India’s Good News to World: ప్రపంచంలోనే ఎక్కువ చక్కెరను ఉత్పత్తి చేస్తున్న మన దేశం వచ్చే సీజన్ నుంచి అంటే ఈ ఏడాది అక్టోబర్ నుంచి రెండు విడతల్లో విదేశాలకు ఎగుమతులు చేయనుంది. ఇటు రైతులు.. అటు వినియోగదారులు.. ఇద్దరి ప్రయోజనాలనూ బ్యాలెన్స్ చేస్తూ ఎవరికీ చేదు అనుభవం ఎదురుకాకుండా ముందుచూపుతో వ్యవహరించనుంది. షుగర్ ఎక్స్‌పోర్ట్‌లపై ప్రస్తుత సీజన్‌లో కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సప్లై తగ్గి ధరలు పెరిగాయి. దీంతో వచ్చే సీజన్ నుంచి కోటాల వారీగా కేటాయింపులు చేసేందుకు సర్కారు చర్యలు చేపట్టిందని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ లిమిటెడ్ ఎండీ చెప్పారు. ఇండియా నుంచి ఎగుమతులు జరిగితే వివిధ దేశాల్లో పంచదార ధరలు తగ్గుతాయి. అంటే ఇండియా పరోక్షంగా ప్రపంచ దేశాలకు తీపి కబురు చెప్పినట్లే లెక్క.
బ్యాటరీల కోసం
బ్యాటరీలకు ప్రతి సంవత్సరం భారీగా డిమాండ్ పెరుగుతుండటంతో సెల్ తయారీ రంగంలో పెట్టుబడులు 2030 నాటికి 9 బిలియన్ డాలర్లు దాటనున్నాయని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ICRA అంచనా వేసింది. వాహన రంగంలో ఈవీల వాటా రోజురోజుకీ వృద్ధిచెందుతోందని, రానున్న రోజుల్లో వీటిదే ఆధిపత్యం కానుందని పేర్కొంది. ఈవీల్లో బ్యాటరీలే కీలకం మరియు కాస్ట్‌లీ అవటంతో ICRA ఈ భారీ అంచనాలను వెల్లడించింది. విద్యుత్ వాహనాల ఖరీదులో దాదాపు 35 నుంచి 40 శాతం వాటా అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ బ్యాటరీలదేనని ICRA సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తెలిపారు.
టార్గెట్‌కి మించి
ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ఈ ఏడాది బడ్జెట్‌లో పేర్కొన్న లక్ష్యానికి మించి జరగనున్నాయని CBDT చైర్మన్ నితిన్ గుప్తా ఆశాభావం వ్యక్తం చేశారు. ఆగస్టులో డైరెక్ట్ ట్యాక్స్‌ల రూపంలో 4.8 ట్రిలియన్ రూపాయలు వసూలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇదే ట్రెండ్ కొనసాగితే ఈ ఏడాది బడ్జెట్‌లో నిర్దేశించిన 14.2 ట్రిలియన్ రూపాయల లక్ష్యాన్ని మించి వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అన్నారు. గతేడాది ఆగస్టుతో పోల్చితే ఈసారి 33 శాతం ఎక్కువ వసూళ్లు నమోదయ్యాయని తెలిపారు.
ఏఐతో లాభాలు
2026 నాటికి కస్టమర్ కేర్ సెంటర్లతోపాటు కాంటాక్ట్ సెంటర్లలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రంగంలోకి దిగనుంది. దీంతో ఏజెంట్ ఇంటరాక్షన్ల విభాగంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రతి 10 ఇంటరాక్షన్లలో ఒకదాన్ని ఏఐ టేకప్ చేయనుంది. ఫలితంగా పలు కంపెనీలకు 80 బిలియన్ డాలర్ల విలువైన ఏజెంట్ లేబర్ ఖర్చు తగ్గనుందని రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ సంస్థ గార్ట్నర్ అంచనా వేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటీ 70 లక్షల మంది కాంటాక్ట్ సెంటర్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. వీళ్ల కోసం చేస్తున్న ఖర్చు ఈ ఏడాది సుమారు 2 బిలియన్ డాలర్లకు చేరనుంది. ఏఐ ప్రవేశంతో కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్ మెరుగుపడనుందంటున్నారు.
పాక్‌లో పగ్గాల్లేని..
పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం రికార్డ్ స్థాయిలో 47 ఏళ్ల గరిష్టానికి చేరింది. వరుసగా ఆరో నెలలో కూడా పట్టపగ్గాల్లేకుండా పెరిగింది. భారీ వరదల నేపథ్యంలో నిత్యవసరాల ధరలు నింగినంటుతున్నాయి. గతేడాది ఆగస్టుతో పోల్చితే ఈసారి 27 శాతానికి పైగా ప్రియమైనట్లు ప్రభుత్వం విడుదల చేసిన డేటా వెల్లడించింది. సరుకుల రేట్లు 26 శాతం పెరుగుతాయని బ్లూమ్‌బర్గ్ సర్వే, 24 శాతం పెరుగుతాయని మీడియా పేర్కొనగా ఆ అంచనాలన్నీ మించి పెరిగాయి. పాకిస్థాన్‌లో 1975 తర్వాత ఈ స్థాయిలో ద్రవ్యోల్బణం పెరగటం ఇదే తొలిసారి.
మరింత బొగ్గు
జార్ఖండ్‌లో వచ్చే ఏడాది మార్చి నాటికి కొత్త రైల్వే లైన్ నిర్మాణం పూర్తికానుంది. దీంతో మరో 125 మిలియన్ టన్నుల బొగ్గు తరలింపు సామర్థ్యం పెరగనుంది. ఫలితంగా రోడ్డు మార్గంలో పొడి బొగ్గు రవాణా తగ్గనుంది. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా చేపట్టిన టోరి-శివ్‌పూర్-కథౌటియా రైల్వే లైన్ పనులు పూర్తికావొస్తున్నాయి. ఈ రైల్వే లైన్ జార్ఖండ్‌లోని నార్త్ కరన్‌పురా కోల్ ఫీల్డ్‌ని లింక్ చేస్తుంది. ఈ కోల్ ఫీల్డ్ కోలిండియాకి చెందిన సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ పరిధిలోకి వస్తుంది. ఈ గనుల్లో 19 బిలియన్ టన్నుల సహజ సంపద దాగి ఉంది.
