Site icon NTV Telugu

Mobikwik: క్లిక్‌ అయిన మొబీక్విక్‌. అద్భుత ఫలితాలను వెల్లడించిన ఫిన్‌టెక్‌ కంపెనీ

Mobikwik

Mobikwik

Mobikwik: మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో తమ సంస్థ మొత్తం ఆదాయం 80 శాతం పెరిగి 540 కోట్లకు చేరినట్లు ఫిన్‌టెక్‌ కంపెనీ మొబీక్విక్‌ వెల్లడించింది. ఇందులో 300 కోట్లకు పైగా ఆదాయం 2020-21లోనే సమకూరినట్లు స్పష్టం చేసింది. ఆ సంవత్సరం 30 కోట్లు మాత్రమే కంట్రిబ్యూషన్‌ మార్జిన్‌ రాగా అది ఇప్పుడు రూ.145 కోట్లకు పెరిగిందని పేర్కొంది. 2021-22లో ఆపరేషనల్‌ ప్రాఫిట్‌ కూడా పొందినట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం పేమెంట్లు మరియు డిజిటల్‌ ఫైనాన్సియల్‌ సర్వీసుల ద్వారానే రెవెన్యూ జనరేట్‌ అవుతోందని మొబీక్విక్‌ వివరించింది.

ఇండియా.. ది బెస్ట్‌

గ్లోబల్‌ స్టాక్‌ మార్కెట్లతో పోల్చితే ఇండియా బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ చూపింది. ఎమర్జింగ్‌ మార్కెట్ల వెయిట్‌ ఇండెక్స్‌లో తైవాన్‌ని దాటేసి 2వ స్థానానికి చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికంలో సెన్సెక్స్‌ 11 శాతం పెరిగింది. కనీసం ఒక ట్రిలియన్‌ డాలర్ల విలువైన స్టాక్‌ మార్కెట్లు గల దేశాల కన్నా మన దేశం అత్యుత్తమ పనితీరును కనబరిచింది. 108 సభ్య సంస్థలతో ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ వెయిటేజీ ప్రపంచ మార్కెట్లలో 14 శాతానికి పైగా ఉండటం విశేషం. ఇండెక్స్‌ వెయిటేజీలో మూడో వంతు వాటాతో చైనా మొదటి స్థానాన్ని ఆక్రమించిన సంగతి తెలిసిందే.

Indias National Cinema Day: మూవీ లవర్స్‌కు బంపర్ ఆఫర్.. రూ.75కే మల్టీప్లెక్స్‌లో సినిమా చూసే ఛాన్స్‌

త్వరలో గ్రీన్‌బాండ్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ద్వితీయార్ధంలో గ్రీన్‌ బాండ్ల జారీకి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. సంబంధిత ఫ్రేమ్‌వర్క్‌కి ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతోంది. హెచ్2 బారోయింగ్స్‌లో భాగంగా 5 పాయింట్‌ ఎనిమిది ఆరు ట్రిలియన్‌ రూపాయలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రారంభంలో గ్రీన్ బాండ్‌లను వీక్లీ గవర్నమెంట్‌ సెక్యూరిటీ ఆఫర్‌ల కింద విడతల వారీగా జారీ చేస్తుంది. ఈ రుణాలను 25 వేల కోట్ల రూపాయలకు మించకుండా తీసుకోవాలని పరిమితి విధించనుంది. కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ ది పార్టీస్‌ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునే ప్రాజెక్టుల కోసం ఈ ఫండ్స్‌ని ఖర్చుచేయనుంది.

ఉపాధి ఖర్చుది

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గత ఎనిమిదేళ్లలో 5 ట్రిలియన్‌ రూపాయలను ఖర్చుపెట్టినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఈ నిధుల్లో 20 శాతాన్ని 2020-21లో కరోనా రోజుల్లో కేటాయించినట్లు తెలిపారు. ఈ పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి 20 వేల కోట్ల రూపాయిలు ఇచ్చామని చెప్పారు. నిధులు దుర్వినియోగమైనట్లు ఫిర్యాదులు వచ్చినా, ఆడిట్‌లో తేలినా సర్వే టీమ్‌లు రంగంలోకి దిగుతాయని హెచ్చరించారు. యూపీఏ హయాంలో ఈ పథకంలో ఎన్నో లోటుపాట్లు ఉండేవని, వాటిని నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక సరిచేశారని నిర్మలా సీతారామన్‌ వివరించారు.

బ్రాండ్‌ అంబాసిడర్‌గా బుమ్రా

రిలయెన్స్‌ రిటైల్‌ విక్రయిస్తున్న యాక్టివ్‌ వేర్‌ బ్రాండ్‌ పెర్ఫార్మాక్స్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఇండియన్‌ స్టార్‌ క్రికెటర్‌ జస్పీత్‌ బుమ్రా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు ఒప్పందం కుదిరినట్లు రిలయెన్స్‌ రిటైల్‌ వెల్లడించింది. ఈ బ్రాండ్‌ 330కి పైగా సిటీల్లోని వెయ్యికి పైగా స్టోర్లలో అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. రిలయెన్స్‌ రిటైల్‌ దేశవ్యాప్తంగా 20 కోట్లకు పైగా రిజిస్టర్డ్‌ కస్టమర్లను కలిగి ఉంది. యాక్టివ్‌వేర్‌ బ్రాండ్‌ పెర్ఫార్మాక్స్‌ని ఎక్స్‌క్లూజివ్‌ బ్రాండ్‌ ఔట్‌లెట్లు, రిలయెన్స్‌ రిటైల్‌ ఫ్యాషన్‌ అండ్‌ లైఫ్‌స్టయిల్‌ స్టోర్లు, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లు, మల్టీబ్రాండ్‌ ఔట్‌లెట్లలో అందుబాటులో ఉంచడం ద్వారా సేల్స్‌ని భారీగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

యాపిల్‌కి గుడ్‌న్యూస్‌

యాపిల్‌కి గుడ్‌ న్యూస్‌. అమెరికన్లు తొలిసారిగా ఆండ్రాయిడ్‌ ఫోన్ల కంటే ఐఫోన్లనే ఎక్కువగా వాడుతున్నట్లు కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ సర్వేలో తేలింది. రెండో త్రైమాసికంలో యాపిల్‌ స్మార్ట్‌ఫోన్‌ షిప్‌మెంట్ల వాటా 48 శాతంగా నమోదైంది. యాపిల్‌ ఐఫోన్‌ తొలిసారిగా 2007లో అమెరికా మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఒక దశలో బ్లాక్‌బెర్రీ, నోకియా నుంచి ఎదురైన తీవ్ర పోటీని తట్టుకొని నిలబడింది. జూన్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో గ్లోబల్‌ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో యాపిల్‌ షేరు 57 శాతానికి పెరిగింది. దీన్నిబట్టి అమెరికా బయట కూడా ఐఫోన్ల సేల్స్‌ పెరుగుతున్నాయని చెప్పొచ్చు.

Exit mobile version