Indian Currency Look: ప్రస్తుతం మన కరెన్సీ నోట్ల పైన ఒక వైపు జాతిపిత మహాత్మాగాంధీ బొమ్మ, మరోవైపు చారిత్రక కట్టడాల బొమ్మలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ నోట్ల లుక్ భవిష్యత్‌లో మారనుందా అనే చర్చ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొదలైంది. డబ్బు, సంపద, శాంతి, శ్రేయస్సు, అదృష్టాలకు ప్రతిరూపంగా పూజించే లక్ష్మీదేవితోపాటు కళలకు, శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా భావించే గణేషుడి బొమ్మలు వస్తాయా అని ప్రజలు అనుకుంటున్నారు.
Indian Musical Instruments Exports: భారతీయ సంగీతంపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ
భారతదేశ సౌభాగ్యం దృష్ట్యా కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, గణేషుడి బొమ్మలు పెట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరటమే ఈ చర్చకు దారితీసింది. అర్వింద్ కేజ్రీవాల్ వెటకారంగా చేసిన ఈ సూచనను బీజేపీ సహా ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. అయితే.. బ్యాంక్ నోట్లు, నాణేల డిజైన్‌లో గానీ రూపంలో గానీ ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని సెంట్రల్ బోర్డ్‌తోపాటు కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేయాల్సి ఉంటుందనే సంగతి తెలిసిందే.
దీని గురించి మరింత స్పష్టంగా చెప్పుకోవాలంటే.. కరెన్సీలో మార్పులను ఆర్బీఐ సెంట్రల్ బోర్డు, నాణేల్లో మార్పులను కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేస్తాయి. నాణేల చెలామణీ మాత్రమే ఆర్బీఐ పరిధిలో ఉంటుంది. వాటిని డిజైన్ చేయాలన్నా, వివిధ డినామినేషన్లలో మింటింగ్ చేయాలన్నా ఆ అధికారం ప్రభుత్వానికే ఉంటుంది. కాయినేజ్ యాక్ట్-2011 ఈ అధికారాన్ని గవర్నమెంట్‌కి దఖలుపరచింది. మరోవైపు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్‌లోని సెక్షన్ 22 ప్రకారం మన దేశంలో బ్యాంక్ నోట్లను జారీ చేయాలంటే అది ఆర్బీఐ సెంట్రల్ బోర్డు పరిధిలోకే వస్తుంది.
ఈ చట్టంలోని సెక్షన్ 25 ప్రకారం బ్యాంక్ నోట్ల డిజైన్, ఫామ్, మెటీరియల్ వంటి వాటికి మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలి. ఈ మేరకు ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ రికమండేషన్లను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రబి శంకర్ ప్రస్తుతం డిపార్ట్‌మెంట్ ఆఫ్ కరెన్సీ మేనేజ్‌మెంట్‌కి హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. నగదు నిర్వహణకు సంబంధించిన పూర్తి బాధ్యత ఆయనే వహిస్తున్నారు. కరెన్సీ నోట్లకు సంబంధించిన మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ఈ విభాగమే నిర్ణయం తీసుకొని ఆర్బీఐకి రికమండ్ చేస్తుంది. అక్కడి నుంచి ప్రభుత్వానికి సమాచారం చేరుతుంది.