అప్పట్లో పెద్దనోట్లు (రూ.వెయ్యి, రూ.500 పాత నోట్లు)ను రద్దు చేసి సంచలనానికి తెరలేపారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ సమయంలో.. ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి.. ఇక, అప్పుడే.. రూ.2 వేల నోటును ముద్రించింది ఆర్బీఐ.. అది కాస్త చిల్లర కష్టాలు రుచిచూపించగా.. ఆ తర్వాత రూ.500 కొత్త నోటు, రూ.200 కూడా వచ్చేశాయి.. క్రమంగా అన్ని నోట్లు.. రంగులు మారుతూ పోయాయి.. సైజులు కూడా తగ్గిపోయాయి. నోట్ల రద్దు తప్పుడు నిర్ణయమని.. ఇదే.. భారత ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బకొట్టిందనే విమర్శలు లేకపోలేదు. మరోవైపు.. రూ.2000 నోట్లు కూడా రద్దు కానున్నాయా? అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం.. గత రెండేళ్లుగా రూ.2,000 కరెన్సీని ముద్రించడం నిలిపివేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. అంతే కాదు.. ఆ నోట్లను క్రమంగా సర్క్యులేషన్ నుంచి ఉపసంహరించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
పెద్ద నోటును క్రమంగా మార్కెట్ చలామణి నుంచి తప్పించడం చూస్తుంటే.. త్వరలోనే రూ.2000 నోటుకు బైబై చెప్పడం ఖాయమని లెక్కలు వేస్తున్నారు.. ఎందుకంటే.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.57,757 నోట్ల విలువ గల రూ.2000 నోట్లు మార్కెట్‌లో చలామణి నుంచి మాయం అయ్యాయి.. 2019-20లో రూ.2000 నోట్ల విలువ రూ.5,47,952 కోట్లు ఉంటే, 2020-21 నాటికి రూ.4,90,195 కోట్లకు పడిపోయిందని.. స్వయంగా ఆర్బీఐ తాజా వార్షిక నివేదికలోనే పేర్కొంది. 2018 మార్చి నాటికి 336.3కోట్ల రూ. 2000 నోట్లు చలామణీలో ఉండగా.. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఆ సంఖ్య రూ. 245.1 కోట్లకు పడిపోయింది. అంటే దాదాపు 91.2కోట్ల నోట్లను ఆర్బీఐ వెనక్కి తీసుకుంది. ఇక, ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం మార్కెట్‌లో చలామణిలో ఉన్న నోట్లలో రూ.2000 నోట్లు 17.3 శాతంగా ఉండగా.. ఇది 2019-20లో 22.6 శాతంగా ఉండేది.. 2019-20లో రూ.5.47 లక్షల కోట్ల విలువ గల రూ.2000 నోట్లు రూ.4.9 లక్షల కోట్లకు పడిపోయాయి. మరోవైపు.. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు రూ.2000 నోట్లను తగ్గించాలని ఆర్బీఐ భావించాయి. కానీ, కరోనా ప్రారంభం అయినప్పట్టి నుంచి నగదు చలామణి పెరిగిపోయిందని ఆర్బీఐ పేర్కొంది. గత మార్చి నెలాఖరు నాటికి చలామణిలో ఉన్న బ్యాంకు నోట్ల మొత్తం కరెన్సీ విలువలో రూ. 500, రూ. 2వేల నోట్ల వాటా 85.7శాతంగా ఉందని.. కరోనా, దానిని కట్టడి కోసం తీసుకున్న చర్యలతో నగదు వినియోగం పెరిగిందని పేర్కొంది ఆర్బీఐ.. అయితే, రూ.2000 నోట్లు ముద్రణ నిలిపివేయడం.. క్రమంగా ఉపసంహరణ జరుగుతుండడంతో.. మొత్తానికి ఆ నోటే మాయం అవుతుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.