Rules Changes: జూన్ నెల ముగింపుకు వచ్చేసింది.. మరో నాలుగు రోజుల్లో కొత్త నెల అదే జూలై రాబోతోంది.. జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా పలు కీలక నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులు సామాన్యుల రోజువారీ జీవితంతో పాటు వారి ఖర్చులపై కూడా ప్రభావం చూపనున్నాయి. ఎల్పీజీ సిలిండర్ ధరల నుంచి క్రెడిట్ కార్డు నిబంధనలు, ఆధార్ సేవలు, విమాన ప్రయాణాలు, కార్ల ధరల వరకు మొత్తం ఐదు ప్రధాన మార్పులు అమల్లోకి రానున్నాయి.
ఎల్పీజీ సిలిండర్ ధరల మార్పు..
ప్రతి నెల మొదటి తేదీ మాదిరిగానే జూలై 1న కూడా చమురు సంస్థలు ఎల్పీజీ సిలిండర్ ధరలను సవరించనున్నాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో వాణిజ్య ఎల్పీజీ ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
ATF ధర సవరణ
ఇక, ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలను కూడా సవరించనుండటంతో విమాన టికెట్ ధరలపై ప్రభావం పడే అవకాశముంది.. అంటే.. ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు తగ్గింతే విమాన టికెట్ల ధరలు తగ్గడం అటుంచితే.. ఫ్యూయల్ ప్రైస్ పెరిగితే మాత్రం.. విమాన టికెట్ల ధరలు మరింత ప్రియం కావడం తప్పదన్నమాట..
HDFC క్రెడిట్ కార్డ్ నిబంధనలు.
HDFC బ్యాంక్ రెగాలియా గోల్డ్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు కూడా కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఉచిత దేశీయ విమానాశ్రయ లాంజ్ సదుపాయాన్ని పొందాలంటే, గత త్రైమాసికంలో కనీసం రూ.60 వేల ఖర్చు చేసిన వారికే ఈ సౌకర్యం కొనసాగుతుంది.
1వ తేదీ నుండి ఉచిత ఆధార్ అప్‌డేట్
ఆధార్ కార్డు వినియోగదారులకు మాత్రం ఊరట లభించనుంది. UIDAI నిర్ణయం ప్రకారం ఆధార్‌లో ఈమెయిల్ ఐడీని అప్‌డేట్ చేసుకునే సేవ జూలై 1 నుంచి డిసెంబర్ వరకు ఉచితంగా అందుబాటులో ఉంటుంది. గతంలో ఈ సేవకు రూ.75 రుసుము వసూలు చేసేవారు.
కారు కొనడం మరింత ఖరీదు..
ఇక కారు కొనుగోలు చేయాలనుకునే వారికి జూలై నెల నుంచి అదనపు భారం తప్పదు. కియా, టాటా మోటార్స్ వంటి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు తమ వాహనాల ధరలను 1.5 శాతం నుంచి 2 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించాయి. దీంతో జూలై నుంచి కొత్త కారు కొనుగోలు మరింత ఖరీదుగా మారనుంది.

