ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ముడిచమురు ధరలను బట్టే పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తుంటారు. కానీ ఓ వైపు ముడి చమురు ధరలు పెరుగుతున్నా.. దేశంలో పెట్రోల్ ధరలు పెరగడం లేదు. దీనికి కారణంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటమే. గత ఏడాది నవంబర్ 4 నుంచి ఇప్పటి వరకు భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు మాటే లేదు. ఈ కాలంలో బ్యారెల్ ముడి చమురు ధర 14 డాలర్లు పెరిగి 94 డాలర్లకు చేరింది. త్వరలోనే బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్లకు చేరుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి
సాధారణంగా ముడి చమురు ధర బ్యారెల్‌కు ఒక డాలర్ పెరిగితే.. భారత్‌లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు లీటర్‌కు 45 పైసలు పెరగాలి. నవంబర్ 4 నుంచి పెరిగిన బ్యారెల్ ధరలను లెక్కిస్తే ఇండియాలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.6కి పైగానే పెరగాలి. దీనికి వ్యాట్ లాంటి పన్నులను కలిపితే రూ.8కి చేరుతుంది. దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా ఆ నష్టాన్ని భరిస్తూ వచ్చిన కేంద్రం.. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే మొత్తం భారాన్ని సామాన్యుడిపై మోపేందుకు సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతోంది.
