Mark Zuckerberg: జుకర్‌బర్గ్ సీక్రెట్ ప్లాన్.. AIతో ఉద్యోగాల ఊచకోత.. అసలేం జరిగింది?

Mark Zuckerberg

Mark Zuckerberg

Mark Zuckerberg: మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ కంపెనీని పూర్తిగా AI ఆధారిత సంస్థగా మార్చేందుకు భారీ ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. ఇందులో భాగంగా కొన్ని విభాగాల్లో ఏకంగా 60 శాతం వరకు ఉద్యోగాలను తగ్గించి, ఆ పనులను AI ఏజెంట్లతో చేయించాలని భావించినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఈ ప్లాన్‌ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడం, AI వైఫల్యాలతో తలకిందులైనట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో హవాయిలోని జుకర్‌బర్గ్‌ నివాసంలో ఉన్నతాధికారులతో జరిగిన రహస్య సమావేశంలో ‘ప్రాజెక్ట్‌ OT’ (ఆర్గనైజేషన్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌)కు రూపకల్పన చేసినట్లు సమాచారం. మెటాను ‘AI నేటివ్‌’ కంపెనీగా మార్చడం ఈ ప్రాజెక్ట్‌ ప్రధాన లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని టీమ్‌లలో 60 శాతం వరకు ఉద్యోగాలను తగ్గించి, మిగిలిన వారితో AI ఏజెంట్లను పర్యవేక్షించాలని భావించినట్లు సమాచారం. పాత మేనేజర్‌ పోస్టులను తొలగించి ‘టెక్‌ పాడ్స్‌’ ఏర్పాటు చేసే ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లు ఈ నివేదిక వెల్లడించింది.

మౌస్‌, కీబోర్డ్‌ ట్రాకింగ్‌తో ఉద్యోగుల్లో ఆగ్రహం

మార్చిలో ఈ ప్రణాళికకు సంబంధించిన సమాచారం బయటకు రావడంతో మెటాలో కలకలం మొదలైనట్లు తెలుస్తోంది. అమెరికాలోని ఉద్యోగుల కంప్యూటర్లలో మౌస్‌ క్లిక్స్‌, కీబోర్డ్‌ కార్యకలాపాలను ట్రాక్‌ చేసే సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేయడం మరింత వివాదానికి దారితీసిందని సమాచారం. తమ స్థానాలను భర్తీ చేయబోయే AIకి తామే శిక్షణ ఇస్తున్నామంటూ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. దీంతో కంపెనీలో పని చేసే ఉద్యోగుల్లో పని చేయాలనే ఉత్సాహం గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది. మరోవైపు జుకర్‌బర్గ్‌ భారీగా ఆధారపడిన AI వ్యవస్థలు కూడా ఆశించిన స్థాయిలో పనిచేయలేదని తెలుస్తోంది. AI వినియోగంతో కోడింగ్‌ వేగం 220 శాతం పెరిగినా.. వినియోగదారులకు చేరిన కొత్త ఫీచర్లు కేవలం 36 శాతం మాత్రమే పెరిగినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. AI ఏజెంట్ల కారణంగా సాంకేతిక సమస్యలు పెరిగాయని, గత ఏడాదితో పోలిస్తే టెక్నికల్‌, సెక్యూరిటీ ఘటనలు 40 శాతం పెరిగినట్లు తెలిపింది.

చివరి నిమిషంలో భారీ ప్లాన్‌కు బ్రేక్‌
ఈ పరిణామాల నేపథ్యంలో జుకర్‌బర్గ్‌ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం. మే 19న తొలి దశ ఉద్యోగాల కోతకు కొన్ని గంటల ముందు అత్యవసర సమావేశం నిర్వహించి, నవంబర్‌లో చేపట్టాల్సిన రెండో దశ భారీ తొలగింపులను రద్దు చేసినట్లు నివేదిక పేర్కొంది. మే 20న సుమారు 10 శాతం ఉద్యోగులను మాత్రమే తొలగించినట్లు సమాచారం. ఆ తర్వాత ఈ ఏడాది మరో భారీ ఉద్యోగాల కోత ఉండదని జుకర్‌బర్గ్‌ ప్రకటించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉద్యోగుల కంప్యూటర్లపై మౌస్‌ ట్రాకింగ్‌ను నిలిపివేసినట్లు సమాచారం. అయితే AIపై భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో జుకర్‌బర్గ్‌పై పెట్టుబడిదారుల ఒత్తిడి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.