Site icon NTV Telugu

Paytm: టెన్షన్ వద్దు.. మీ డబ్బులు సేఫ్! పేటియం బ్యాంక్ లైసెన్స్ రద్దైనా డబ్బు ఎలా వస్తుందంటే..

Paytm Biometric Upi

Paytm Biometric Upi

Paytm: ఫిన్‌టెక్ దిగ్గజం పేటియంకు భారీ షాక్ తగిలింది. పేటియం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆర్‌బీఐ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ వ్యవహారంపై తదుపరి చర్యల కోసం ఆర్‌బీఐ హైకోర్టును కూడా ఆశ్రయించనుంది.

కస్టమర్ల డబ్బులు సేఫ్‌గా ఎలా తిరిగిస్తారంటే..
లైసెన్స్ రద్దయిన నేపథ్యంలో ఖాతాదారుల్లో ఆందోళన మొదలైంది. అయితే పేటియం పేమెంట్స్ బ్యాంక్ తన అఫీషియల్ పోర్టల్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది. డిపాజిటర్ల సొమ్ము పూర్తిగా సురక్షితంగా ఉందని సంస్థ తెలిపింది. కస్టమర్లందరికీ డిపాజిట్లను తిరిగి ఇచ్చేందుకు తమ వద్ద సరిపడా నిధులు ఉన్నాయని పేర్కొంది. డబ్బును ఎలా తిరిగి ఇస్తారనే దానిపై పూర్తి వివరాలను, ప్రక్రియను కంపెనీ త్వరలోనే వెల్లడించనుంది. చాలా కాలంగా పేటియం పేమెంట్స్ బ్యాంక్ పనితీరుపై ఆర్‌బీఐ అసంతృప్తిగా ఉంది. బ్యాంకింగ్ నిబంధనలను సరిగ్గా పాటించకపోవడం, బ్యాంక్ యాజమాన్యంపై నమ్మకం కోల్పోవడం, ఖాతాదారుల ప్రయోజనాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని భావించడంతో తాజాగా ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. గతంలోనే (2022లో) కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. ఆ తర్వాత 2024లో ఖాతాల్లో డబ్బులు జమ చేయడంపై కూడా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీని ప్రభావం పేటియం ఫాస్టాగ్ సేవలపై కూడా పడింది.

ఇకపై ఏం చేయలేరా..
లైసెన్స్ రద్దయిన తర్వాత పేటియం పేమెంట్స్ బ్యాంక్ ఇకపై ‘బ్యాంక్’గా వ్యవహరించలేదు. కొత్త ట్రాన్సాక్షన్స్ జరపడం, బ్యాంకింగ్ సేవలు అందించడం వంటివి పూర్తిగా నిలిచిపోతాయి. ఇక్కడ వినియోగదారులు ఒక విషయాన్ని గమనించాలి. ఆర్‌బీఐ రద్దు చేసింది ‘పేటియం పేమెంట్స్ బ్యాంక్’ లైసెన్స్‌ను మాత్రమే. ‘పేటియం యాప్’ యథావిధిగా పనిచేస్తుంది. పేటియం పేరెంట్ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. తాము పేటియం పేమెంట్స్ బ్యాంక్ నుంచి వేరుగా ఉన్నామని, యాప్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని కంపెనీ స్పష్టం చేసింది.

Exit mobile version