Startups Achieved Unicorn Status: ఇండియన్ యూనికార్న్ క్లబ్‌లో ఈ ఏడాది కొత్తగా 20 స్టార్టప్‌లు చేరాయి. దీంతో ఇండియన్ యూనికార్న్‌ల మొత్తం సంఖ్య 106కి పెరిగింది. వీటన్నింటి అంచనా విలువ 343 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇందులో 94 బిలియన్ డాలర్ల ఫండింగ్‌ని ఈ స్టార్టప్‌లు బయటి సంస్థల నుంచి రైజ్ చేయటం విశేషం. ప్రైవేట్‌గా ప్రారంభమై ఒక బిలియన్ లేదా అంతకన్నా ఎక్కువ వ్యాల్యుయేషన్ కలిగిన స్టార్టప్‌నే యూనికార్న్‌గా పేర్కొంటారు. ఈ పదాన్ని ఐలీన్ లీ అనే ఫేమస్ వెంచర్ క్యాపిటలిస్ట్ తొలిసారి వాడారు.
టార్గెట్ 2070
2070 నాటికి సున్నా శాతం ఉద్గారాల లక్ష్యాన్ని సాధిస్తామని ఇండియా ఐక్యరాజ్యసమితికి రాతపూర్వకంగా హామీ ఇచ్చింది. గతేడాది కాన్ఫరెన్స్ ఆఫ్ పారిస్‌లో ప్రధాని మోడీ ఇచ్చిన కమిట్‌మెంట్‌కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. వాతావరణంలోకి విడుదల చేసే ఉద్గారాలను సాధ్యమైనంత ఎక్కువగా తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలను తొలుత 2030 నాటి వరకే రూపొందించారు. అయితే 2070 నాటికి నికరంగా సున్నాకు చేరుకోవటానికి అమలుచేయాల్సిన కార్యాచరణ ప్రణాళికకు దీర్ఘకాలిక లక్ష్యంలో భాగంగా రూపకల్పన చేశారు. ఆ డాక్యుమెంట్స్‌ని తాజాగా సమర్పించారు.
క్రెడిట్-డిపాజిట్
ఈ నెల 12వ తేదీ నాటికి బ్యాంక్ క్రెడిట్ 15.32 శాతం, డిపాజిట్లు 8.84 శాతం పెరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. బ్యాంక్ క్రెడిట్ 124.305 లక్షల కోట్లకు, డిపాజిట్లు 169.49 లక్షల కోట్లకు చేరాయని తెలిపింది. ఈ నెల 13వ తేదీ నాటికి 107.79 లక్షల కోట్లు అడ్వాన్స్ ఇచ్చినట్లు షెడ్యూల్డ్ బ్యాంక్స్ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది.
రూ.19 వేల కోట్ల డీల్
ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా.. ఎస్సార్ గ్రూప్ నుంచి పోర్ట్‌లు, పవర్ ప్లాంట్లు, ఇతర లాజిస్టిక్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్‌ని 19 వేల కోట్ల రూపాయలకు తీసుకోనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఒప్పందం కుదిరినట్లు వెల్లడించింది. దీంతో రుయాస్, మిట్టల్స్ మధ్య నాలుగేళ్లుగా కోర్టుల లోపల, బయట జరుగుతున్న పోరాటం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. రుయాస్‌కి చెందిన ఎస్సార్ స్టీల్‌ను మిట్టల్, నిప్పన్ జాయింట్‌గా కొనుగోలు చేశాక ఆయా ఆస్తులపై వివాదం నెలకొంది. మొత్తానికి ఈ ఇష్యూ సెటిలవటం ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియాకి ఊరట కలిగించే విషయం.
లిస్టింగ్ రోజే బూస్టింగ్
చెన్నైకి చెందిన సిర్మా ఎస్‌జీఎస్ టెక్నాలజీస్ షేర్ల విలువ స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయిన రోజే 42 శాతం పెరిగింది. 262 రూపాయలతో లిస్ట్ అయిన ఈ షేర్ ధర ఇంట్రాడేలో 313 రూపాయలకు చేరింది. సెన్సెక్స్, నిఫ్టీలు అస్థిరంగా ఉన్న పరిస్థితుల్లోనూ ఈ సంస్థ స్టాక్స్ ఇంత మంచి పెర్ఫార్మెన్స్ చూపటం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపర్చింది. ఆశించినదానికన్నా 32 రెట్లకు పైగా సబ్‌స్క్రయిబ్ కావటంతో స్టాక్స్ కొనేందుకు ఇన్వెస్టర్లు పోటీపడ్డారు. సిర్మా ఎస్‌జీఎస్ టెక్నాలజీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,516 కోట్లుగా నమోదైంది.
2 లక్షల కోట్లు సాధిస్తాం
2021-22 ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల కోట్ల విలువైన వార్షిక కొనుగోళ్ల లక్ష్యాన్ని చేరుకుంటామని గవర్నమెంట్ ఇ-మార్కెట్‌ప్లేస్ సీఈఓ కుమార్ సింగ్ తెలిపారు. ఈ నేషనల్ ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి నాలుగు నెలల్లోనే రూ.60 వేల కోట్ల గ్రాస్ మర్చెండైజ్ వ్యాల్యూ సాధించింది. ఇంకా ఎనిమిది నెలల సమయం మిగిలి ఉంది కాబట్టి మిగతా లక్షా 40 వేల కోట్ల టార్గెట్ చేరుకోవటం సాధ్యమేనని కుమార్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.