Site icon NTV Telugu

Petrol prices: లీటరుకు రూ.15 పెరగనున్న పెట్రోల్ ధర

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజాగా దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో రెండు రోజుల్లో లీటర్ పెట్రోల్ రూ.15, డీజిల్ రూ.22 మేర పెరగనున్నాయని ఐఏఎన్‌ఎస్ రిపోర్ట్ తెలిపింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం కాకముందు క్రూడాయిల్ బ్యారెల్ ధర 95 డాలర్లుగా ఉంటే ఇప్పుడు ఏకంగా 125 డాలర్లకు పెరిగింది.

ప్రస్తుతం మన దేశంలో ఉపయోగిస్తున్న చమురులో 80 శాతం దిగుమతుల రూపంలోనే వస్తుంది. దీంతో పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. అయితే పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరల్లో కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఎక్సైజ్ సుంకం తగ్గిస్తే.. పెరగనున్న రేట్లలో రూ.5-7 వ్యత్యాసం కనిపించే అవకాశం ఉంది. ఒకవేళ కేంద్రం కరుణించకపోతే పెట్రోల్ ధరలతో పాటు నిత్యావసర ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిత్యావసరాలు ప్రజలకు చేరాలంటే రవాణా ముఖ్య పాత్ర పోషించనుంది. రవాణా కావాలంటే పెట్రోల్ లేదా డీజిల్‌ను వినియోగించాల్సి ఉంటుంది.

Exit mobile version