Site icon NTV Telugu

Indian Rupee: వాణిజ్య డీల్ ఎఫెక్ట్.. రూపాయికి మంచి రోజులు!

Indian Rupee

Indian Rupee

Indian Rupee: భారత రూపాయికి ఇప్పుడు మంచి రోజులు రానున్నాయి. మంగళవారం మార్కెట్ ప్రారంభంలోనే రూపాయి బలంగా ముందుకు రావచ్చని ఆర్థిక వర్గాలు భావిస్తున్నాయి. భారత్–అమెరికా మధ్య కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందం దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ ఒప్పందం వల్ల మళ్లీ విదేశీ పెట్టుబడులు భారత్ వైపు రావచ్చన్న అంచనాలు భారీగా పెరిగాయి. అదే సమయంలో రూపాయిపై గత కొంతకాలంగా ఉన్న ఒత్తిడి కూడా తగ్గే అవకాశం కనిపిస్తోంది. సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 91.51 వద్ద ఉంది. కానీ ఒక నెల నాన్-డెలివరీ ఫార్వర్డ్ లెక్కల ప్రకారం.. మంగళవారం రూపాయి 90.15 నుంచి 90.25 మధ్య స్థాయిలోనే ట్రేడింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. అంటే ఒక్కరోజులోనే రూపాయి గణనీయంగా బలపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

READ MORE: HCA New President: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ కొత్త అధ్యక్షుడి నియామకం.. ఎవరంటే..?

తాజాగా ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ ఒప్పందంతో భారత్‌పై ఉన్న భారీ పన్నుల వ్యవస్థ దాదాపుగా తొలగిపోయినట్లైంది. ఒక దశలో భారత ఉత్పత్తులపై అమెరికా విధించిన పన్ను 50 శాతానికి చేరింది. అది ఆసియాలోనే అత్యధికం. ఇప్పుడు రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు సంబంధించిన శిక్ష పన్నును తీసేయడంతో పాటు, పరస్పర పన్నులను కూడా తగ్గించి 18 శాతానికి పరిమితం చేశారు. దీంతో విదేశీ పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరుగుతోంది. 2025లో భారత్ నుంచి భారీగా పెట్టుబడులు బయటకు వెళ్లాయి. ఈ కారణంగా రూపాయి మీద ఎప్పటికప్పుడు ఒత్తిడి కొనసాగింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారవచ్చని నిపుణులు చెబుతున్నారు. సింగపూర్‌లోని లూసెర్న్ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థలో పెట్టుబడుల విభాగం అధిపతి మార్క్ వెలాన్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందం వల్ల భారత్‌పై ఉన్న విధానపరమైన అనిశ్చితి తగ్గిందన్నారు. దీని ప్రభావంతో తక్కువ కాలంలోనే రూపాయి, స్టాక్ మార్కెట్లు బలపడే అవకాశం ఉందని చెప్పారు. మరోవైపు.. అనుకున్న విధంగానే ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్లు దూసుకుపోతున్నాయి.

READ MORE: Deputy CM Pawan Kalyan: అధిక ధరలకు మద్యం విక్రయాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సీరియస్

Exit mobile version