రుణాలు తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఊరట కలిగించింది. ఆర్‌బీఐ వరుసగా పదోసారి కూడా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సారథ్యంలోని మానిటీరీ పాలసీ కమిటీ గురువారం నాడు కీలక రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగానే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేటు 4 శాతంగా వద్దనే ఉంది. రివర్స్ రెపో 3.35 శాతం వద్ద కొనసాగుతోంది. అదేసమయంలో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 4.25 శాతం వద్ద కొనసాగుతోంది. ఆర్‌బీఐ చివరిసారి 2020 మే 22న వడ్డీ రేట్లను సవరించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వడ్డీ రేట్లలో మార్పులు లేవు.
కాగా మరోవైపు ఈ-రూపీ వోచర్ పరిమితిని పెంచుతూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను మరింత మెరుగ్గా అందజేసేందుకు ఆర్‌బీఐ గవర్నర్ ఈ ప్రకటన చేశారు. ఈ-రూపీ వోచర్‌ను లిమిట్‌ను రూ. 10 వేల నుంచి రూ. లక్షకు పెంచుతున్నట్లు ఆయన తెలిపారు.ఈ మేరకు ఎన్‌పీసీఐకి ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించారు. అంతేకాకుండా ఇకపై ఈ-రూపీ వోచర్‌ను ఎన్ని సార్లు అయినా ఉపయోగించవచ్చని సూచించారు. అటు 2022-23లో వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంగా ఉండొచ్చని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ మోస్తరు స్థాయికి దిగొచ్చినా ఇంకా మిగులుగానే ఉందన్నారు. అంతర్జాతీయ సవాళ్లు, సంక్షోభాల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థకు రక్షణగా నిలుస్తామని తెలిపారు.
