Smartphone Price Hike: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ‘షాక్’.. విపరీతంగా పెరుగుతున్న మొబైల్ ధరలు.. కారణం ఇదే!

Smartphones

Smartphones

Smartphone Price Hike: మీరు గత కొన్ని నెలలుగా కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఒక బ్యాడ్ న్యూస్. ఇండియన్ మార్కెట్లో ప్రముఖ బ్రాండ్లు అయిన వన్‌ప్లస్ (OnePlus), నథింగ్ (Nothing), రెడ్‌మీ (Redmi), రియల్‌మీ (Realme), మోటోరోలా వంటి కంపెనీలు తమ ఫోన్ల ధరలను సైలెంట్‌గా పెంచేస్తున్నాయి. కొన్ని మోడళ్లపై రూ.2 వేల నుంచి రూ.6 వేల వరకు ధరలు పెరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్మార్ట్‌ఫోన్ ధరలు అకస్మాత్తుగా పెరగడానికి ప్రధాన కారణం టెక్ ప్రపంచంలో వినిపిస్తున్న ‘RAMageddon’ అనే పదం అని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా RAM, స్టోరేజ్ చిప్స్ (NAND chips) కొరత తీవ్రంగా ఉంది. ఈ చిప్స్ తయారీలో స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు, AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కంపెనీలకు మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది.

AI ప్రభావం:
OpenAI, Google, Microsoft వంటి దిగ్గజాలు భారీ AI డేటా సెంటర్లను నిర్మిస్తున్నాయి. వీటికి అత్యధిక నాణ్యత కలిగిన మెమరీ చిప్స్ అవసరం. గతంలో మొబైల్ ఫోన్ల కోసం చిప్స్ తయారు చేసిన ఫ్యాక్టరీలు ఇప్పుడు తమ ప్రాధాన్యతను AI వైపు మళ్లించాయి. డిమాండ్ పెరిగి సరఫరా తగ్గడంతో మెమరీ చిప్స్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనివల్ల కంపెనీలు ఆ భారాన్ని కస్టమర్లపై వేయక తప్పడం లేదని నథింగ్ సీఈఓ కార్ల్ పీ వంటి వారు చెబుతున్నారు. భారత మార్కెట్లో ఇప్పటికే ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. OnePlus 15 లాంచ్ సమయంలో రూ.72,999 ఉన్న ఈ ఫోన్ ధర ఇప్పుడు రూ.77,999 కి చేరింది. అంటే దాదాపు రూ. 5 వేల పెరిగింది. Nothing Phone 4a Pro రూ.39,999 నుంచి రూ.44,999 కి పెరిగింది. బడ్జెట్ ఫోన్లు అయిన రెడ్‌మీ, రియల్‌మీ వంటి బ్రాండ్లు కూడా రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు ధరలను పెంచాయి.

కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం.. 2026 నాటికి స్మార్ట్‌ఫోన్ల సగటు విలువ మరో 7 శాతం పెరిగే అవకాశం ఉందట. రాబోయే రోజుల్లో ఫోన్ల ధరలు 20% నుంచి 40% వరకు పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఫోన్లలో ఈ ప్రధాన మార్పులు ఇవే ఉండొచ్చని చెబుతున్నారు. తక్కువ లాభం వచ్చే బడ్జెట్ ఫోన్ల తయారీని కంపెనీలు తగ్గించి, ఎక్కువ ధర ఉండే ప్రీమియం ఫోన్లపై దృష్టి పెట్టే అవకాశం ఉందట. కొత్త ఫోన్ల ధరలు భారం కావడంతో రీఫర్బిష్డ్ (Refurbished) లేదా పాత ఫోన్ల మార్కెట్‌కు గిరాకీ పెరగవచ్చని చెబుతున్నారు. మధ్యతరగతి ప్రజలు (రూ. 15 వేల నుంచి రూ.30 వేల సెగ్మెంట్) కొత్త ఫోన్ కొనాలనే నిర్ణయాన్ని వాయిదా వేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఈ చిప్స్ కొరత సమస్య 2027 వరకు కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఫోన్ కొనే ప్లాన్ ఉంటే ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.