు మాత్రమేనని ఆయన వెల్లడించారని తెలిపింది. 2017-18లో కూడా తన నెట్‌వర్త్ రూ.40,000 కోట్లకు మించి ఉండలేదని ఆయన పేర్కొన్నట్లు ఫిర్యాదులో వెల్లడించింది.

సుభాష్ చంద్రపై ఏం ఆరోపణలు?

సుభాష్ చంద్ర, రుణాలు పొందిన సంస్థలు, వాటి అధికారులు, డైరెక్టర్లు కుమ్మక్కై రుణదాతను మోసం చేశారని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఆరోపించింది. భారీగా పెంచి చూపిన నెట్‌వర్త్‌ను నిజమైనదిగా చూపించేందుకు తప్పుడు పత్రాలు రూపొందించారని, వాటి ఆధారంగా రుణాలు పొందారని పేర్కొంది. అంతేకాకుండా రుణంగా తీసుకున్న నిధులను అనంతరం దుర్వినియోగం చేశారన్న ఆరోపణలను కూడా సంస్థ చేసింది.

CBI FIRలో ఎవరెవరు నిందితులు?

ఈ కేసులో సుభాష్ చంద్రతో పాటు వసంత్ సాగర్ ప్రాపర్టీస్, ఆ సంస్థ డైరెక్టర్ పంకజ్ సురోలియా, పాన్ ఇండియా ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్, డిజిటల్ సబ్‌స్క్రైబర్ మేనేజ్‌మెంట్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్, దాని డైరెక్టర్ అమిష్ పాండ్యా, స్పిరిట్ ఇన్‌ఫ్రాపవర్ అండ్ మల్టీవెంచర్స్, దాని డైరెక్టర్ రాజీవ్ ధోలాకియా పేర్లను CBI FIRలో చేర్చింది. వీరిలో పాటు గుర్తుతెలియని మరికొందరు వ్యక్తులు, గుర్తుతెలియని ప్రభుత్వ ఉద్యోగులను కూడా నిందితులుగా పేర్కొంది. సీబీఐ క్రిమినల్ కుట్ర, మోసం, నేరపూరిత నమ్మకద్రోహం తదితర ఆరోపణల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.