దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 11,000 నుంచి 12,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని బ్యాంక్ యోచిస్తోంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా తన బ్రాంచ్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాలను SBI చైర్మన్ సి.ఎస్. శెట్టి వెల్లడించారు.
12 వేల వరకు ఉద్యోగాల భర్తీ
రిటైర్‌మెంట్లు, బ్యాంక్ అవసరాలు, భవిష్యత్ విస్తరణను దృష్టిలో ఉంచుకుని ఈ నియామకాలు చేపట్టనున్నట్లు SBI చైర్మన్ తెలిపారు. ఉద్యోగుల అవసరాన్ని బట్టి ఈ సంఖ్య కొంత తగ్గవచ్చు లేదా పెరగవచ్చని, అయితే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి సుమారు 12,000 మంది వరకు నియామకాలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో SBI భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకుంది. ఇందులో సుమారు 1,500 మంది స్పెషలిస్ట్ IT అధికారుల నియామకాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుత సంవత్సరంలో IT విభాగంలో గతేడాది స్థాయిలో పెద్ద సంఖ్యలో నియామకాలు అవసరం లేదని చైర్మన్ తెలిపారు.
SBIలో ఇప్పటికే 2.45 లక్షలకు పైగా ఉద్యోగులు
2026 మార్చి నాటికి SBIలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.45 లక్షలకు పైగా ఉంది. బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో SBI మొత్తం 25,633 మంది ఉద్యోగులను నియమించుకుంది. తాజా నియామకాల ద్వారా బ్యాంకు తన సేవలను మరింత విస్తరించడంతో పాటు వివిధ ప్రాంతాల్లో సిబ్బంది అవసరాలను తీర్చాలని చూస్తోంది.
250 వరకు కొత్త బ్రాంచ్‌లు
ఉద్యోగ నియామకాలతో పాటు SBI తన బ్రాంచ్ నెట్‌వర్క్‌ను కూడా పెంచనుంది. దేశవ్యాప్తంగా 200 నుంచి 250 కొత్త బ్రాంచ్‌లు ప్రారంభించే ప్రణాళిక ఉందని సి.ఎస్. శెట్టి తెలిపారు. కొత్త కాలనీలు అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలతో పాటు వాణిజ్యపరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాల్లో బ్యాంక్ తన ఉనికిని మరింత పెంచుకోవాలని చూస్తోంది. అదే సమయంలో కొన్ని బ్రాంచ్‌లను అవసరానికి అనుగుణంగా పునర్వ్యవస్థీకరించే ప్రక్రియ కూడా కొనసాగుతోందని చైర్మన్ తెలిపారు. అయినప్పటికీ ప్రతి సంవత్సరం బ్రాంచ్‌ల సంఖ్యలో సుమారు 200 నుంచి 250 వరకు నికర పెరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
NSEలో SBI వాటాల విక్రయానికి ప్లాన్
ఇదిలా ఉండగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో తన వాటాకు సంబంధించి కూడా SBI కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. SBI, దాని అనుబంధ సంస్థ SBI Capital Markets కలిసి NSEలో తమ వాటాలో సుమారు 1 శాతం విక్రయించే యోచనలో ఉన్నట్లు చైర్మన్ తెలిపారు. ఇందులో SBI సుమారు 0.65 శాతం, SBI Capital Markets సుమారు 0.35 శాతం వాటాను విక్రయించే అవకాశం ఉంది. అయితే ఇతర వాటాదారులు కూడా తమ వాటాలను విక్రయిస్తే SBI గ్రూప్ మొత్తం డిజిన్వెస్ట్‌మెంట్ 1 శాతం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
NSEలో SBIకి ఎంత వాటా ఉంది?
ప్రస్తుతం NSEలో SBIకి సుమారు 3.23 శాతం, SBI Capital Marketsకు 4.33 శాతం వాటా ఉన్నట్లు సమాచారం. NSEకి ఇటీవల సుమారు రూ.30,000 కోట్ల విలువైన IPO కోసం నియంత్రణ సంస్థ నుంచి అనుమతి లభించింది. ఈ IPO మార్కెట్లోకి వస్తే దేశంలో ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద IPOగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటివరకు దేశంలో అతిపెద్ద IPOగా 2024లో Hyundai Motor India రూ.27,858.75 కోట్లతో నిలిచింది. ఆ తర్వాత LIC రూ.20,557.23 కోట్లు, Paytm రూ.18,300 కోట్లు, Tata Capital రూ.15,511.87 కోట్లు, Coal India రూ.15,200 కోట్ల IPOలను తీసుకొచ్చాయి.

