Stock Market Crash: అంతర్జాతీయ మార్కెట్లో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో భారత స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా – ఇరాన్ మధ్య రేగిన ఘర్షణలు, హోర్ముజ్ జలసంధి ఉద్రిక్తతలు దలాల్ స్ట్రీట్‌ను వణికించాయి. మార్కెట్ ప్రారంభమైన మొదటి ఐదు నిమిషాల వ్యవధిలోనే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ (Sensex) 550 పాయింట్లకు పైగా పతనం అవ్వగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ సైతం 150 పాయింట్లకు పైగా తుడిచిపెట్టుకొని పోయింది. అంతకుముందు రోజు కూడా మార్కెట్లు నష్టాల్లోనే ముగియడం గమనార్హం.
సెంటిమెంట్‌ను దెబ్బతీసిన ‘హోర్ముజ్’ సంక్షోభం
ప్రపంచ చమురు అవసరాలలో దాదాపు 20 శాతం వాటాను మోసే అత్యంత కీలకమైన ‘హోర్ముజ్ జలసంధి’ వేదికగా అమెరికా, ఇరాన్ దళాలు పరస్పరం దాడులకు దిగడమే ఈ రోజు మార్కెట్ పతనానికి ప్రధాన కారణం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ భౌగోళిక – రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం కేవలం భారత్‌పైనే కాకుండా జపాన్, సౌత్ కొరియా వంటి ఇతర ఆసియా దేశాల స్టాక్ మార్కెట్లపైనా తీవ్రంగా పడిందని చెబుతున్నారు. మంగళవారం ముగింపు 78,180 పాయింట్లతో పోలిస్తే బుధవారం ఉదయం భారీ గ్యాప్ డౌన్‌తో ప్రారంభమైన సెన్సెక్స్, కొద్దిసేపట్లోనే 550 పాయింట్లు నష్టపోయి 77,611 స్థాయికి పడిపోయింది. నిఫ్టీ ఇండెక్స్ కూడా తన మునుపటి ముగింపు 24,398 పాయింట్ల నుంచి ఓపెనింగ్‌లోనే 24,259 వద్దకు పడిపోయి, ఆ తర్వాత మరింత క్షీణించి 150 పాయింట్ల నష్టంతో 24,229 వద్ద ట్రేడ్ అయింది.
మార్కెట్లలో భయానికి 3 ముఖ్య కారణాలు ఇవే..
* హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న మూడు వాణిజ్య నౌకలపై ఇరాన్ మిసైల్ దాడులు చేయగా, దానికి బదులుగా అమెరికా సైన్యం ఇరాన్ స్థావరాలపై వైమానిక దాడులు ప్రారంభించడం గ్లోబల్ మార్కెట్లను భయపెట్టింది.
* అంతర్జాతీయ మార్కెట్లలో సెంటిమెంట్ దెబ్బతినడంతో జపాన్ సూచీ ‘నిక్కీ’ ఓపెనింగ్‌లోనే 500 పాయింట్లకు పైగా పతనమవగా, సౌత్ కొరియా సూచీ ‘కోస్పి’ 1 శాతం పైగా నష్టపోయింది. గిఫ్ట్ నిఫ్టీ కూడా రెడ్ జోన్‌లోనే ట్రేడ్ అయింది.
* దాడుల వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. బ్రెంట్ ముడి చమురు 3 శాతం పైగా పెరిగి బ్యారెల్‌కు 76 డాలర్ల మార్కును దాటింది. డబ్ల్యూటీఐ (WTI) కూడా 72 డాలర్ల పైనే ట్రేడ్ అవుతోంది. ఈ చమురు ధరల పెరుగుదల వల్ల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఆందోళన ఇన్వెస్టర్లను వెనక్కి తగ్గేలా చేసింది.
ఈ రోజు మార్కెట్‌లో అత్యధికంగా నష్టపోయిన స్టాక్‌ల విషయానికి వస్తే, బీఎస్ఈ లార్జ్‌క్యాప్ కేటగిరీలోని ఇండిగో (2.50%), ఏషియన్ పెయింట్స్ (2.42%), రిలయన్స్ (2.10%), బజాజ్ ఫైనాన్స్ (1.70%), ఐటీసీ (1.60%), ఎం&ఎం (1.50%) నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఇవి కాకుండా, మిడ్‌క్యాప్ కేటగిరీలోని హిందుస్థాన్ పెట్రోలియం (3.60%), అశోక్ లేలాండ్ (2.60%) కూడా నష్టాలతో ట్రేడవుతున్నాయి. స్మాల్‌క్యాప్ జాబితాలోని ఎన్‌బీసీసీ (2.20%), పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ (2.10%) షేర్లు నష్టాలతో ట్రేడవుతున్నట్లు కనిపించాయి.

