Mukesh Ambani: రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(రిల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) ముఖేష్ అంబానీ వరుసగా రెండో ఏడాదీ వేతనం తీసుకోలేదు. 2020లో కొవిడ్ వైరస్ మహమ్మారి విజృంభించడంతో ఎకానమీ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ఈ నేపథ్యంలో ఆయన 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి శాలరీని స్వచ్ఛందంగా వదలుకున్నారు. 2021-2022లో కూడా ముఖేష్ అంబానీ వేతనం తీసుకోలేదని రిలయెన్స్ సంస్థ తన వార్షిక నివేదికలో పేర్కొంది.
ఇదే కాదు. శాలరీ విషయంలో ముఖేష్ అంబానీ 2008లో కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టారు. అలవెన్సులు, ఇన్సెంటివ్స్, రిటైరల్ బెనెఫిట్స్ అన్నీ కలిపి వార్షిక వేతనం 15 కోట్ల రూపాయలకు మించి తీసుకోనని తేల్చిచెప్పారు. 2020 వరకు కూడా అదే ఫాలో అయ్యారు. ఆ సంవత్సరం నుంచి అసలే తీసుకోవటం మానేశారు. రిలయెన్స్ గ్రూపులోని కొన్ని కంపెనీల వారసత్వాన్ని ఇటీవలే తన కుమారుడికి కట్టబెట్టిన సంగతి తెలిసిందే.
UDAN Scheme: ఉడాన్ పథకం ఘనత. ఐదేళ్లలో లక్షన్నరకు పైగా విమానాలు ప్రారంభం.
రూ.6.42 ట్రిలియన్ల రికవరీ
ప్రభుత్వ రంగ బ్యాంకులు 2014-22 మధ్య కాలంలో 6.42 ట్రిలియన్ల రూపాయలు రికవరీ చేశాయి. మొండి బకాయిలు (ఎన్‌పీఏలు), సాంకేతికంగా రద్దు చేసిన (రిటన్ ఆఫ్) లోన్లపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. 98.5 శాతం మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై కోర్టుల్లో కేసులు వేశాయి. ఇదిలాఉండగా 2015-21 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.3.36 ట్రిలియన్లు సమకూర్చింది. మూలధనం కింద వీటిని అందజేసింది. మరో వైపు మార్కెట్ల నుంచి రూ.2.99 ట్రిలియన్లు సేకరించింది.
గ్రేట్ ‘అప్‌గ్రాడ్’
ఆన్‌లైన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫాం అయిన అప్‌గ్రాడ్.. రూ.1,670 కోట్ల నిధులను సమీకరించింది. వివిధ ఎడ్‌టెక్ సంస్థలు తీవ్ర నిధుల లేమితోపాటు వివిధ కారణాల వల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని తీసేస్తున్న నేపథ్యంలో అప్‌గ్రాడ్ ఈ స్థాయిలో రాణించటం విశేషమనే చెప్పాలి. అంతేకాదు. ఈ ఆర్థిక సంవత్సరంలో వార్షిక స్థూల ఆదాయం రూ.400-500 కోట్లు నమోదు చేస్తామంటూ ధీమా వ్యక్తం చేసింది. అప్‌గ్రాడ్‌కి 30 లక్షలకు పైగా లెర్నర్ బేస్ ఉండటం గమనార్హం.
‘టాటా’ చేతికి ‘ఫోర్డ్’
గుజరాత్‌లోని సనంద్ సిటీలో ఉన్న ఫోర్డ్ ఇండియా ప్లాంట్‌ను టాటా మోటార్స్ కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ.725.7 కోట్లు. ఈ రెండు సంస్థల తయారీ యూనిట్లు సనంద్‌లో పక్కపక్కనే ఉండటం గమనార్హం. యూనిట్ ట్రాన్స్‌ఫర్ ఒప్పందంపై రెండు కంపెనీలు ఇవాళే సంతకాలు చేశాయి. అర్హులైన ఫోర్డ్ సిబ్బందికి తమ దగ్గర ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తామని టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ ప్రకటించింది. ఈ రెండు సంస్థలు ఒక్కటి కావటంతో ప్రయాణికుల వాహనాల విభాగంలో ఇక ‘టాటా’ బలమైన ముద్ర వేయనుందని భావిస్తున్నారు.