Railway Group Ticket Booking: రైలులో కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో కలిసి ప్రయాణించాలనుకునే వారికి భారతీయ రైల్వే నుంచి శుభవార్త. ముఖ్యంగా పెళ్లిళ్లు, తీర్థయాత్రలు, విద్యా విహారయాత్రలు, క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల కోసం పెద్ద సంఖ్యలో ఒకేసారి ప్రయాణించే వారికి దక్షిణ పశ్చిమ రైల్వే (South Western Railway – SWR) కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్, బల్క్ టికెట్ బుకింగ్‌కు సంబంధించి గతంలో ఉన్న సీట్ల గరిష్ఠ పరిమితిని తొలగించింది. ఈ మేరకు కొత్త నిబంధనలతో అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నిర్ణయంతో ఇకపై పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఒకేసారి రిజర్వేషన్ చేసుకునేందుకు అవకాశం కలగనుంది. అయితే, ఇందుకు రైల్వే విధించిన కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.
ఇప్పటివరకు గ్రూప్ లేదా బల్క్ టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ప్రయాణికుల సంఖ్య, బెర్త్‌లకు సంబంధించి కొన్ని పరిమితులు ఉండేవి. తాజాగా దక్షిణ పశ్చిమ రైల్వే ఈ గరిష్ఠ పరిమితులను తొలగించింది. దీంతో ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రయాణికులకు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సదుపాయం అన్ని తరగతుల రిజర్వేషన్లకు వర్తిస్తుంది. కన్ఫర్మ్ టికెట్లు, RAC, వెయిటింగ్ లిస్ట్ టికెట్లకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. అయితే, బుకింగ్ పరిమితి తొలగించారంటే అందరికీ కన్ఫర్మ్ బెర్తులు లభిస్తాయని కాదు. రైలులో అందుబాటులో ఉన్న సీట్లు, బెర్తులు, రైల్వే రిజర్వేషన్ నిబంధనల ఆధారంగానే టికెట్లు కేటాయిస్తారు.
కొత్త నిబంధనల ప్రకారం గ్రూప్ టికెట్ బుకింగ్ సదుపాయం ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ సదుపాయం ప్రధాన రైల్వే స్టేషన్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ARP) ప్రకారం ప్రయాణ తేదీకి 60 రోజుల ముందు ఉదయం 8 గంటల నుంచి సాధారణ టికెట్ బుకింగ్ ప్రారంభమవుతుంది. అయితే గ్రూప్, బల్క్ రిజర్వేషన్ కోసం ఉదయం 9 గంటల నుంచి సంబంధిత అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. మీరు 60 రోజుల తర్వాత ప్రయాణం చేయాలనుకుంటే సాధారణ రిజర్వేషన్ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. గ్రూప్ బుకింగ్ కోసం మాత్రం ఉదయం 9 గంటల నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
కొత్త నిబంధనల ప్రకారం బల్క్ రిజర్వేషన్‌కు అనుమతి ఇచ్చే అధికారాలను చీఫ్ రిజర్వేషన్ సూపర్‌వైజర్ (CRS), స్టేషన్ మేనేజర్ (SM)లకు అప్పగించారు. గతంలో బల్క్ టికెట్ బుకింగ్‌కు సంబంధించి కొన్ని పరిమితులు, అధికారాల పరిధి ఉండేది. ఇప్పుడు వాటిని తొలగించి సంబంధిత అధికారులకు అనుమతి ఇచ్చే బాధ్యతను అప్పగించారు. దీంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఒకేసారి టికెట్లు బుక్ చేసుకోవడానికి మరింత సులభతరం కానుంది.
దక్షిణ పశ్చిమ రైల్వే ప్రకారం నిజమైన అవసరాల కోసం గ్రూప్‌గా ప్రయాణించే వారికి ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
పెళ్లిళ్లు, శుభకార్యాలకు వెళ్లే కుటుంబ సభ్యులు, బంధువులు.
పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల విద్యా విహారయాత్రలు.
తీర్థయాత్రలకు వెళ్లే భక్తులు.
క్రీడా పోటీల్లో పాల్గొనే జట్లు.
సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్లే బృందాలు.
ఇతర సామూహిక కార్యక్రమాల కోసం ప్రయాణించే గ్రూపులు.
ఈ సదుపాయం అన్ని తరగతుల రిజర్వేషన్లకు వర్తిస్తుంది.
బల్క్ టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే వారు ప్రయాణ ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేయాలి. ప్రయాణానికి సరైన కారణం వెల్లడించకపోతే రైల్వే అధికారులు బల్క్ బుకింగ్‌కు అనుమతి ఇవ్వరు. అలాగే గ్రూపులో ప్రయాణించే ప్రతి ఒక్కరి వివరాలను సమర్పించాలి.
ప్రయాణికుడి పూర్తి పేరు.
వయస్సు.
లింగం (జెండర్).
చిరునామా.
ప్రయాణ ఉద్దేశం.
ఈ వివరాలను పరిశీలించిన తర్వాత సంబంధిత రైల్వే అధికారులు నిబంధనల ప్రకారం బల్క్ రిజర్వేషన్‌కు అనుమతి ఇస్తారు. పెద్ద సంఖ్యలో టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే ప్రయాణికులు ట్రావెల్ ఏజెంట్లను సంప్రదించకుండా నేరుగా సంబంధిత రైల్వే అధికారులను సంప్రదించాలని దక్షిణ పశ్చిమ రైల్వే సూచించింది. అయితే విదేశీ పర్యాటకులు, ఎన్నారై (NRI) ప్రయాణికుల విషయంలో ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుకింగ్ చేసుకునే వెసులుబాటు కొనసాగుతుంది.

