దేశంలో ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుండటంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక వడ్డీ రేట్లను పెంచే దిశగా అడుగులు వేస్తోందని ఐసీఐసీఐ బ్యాంక్ గ్లోబల్ మార్కెట్స్ నివేదిక అంచనా వేసింది. రాబోయే రోజుల్లో ఆర్‌బీఐ రెపో రేటును 50 నుంచి 75 బేసిస్ పాయింట్ల వరకు పెంచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఈ మార్పులు చోటుచేసుకోవచ్చని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
5 శాతానికి చేరనున్న ద్రవ్యోల్బణం..
ఐసీఐసీఐ బ్యాంక్ విశ్లేషణ ప్రకారం.. 2026-27 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ద్రవ్యోల్బణం 5 శాతానికి చేరే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరియు దేశంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల ఆహార వస్తువుల ధరలు పెరగడం ఇందుకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి ఆర్‌బీఐ సాధారణంగా వడ్డీ రేట్లను పెంచుతుంది.
ప్రస్తుతం 5.25 శాతం వద్ద రెపో రేటు..
ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేటు 5.25 శాతం వద్ద కొనసాగుతోంది. ఒకవేళ ఐసీఐసీఐ బ్యాంక్ అంచనాలే నిజమైతే, 50-75 బేసిస్ పాయింట్ల పెంపుతో రెపో రేటు 5.75 శాతం నుంచి 6.00 శాతానికి చేరే ప్రమాదం ఉంది. గత కొన్ని త్రైమాసికాలుగా ఆర్‌బీఐ రేట్ల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించినప్పటికీ.. మారుతున్న ఆర్థిక సమీకరణాల దృష్ట్యా రానున్న ద్రవ్య పరపతి సమీక్షల్లో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
సామాన్యులపై పడే ప్రభావం..
ఆర్‌బీఐ గనుక రెపో రేటును పెంచితే, వాణిజ్య బ్యాంకులు కూడా తమ రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతాయి. దీనివల్ల.. ఇంటి రుణాలు, కారు రుణాలు, వ్యక్తిగత రుణాలు తీసుకున్న సామాన్యుల నెలవారీ ఈఎంఐలు భారీగా పెరుగుతాయి. అంతే కాకుండా.. కొత్తగా లోన్లు తీసుకోవాలనుకునే వారికి వడ్డీ భారం మరింత అధికమవుతుంది. రేట్ల పెంపుతో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FDs) వచ్చే వడ్డీ రేట్లు పెరిగి, సీనియర్ సిటిజన్లకు కొంత ఉపశమనం లభిస్తుంది. రాబోయే అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో దేశీయ మార్కెట్ గమనాన్ని బట్టి ఆర్‌బీఐ తన తదుపరి వ్యూహాన్ని ప్రకటించనుంది.

