Hyundai-Kia: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(EV)ల వాడకం పెరుగుతోంది. టూవీలర్స్, కార్‌లతో ఈవీలను కొనుగోలు చేయడానికి భారత వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలు కార్ల తయారీ సంస్థలు భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈవీ కార్లను రూపొందిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈవీల వాడకం ఎక్కువగా పెరుగే నేపథ్యంలో కంపెనీలు కూడా అందుకు తగ్గట్టుగా వ్యవహరిస్తున్నాయి.
తాజాగా దక్షిణ కొరియా ఆటోమేకర్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ కంపెనీ, కియా కార్పొరేషన్‌లు భారత బ్యాటరీ తయారీ దిగ్గజ సంస్థ అయిన ఎక్సైడ్ ఎనర్జీతో భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. తమ ఎలక్ట్రిక్ వాహనాల(EV)ల విస్తరణ ప్రణాళికలో భాగంగా ఎక్సైడ్ ఎనర్జీతో అవగాహన ఒప్పందం( MOU) కుదుర్చుకున్నాయని హ్యుందాయ్ మోటార్ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది.
Read Also:Eknath Shinde: ఉద్ధవ్ ఠాక్రే మమ్మల్ని ‘‘ఇంటి పనివారి’’గా చూశాడు.. ఇదే శివసేన చీలికకు కారణం..
భారత్ లోనే EV బ్యాటరీ ఉత్పత్తిని ఈ కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రత్యేకంగా లిథియం-ఐరన్-ఫాస్పేట్(LFP) బ్యాటరీలపై దృష్టిసారించాయి. ఈ చర్య ద్వారా భారతీయ మార్కెట్లో తమ రాబోయే ఈవీ వాహనాలకు దేశీయంగా తయారు చేయబడిన బ్యాటరీలను వర్తింపచేయడంతో అగ్రగామిగా నిలుస్తామని హ్యుందాయ్-కియా సంస్థలు తెలిపాయి. భారత ప్రభుత్వ కార్బన్ న్యూట్రాలిటీ కారణంగా రాబోయే రోజుల్లో విద్యుదీకరణ వాహన రంగానికి భారత్ కీలకమైన మార్కెట్‌గా ఉందని, స్వదేశంలో బ్యాటరీల ఉత్పత్తి ద్వారా పోటీతత్వం పెరగడంతో పాటు ఖర్చులను తగ్గించవచ్చని హ్యుందాయ్ మోటార్ మరియు కియా యొక్క R&D విభాగం ప్రెసిడెంట్ మరియు హెడ్ హేయు వాన్ యాంగ్ అన్నారు.
హ్యుందాయ్ మోటార్స్ ఇండియా తన ఈవీ మోడల్ కార్లను 2025లో ఎక్కువ సంఖ్యలో విడుదల చేయాలని భావిస్తోంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి కోనా ఎలక్ట్రిక్, ఐయానిక్ 5 వంటి ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. మరోవైపు కియా తన ఈవీ6 మోడల్‌ని విక్రయిస్తోంది. ఇక ఎక్సైడ్ ఎనర్జీ విషయానికి వస్తే, భారత్‌లో గత 75 ఏళ్లుగా లెడ్-యాసిడ్ బ్యాటరీ తయారీలో అనుభవం ఉంది. తాజా భాగస్వామ్యంతో లిథియం అయాన్ బ్యాటరీలోకి అడుగుపెడుతోంది.