Post Office MIS Scheme: ఉద్యోగం చేసేవాళ్లకు ప్రతినెలా ఒకటో తేదీ రాగానే అకౌంట్లో జీతం పడుతుంది. మరి రిటైర్ అయిన వాళ్ల పరిస్థితి ఏంటి? లేదా చేతిలో కాస్త డబ్బు ఉండి, ఏదైనా వ్యాపారం చేయడానికి భయపడే మధ్యతరగతి కుటుంబాల సంగతేంటి? షేర్ మార్కెట్ రిస్కులు వద్దు, ప్రతినెలా వాయిదాలు కట్టే తలనొప్పి అసలే వద్దు, కానీ నెలానెలా జీతం లాంటి ఒక స్థిరమైన ఆదాయం కావాలి అనుకునే వాళ్ల కోసమే పోస్టాఫీసు ఒక అద్భుతమైన పథకాన్ని అందిస్తోంది. అదే ‘పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్’ (MIS). ఈ స్కీమ్‌లో మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.. మీ దగ్గర ఉన్న సేవింగ్స్‌లో రూ.5 లక్షలను ఒకేసారి డిపాజిట్ చేయడం. ఆ తర్వాత ఐదేళ్ల పాటు ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రతినెలా మీ ఖాతాలో డబ్బులు జమ అవుతూనే ఉంటాయి.
ప్రస్తుతం 2026 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి గాను పోస్ట్ ఆఫీస్ MIS పథకంపై 7.4 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. ఈ లెక్కన మీరు ఒక్కసారి రూ.5 లక్షలు జమ చేస్తే, ప్రతి నెలా మీ బ్యాంక్ ఖాతాలోకి రూ.3,083 నేరుగా వచ్చి పడతాయి. అంటే ఏడాదికి రూ.37,000 వడ్డీ రూపంలో చేతికి అందుతాయన్నమాట. ఈ స్కీమ్ కాలపరిమితి ఐదేళ్లు. మీరు ఖాతాను పూర్తిగా ఐదేళ్ల పాటు కొనసాగిస్తే, ప్రతినెలా వచ్చే వడ్డీ అంతా కలిపి మొత్తం రూ.1,85,000 ఆదాయం వస్తుంది. ఐదేళ్లు పూర్తయ్యాక మీరు మొదట కట్టిన రూ.5 లక్షల అసలు కూడా మీకు తిరిగి ఇచ్చేస్తారు. ఇలా వడ్డీ, అసలు రెండూ కలిపి ఐదేళ్లలో మీ చేతికి మొత్తం రూ.6,85,000 అందుతాయి.
తమ వద్ద ఉన్న పొదుపు డబ్బుతో ప్రతి నెలా ఒక నిర్దిష్టమైన ఆదాయం రావాలని కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా రిటైర్ అయిన తర్వాత పెన్షన్‌కు తోడుగా అదనపు ఆదాయం కావాలనుకునే సీనియర్ సిటిజన్లకు ఇది ఎంతో అండగా నిలుస్తుంది. అలాగే, ఇంట్లో ఉన్న ఒకేసారి మొత్తంతో నెలవారీ ఖర్చులు వెళ్లదీసుకోవాలనుకునే కుటుంబాలకు ఇది పూర్తి ప్రభుత్వ భద్రతతో కూడిన మార్గం. ఈ పథకంలో ఎంతపడితే అంత జమ చేయడానికి కుదరదు. ఒక వ్యక్తి తన పేరు మీద సింగిల్ అకౌంట్ తీసుకుంటే గరిష్టంగా రూ.9 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. అదే భార్యాభర్తలు లేదా కుటుంబ సభ్యులతో కలిసి జాయింట్ అకౌంట్ తీసుకుంటే గరిష్టంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.
ఒకవేళ మధ్యలో అత్యవసరంగా డబ్బులు అవసరమైతే, ఖాతా తెరిచిన ఏడాది లోపు డబ్బు వెనక్కి తీసుకోవడానికి వీలుండదు. ఏడాది పూర్తయ్యాక, మూడేళ్ల లోపు ఖాతాను క్లోజ్ చేస్తే డిపాజిట్ మొత్తంలో 2 శాతం కోత విధిస్తారు. అదే మూడేళ్ల తర్వాత, ఐదేళ్ల లోపు క్లోజ్ చేస్తే 1 శాతం మాత్రమే కట్ చేసి మిగిలిన డబ్బును తిరిగి ఇచ్చేస్తారు. రూపాయి కూడా రిస్క్ లేకుండా నెలానెలా జీతంలా డబ్బు కావాలనుకునే వారికి ఈ పోస్టాఫీసు స్కీమ్ మంచి భరోసా ఇస్తుంది.

