రిలయన్స్ జియో యూజర్లకు గట్టి షాక్ ఇచ్చింది. గతేడాది జులై నెలలో భారీగా టారిఫ్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. దీంతో యూజర్లు కొంత అసహనానికి గురయ్యారు. దీంతో తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తున్న ఇతర నెట్ వర్క్ లకు మారిపోయారు. దీంతో కస్టమర్లను కాపాడుకునేందుకు తక్కువ ధరలో మంచి బెనిఫిట్స్ ను అందించే రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఇప్పుడు మరోసారి యూజర్లకు షాక్ ఇచ్చింది జియో. ఒకేసారి రూ. 100 పెంచింది. జియో తన చౌకైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్ రూ. 199 పై రూ. 100 పెంచింది. దీంతో ఇకపై రూ. 299తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
జనవరి 23 నుండి, ఈ ప్లాన్ కోసం కస్టమర్ల నుంచి రూ.199కి బదులుగా రూ.299 వసూలు చేస్తుంది. జియో తీసుకున్న ఈ నిర్ణయంతో యూజర్లు లబోదిబోమంటున్నారు. ఈకొత్త ప్లాన్ జనవరి 23 నుంచి అమల్లోకి రానున్నది. జియో ఈ ప్లాన్‌లో, వినియోగదారులు భారతదేశం అంతటా ఏ నంబర్‌కైనా కాల్ చేయడానికి అపరిమిత కాలింగ్‌తో పాటు 25GB హై స్పీడ్ డేటాను అందిస్తోంది. డైలీ 100 ఉచిత SMSలు, ఉచిత జాతీయ రోమింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. ఇక కొత్తగా చేరే కస్టమర్లు రూ. 299కి బదులుగా రూ. 349తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని జియో వెల్లడించింది.