NTV Telugu Site icon

Tesla: భారత్‌తో టెస్లా ఒప్పందం.. ఈవీల దిగుమతి, త్వరలో ప్లాంట్..

Musk, Pm Modi

Musk, Pm Modi

Tesla: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ, ఎలాన్ మస్క్‌కి చెందిన ‘టెస్లా’ భారతదేశంలో అడుగుపెట్టేందుకు చాలా కాలంగా ఎదురుచూస్తోంది. అయితే దీనిపై టెస్లా ప్రతినిధులు, భారత ప్రభుత్వంతో చాలా సార్లు చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో చర్చలు తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి భారత్ లోకి టెస్లా తన కార్లను దిగుమతి చేయబోతుందని తెలస్తోంది. మరో రెండేళ్లతో ఇక్కడ టెస్లా తన ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

జనవరిలో జరిగే వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌లో దీనిపై ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ప్లాంట్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో ఈవీ వాహనాల తయారీ, ఎగుమతులకు సంబంధించిన ఎకోసిస్టమ్ కలిగి ఉన్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

టెస్లా ఏదైనా ప్లాంట్‌లో దాదాపుగా 2 బిలియన్ల ప్రారంభ కనీస పెట్టుబడిని పెడుతుందని, దేశం నుంచి ఆటో విడిభాగాలు కనుగోళ్లకు సంబంధించి 15 బిలియన్లకు పెంచుతుందని తెలుస్తోంది. ఖర్చులను తగ్గించుకోవడానికి భారతదేశంలోనే బ్యాటరీలను తయారు చేయాలనే ప్లాన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జమ్మూ కాశ్మీర్ లోని రియాసీ జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద లిథియం నిల్వలు బయటపడ్డాయి. ప్రస్తుతం మొబైల్స్, ఈవీ వాహనాల్లో వాడుతున్న బ్యాటరీలన్నీ లిథియం ద్వారానే తయారవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడే బ్యాటరీలను తయారు చేయాలనే ఉద్దేశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: Harish Rao: కాంగ్రెస్‌కు ఓటేసి ఆగం కావోద్దు

టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ జూన్ నెలలో మాట్లాడుతూ.. టెస్లా భారత్ తో గణనీయమైన పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్టు తెలిపారు. 2024లో భారత పర్యటనకు రావాలనుకున్నట్లు కూడా చెప్పారు. ప్రస్తుతం ఒప్పందంపై ఇటు భారత ప్రభుత్వం కానీ, అటు టెస్లా కానీ స్పందించలేదు. మధ్యతరగతి వర్గం ఎక్కువ కలిగిన భారత్ ఇటీవల కాలంలో ఈవీ మార్కెట్‌లో దూసుకెళ్తోంది. ముఖ్యంగా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో, ఇది అమెరికన్ కంపెనీ టెస్లాకు వరంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం టెస్లాకు అమెరికా, చైనా, జర్మనీల్లో ప్లాంట్లు ఉన్నాయి.

చైనాలో తయారవుతున్న టెస్లా కార్లను ఇండియాలోకి తీసుకురావడానికి భారత ప్రభుత్వ ఒప్పుకోలేదు. అధిక పన్నుల కారణంగా భారత్ టెస్లా కార్లను దిగుమతి చేసుకోలేదు. గతంలో టెస్లా సీఈఓ మస్క్ భారత్ లో అధిక పన్నుల గురించి విమర్శించారు. ఈ నెల ప్రారంభంలో కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్‌లోని టెస్లా ప్లాంట్‌ను సందర్శించిన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, సెప్టెంబర్‌లో టెస్లా ఈ ఏడాది భారతదేశం నుండి దాదాపు రెట్టింపు ఆటో విడిభాగాల కొనుగోళ్లను 1.9 బిలియన్ల డాలర్లకు పెంచాలని యోచిస్తోందని చెప్పారు.