EPFO: PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. డిసెంబర్ నుంచి కొత్త సదుపాయం..?

Epfo

Epfo

EPFO: ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF)కు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. త్వరలోనే పీఎఫ్ డబ్బులను UPI ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి విత్‌డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే పీఎఫ్ డబ్బుల కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. క్లెయిమ్ ఆమోదం పొందిన తర్వాత వేగంగా నగదు పొందే అవకాశం కలుగుతుంది. 2026 డిసెంబర్ చివరి నాటికి ఈ సదుపాయాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

UPI ద్వారా PF విత్‌డ్రాయల్ ఎప్పటి నుంచి?
UPI ద్వారా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకునే సదుపాయం 2026 డిసెంబర్ చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ విధానం అమల్లోకి వస్తే పీఎఫ్ సభ్యులు తమ ఉపసంహరణ క్లెయిమ్ ఆమోదం పొందిన వెంటనే వేగంగా డబ్బులు పొందగలుగుతారు. అయితే ప్రారంభ తేదీ, పూర్తి విధివిధానాలపై EPFO నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. అయితే, ఈ కొత్త సదుపాయం ద్వారా చేసే పీఎఫ్ ఉపసంహరణలకు కొన్ని పరిమితులు విధించే అవకాశం ఉంది. ప్రారంభంలో కనీస లావాదేవీ పరిమితిగా రూ.1,000ను పరిశీలిస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. చిన్న చిన్న క్లెయిమ్‌లు పదేపదే చేయకుండా ఉండటం, ప్రాసెసింగ్ భారాన్ని తగ్గించడం ఈ పరిమితుల ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. అయితే గరిష్ఠ విత్‌డ్రాయల్ పరిమితి సహా ఇతర నిబంధనలపై పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

ఈ విధానానికి ఎప్పుడు శ్రీకారం చుట్టారు?
పీఎఫ్ సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేసి, ఉద్యోగులకు వేగవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ మార్పులకు శ్రీకారం చుట్టారు. 2025 మార్చిలో జరిగిన కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో ఈ డిజిటల్ పరివర్తనకు సంబంధించిన ప్రతిపాదనలు చర్చకు వచ్చినట్లు సమాచారం. అనంతరం 2025 అక్టోబర్‌లో జరిగిన బోర్డు సమావేశంలో వేగవంతమైన ఆటోమేటెడ్ క్లెయిమ్‌లు, తక్షణ ఉపసంహరణలు, మెరుగైన డిజిటల్ సేవలకు సంబంధించిన కొత్త ఫ్రేమ్‌వర్క్‌కు ఆమోదం లభించినట్లు నివేదికలు వెల్లడించాయి.

UPI ద్వారా PF విత్‌డ్రాయల్‌లో ఆలస్యం ఎందుకు?
వాస్తవానికి ఈ సదుపాయం గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికే అందుబాటులోకి వస్తుందని తొలుత అంచనా వేశారు. అయితే సాంకేతిక అనుసంధానం, పరీక్షల ప్రక్రియ కారణంగా ఆలస్యమైనట్లు తెలుస్తోంది. UPI వ్యవస్థకు అవసరమైన API అభివృద్ధి, బ్యాంకింగ్ మరియు చెల్లింపు వ్యవస్థలతో అనుసంధానానికి సంబంధించిన పనులు చేపట్టినట్లు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే వినియోగదారులకు ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత EPFO సభ్యులు BHIM యాప్ ద్వారా UPI ఉపయోగించి తమ ఆమోదం పొందిన పీఎఫ్ ఉపసంహరణ మొత్తాన్ని నేరుగా బ్యాంకు ఖాతాలోకి పొందవచ్చు. ప్రస్తుతం పీఎఫ్ క్లెయిమ్‌ల పరిష్కారం, నగదు జమ కావడానికి పట్టే సమయంతో పోలిస్తే ఈ విధానం మరింత వేగంగా పనిచేసే అవకాశం ఉంది. మొత్తంగా ఈ కొత్త సదుపాయం అమల్లోకి వస్తే ప్రైవేట్ ఉద్యోగులకు పీఎఫ్ డబ్బుల ఉపసంహరణ మరింత సులభతరం కానుంది.