ఒక్క ఫోన్ కాల్.. ఒక ఫేక్ లింక్.. లేదా ఒక OTP తో క్షణాల్లో మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు! ఇటీవల దేశవ్యాప్తంగా UPI, ఆన్‌లైన్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ మోసాలు భారీగా పెరిగాయి. లక్షలాది మంది తమ కష్టార్జిత డబ్బును సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోతున్నారు. అయితే ఇప్పుడు అలాంటి బాధితులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI). ఆన్‌లైన్ మోసంలో డబ్బు పోయినా, కొన్ని పరిస్థితుల్లో తిరిగి పరిహారం పొందే అవకాశం కల్పించే కొత్త నిబంధనలను RBI తీసుకువచ్చింది. అసలు ఈ కొత్త రూల్ ఏమిటి? ఎవరికి వర్తిస్తుంది? ఎంత డబ్బు తిరిగి వస్తుంది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సైబర్ మోసాల బాధితులకు RBI రక్షణ
దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ మోసాలకు గురైన బ్యాంక్ ఖాతాదారులను రక్షించేందుకు RBI కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, డిజిటల్ ఫ్రాడ్ కారణంగా రూ.50,000 వరకు నష్టపోయిన బాధితులకు పరిహారం అందించే అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన బాధితులకు నష్టం మొత్తంలో 85 శాతం లేదా గరిష్టంగా రూ.25,000 వరకు పరిహారం లభించవచ్చు.
ఎవరికి ఈ ప్రయోజనం?
ఈ రూల్ కేవలం వ్యక్తిగత బ్యాంక్ ఖాతాదారులకు మాత్రమే కాదు. చిన్న వ్యాపారులు, సోల్ ప్రొప్రైటర్‌షిప్ సంస్థలు నిర్వహించే వారికి కూడా వర్తిస్తుంది. దీంతో లక్షలాది మంది డిజిటల్ బ్యాంకింగ్ వినియోగదారులకు భద్రత పెరగనుంది.
‘షాడో రివర్సల్’ అంటే ఏమిటి?
RBI తీసుకొచ్చిన మరో కీలక అంశం ‘షాడో రివర్సల్’. దీని ప్రకారం, మోసపూరిత లావాదేవీపై ఫిర్యాదు అందిన వెంటనే, విచారణ పూర్తయ్యే వరకు వివాదాస్పద మొత్తాన్ని తాత్కాలికంగా బాధితుడి ఖాతాలో జమ చేసే అవకాశం ఉంటుంది. దీంతో బాధితుడు తక్షణ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉంటాడు.
బ్యాంకు తప్పిదం అయితే పూర్తి బాధ్యత బ్యాంకుదే
మోసం బ్యాంకు భద్రతా లోపాల వల్ల జరిగితే లేదా బ్యాంకింగ్ వ్యవస్థలో వైఫల్యం ఉంటే, వినియోగదారుడికి ‘జీరో లయబిలిటీ’ వర్తిస్తుంది. అంటే నష్టం మొత్తాన్ని బ్యాంకే భరించాల్సి ఉంటుంది.
మోసం జరిగితే వెంటనే ఏం చేయాలి?
ఆన్‌లైన్ మోసానికి గురైన వెంటనే:
మీ బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి
1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి
జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలి
లావాదేవీ వివరాలు, స్క్రీన్‌షాట్లు భద్రపరచాలి. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి.
ఎప్పుడు పరిహారం రాకపోవచ్చు?
మీరు స్వయంగా OTP, PIN, CVV, పాస్‌వర్డ్ వంటి ప్రైవసీ డీటెయిల్స్ ను ఇతరులతో పంచుకుంటే లేదా మోసాన్ని ఆలస్యంగా నివేదిస్తే పరిహారం పొందే అవకాశం తగ్గిపోవచ్చు.
ఎప్పుడు అమల్లోకి వస్తుంది?
RBI తుది మార్గదర్శకాలను ప్రకటించినప్పటికీ, ఈ కొత్త వ్యవస్థ 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అప్పటి నుంచి అర్హత కలిగిన డిజిటల్ మోసాల బాధితులు ఈ ప్రొటెక్షన్ పొందొచ్చు.
డిజిటల్ యుగంలో సౌకర్యాలు పెరిగినంతగా ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. అయితే సైబర్ మోసాల బాధితులకు RBI తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు కొంత భరోసాను కల్పిస్తున్నాయి. అయినప్పటికీ, OTPలు, బ్యాంక్ వివరాలు, UPI PIN వంటి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోకుండా అప్రమత్తంగా ఉండటం ప్రతి ఒక్కరి బాధ్యత. ఒక్క నిర్లక్ష్యం మీ ఖాతాను ఖాళీ చేయవచ్చు.. కానీ ఇప్పుడు RBI కొత్త రూల్ మీకు అండగా నిలవొచ్చు!

