పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తన ఖాతాదారులకు షాకిస్తూ డెబిట్ కార్డుల ద్వారా జరిపే నగదు విత్‌డ్రా పరిమితుల్లో భారీ మార్పులు చేసింది. సైబర్ మోసాలను అరికట్టడం, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. నూతన ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనల ప్రకారం.. ఎంపిక చేసిన ప్రీమియం డెబిట్ కార్డులపై రోజువారీ నగదు విత్ డ్రా పరిమితిని ఏకంగా 50 శాతం మేర తగ్గించారు. గతంలో ఉన్న పరిమితులను సగానికి కుదిస్తూ బ్యాంక్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Also Read:Free Bus Travel: ఏపీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఈ నెల 16 నుంచి వారికి కూడా ఫ్రీ..
బ్యాంక్ తన కార్డులను రెండు కేటగిరీలుగా విభజించి ఈ తగ్గింపును అమలు చేస్తోంది. అందులో ముఖ్యంగా.. రూపే ఎన్‌సీఎంసీ ప్లాటినం (డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్), రూపే ఉమెన్ పవర్ ప్లాటినం, పీఎన్‌బీ పలాష్, రూపే బిజినెస్ ప్లాటినం, మాస్టర్ కార్డ్ ప్లాటినం మరియు వీసా గోల్డ్ కార్డులు కలిగిన వారు ఇకపై రోజుకు గరిష్టంగా రూ. 50,000 మాత్రమే విత్‌డ్రా చేయగలరు. అంతక ముందు ఈ విత్ డ్రా లిమిట్ రూ.లక్ష వరకు ఉండేది. అంటే 50 శాతం మేర తగ్గించారు.
ఇక రెండో కేటగిరీలో.. రూపే సెలక్ట్, పీఎన్‌బీ రూపే సెలక్ట్ నియో లేదా ఎక్సెల్, వీసా సిగ్నేచర్ మరియు మాస్టర్ కార్డ్ బిజినెన్ డెబిట్ కార్డులకు ఈ పరిమితి వర్తిస్తుంది. గతంలో ఉన్న రూ. 1.50 లక్షల లిమిట్ ఇకపై రూ. 75,000 కు పరిమితం అవుతుంది. PNB ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. ఏటీఎం సెంటర్‌లలో జరిగే స్కిమ్మింగ్, క్లోనింగ్ వంటి మోసాల వల్ల ఖాతాదారులు పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోకుండా ఈ పరిమితి రక్షణ కల్పిస్తుంది. నగదు వినియోగాన్ని తగ్గించి, UPI, నెట్ బ్యాంకింగ్, పాయింట్ ఆఫ్ సేల్ లావాదేవీలను పెంచాలని బ్యాంక్ భావిస్తోంది.
Also Read:India vs England: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. టీమిండియాకు బ్రూక్ బిగ్ సవాల్..
ఒకవేళ ఖాతాదారులకు అత్యవసరంగా ఎక్కువ నగదు కావాల్సి వస్తే.. వారు బ్యాంక్ బ్రాంచ్ లేదా మొబైల్ యాప్ ద్వారా తమ పరిమితిని తాత్కాలికంగా పెంచుకునే వెసులుబాటును కూడా బ్యాంక్ పరిశీలిస్తోంది. సాధారణ (క్లాసిక్) డెబిట్ కార్డుల పరిమితుల్లో ఎటువంటి మార్పులు లేవు. పీఎన్‌బీ వినియోగదారులు తమ కార్డు రకాన్ని బట్టి ఏప్రిల్ 1 నాటికి తమ ఖర్చులను ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
