NTV Telugu Site icon

Stock Market: రుచించని ఆర్బీఐ పాలసీ.. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్ వారం ముగింపులో నష్టాలతో క్లోజ్ అయింది. ఆర్బీఐ పాలసీ ప్రకటనకు ముందే సూచీల్లో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఇన్వెస్టర్లు అప్రమత్తతతో సూచీల్లో లాభ, నష్టాలతో ఊగిసలాట సాగింది. ఆర్బీఐ గవర్నర్.. రెపో రేటును యథాతథంగా ఉంచినట్లు ప్రకటించినా.. సూచీల్లో మాత్రం మార్పు కనిపించలేదు. చివరి దాకా నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 56 పాయింట్లు నష్టపోయి 81, 709 దగ్గర ముగియగా.. నిఫ్టీ 30 పాయింట్లు నష్టపోయి 24, 677 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.84.69 దగ్గర ముగిసింది.

నిఫ్టీలో బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ లైఫ్, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ భారీ లాభాలతో కొనసాగగా.. అదానీ పోర్ట్స్, సిప్లా, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఏషియన్ పెయింట్స్ నష్టపోయాయి. సెక్టోరల్‌లో ఐటీ, మీడియా మినహా మిగిలిన అన్ని సూచీలు ఆటో, మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ, టెలికాం, పీఎస్‌యూ బ్యాంక్‌ 0.3-1 శాతం మధ్య లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం పెరిగాయి.

శుక్రవారం ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం ప్రకటించారు. రెపో రేటును 6.5 శాతం దగ్గర కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది 11వ సారి కావడం విశేషం. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ ఈ రేటును ఇలాగే కొనసాగిస్తూ వస్తోంది.

రెపో రేటులో ఎటువంటి మార్పు లేదని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 5.4 శాతం అంచనా వేసిన దానికంటే చాలా తక్కువగా నమోదైందని గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. తయారీ కంపెనీల పనితీరు బలహీనంగా ఉండటం, మైనింగ్ కార్యకలాపాలు క్షీణించడం, విద్యుత్‌కు డిమాండ్ తక్కువగా ఉండటం వల్ల వృద్ధి ఈ క్షీణతకు కారణమని ఆయన చెప్పారు. పారిశ్రామిక కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటాయని, అంతకుముందు త్రైమాసికంలో కనిష్ట స్థాయి నుంచి కోలుకుంటుందని ఆయన తెలిపారు.

Show comments