Solar Manufacturing: సోలార్ పవర్‌లో ప్రపంచంలోనే నెంబర్ 1 అవ్వడానికి భారత్ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు సోలార్ పవర్‌ని ప్రోత్సహిస్తోంది. ఇదెలా ఉంటే, చైనాపై ఆధారపడటాన్ని తగ్గించి, ప్రపంచ ఇంధన పరివర్తన నుంచి ప్రయోజనం ప్లాన్‌లో భాగంగా భారత్ తన సౌర తయారీ పరిశ్రమను బలోపేతం చేయాలని భావిస్తోంది. ఏకంగా 1 బిలియన్ డాలర్ల మూలధన సబ్సిడీ ప్రణాళికను ఖరారు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం తెలిసిన వ్యక్తులు తెలిపారు.
ఈ ప్రతిపాదనని పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ రూపొందిస్తున్నట్లు సమాచారం. దేశంలో సౌర పరిశ్రమలో అత్యంత బలహీనమైన విభాగాల్లో ఒకటైన వేఫర్లు, ఇంటోట్స్ దేశీయ తయారీని పెంపొందించే టార్గెట్‌ని పెట్టుకున్నట్లు తెలిసింది. ఈ ప్రణాళికకు ప్రధాని నరేంద్రమోడీ కార్యాలయంతో పాటు అగ్ర సలహాదారుల మద్దతు ఉందని, రాబోయే కొన్ని నెలల్లో ఆమోదం కోసం క్యాబినెట్ ముందుకు రాబోతున్నట్లు అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. అయితే, దీనిపై సంబంధిత మంత్రిత్వ శాఖ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు.
భారత్, సౌర పరికరాల దిగుమతి కోసం చైనాపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఇది దేశ ఇంధన భద్రతకు ప్రమాదం. భారత్ తన దేశీయ మాడ్యుల్స్, సెల్ మేకింగ్ విభాగాలను పెంచుకున్నప్పటికీ, వేఫర్లు, ఇంగోట్స్ తయారీ ఇప్పటికీ కేవలం 2 గిగా వాట్ల సామర్థ్యంతో ఉంది. దీనిని అదానీ ఎంటర్‌ప్రెజెస్ లిమిటెడ్ నిర్మించింది. బ్లూమ్‌బెర్గ్‌ఎన్‌ఇఎఫ్ ప్రకారం, భారతదేశంలో 71 గిగావాట్ల మాడ్యూల్స్ , దాదాపు 11 గిగావాట్ల సెల్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ఇండియాలో మొబైల్ ఫోన్ తయారీ పరిశ్రమకు ఇచ్చిన సబ్సీడీ ఇవ్వడం సూపర్ సక్సెస్ అయింది. దీని లాగే కొత్తగా ప్రతిపాదిస్తున్న సోలార్ మాన్యుఫాక్చరింగ్ సబ్సీడీ కూడా హిట్ అవుతుందని భావిస్తున్నారు. ఆపిల్ వంటి కంపెనీలను ఆకర్షించడానికి మోడీ ప్రభుత్వం బిలియన్ డాలర్ల ప్రోత్సహకాలను ప్రకటించింది. సామ్‌సంగ్ కూడా భారత్‌లో తయారీ యూనిట్‌ని పెట్టింది. ఈ ప్రోత్సకాల ఫలితంగా ఇండియా నుంచి ఆపిల్ ఫోన్ ఎగుమతులు బాగా పెరిగాయి.
సౌర పరిశ్రమ రంగంలో లాజిస్టిక్స్, నాణ్యత నియంత్రణలు వేఫర్లు, ఇంగోట్స్ తయారీకి అధిక ఖర్చులకు కారణమవుతాయి. సబ్సిడీలు వీటిని తగ్గించడానికి దోహదపడుతాయి. ఒక వేళ భారత్ వేఫర్, ఇంగోట్ సామర్థ్యాన్ని పెంచుకున్నప్పటికీ, ముడిపదార్థమైన పాలీసిలికాన్ కోసం విదేశాలపైనే ఆధారాపడాల్సి ఉంది. బ్లూమ్‌బెర్గ్ ఎన్‌ఈఎఫ్ డేటా ప్రకారం.. అల్ట్రా-రిఫైన్డ్ మెటీరియల్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం భారతదేశానికి లేదు. ఈ విషయంలో చైనా ప్రపంచంలో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఏడాదికి 2.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో చైనా మొదటిస్థానంలో ఉంది. 75,000 టన్నుల సామర్థ్యంతో జర్మనీ రెండో స్థానంలో ఉంది.