FSSAI: మందు బాబులకు బిగ్ అలర్ట్.. ఈ విస్కీ, రమ్ బాటిళ్లు ఇక దొరకవా?

Fssai

Fssai

FSSAI: దేశ ఆహార భద్రతా నియంత్రణ సంస్థ అయిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) తాజాగా కొన్ని చర్యలో భాగంగా దేశంలో అమ్ముతున్న కొన్ని అత్యంత ప్రజాదరణ పొందిన విస్కీ, రమ్ బ్రాండ్‌ల యొక్క ఎంపిక చేసిన కొన్ని రకాల అమ్మకాలను తక్షణమే నిషేధించింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. డియాజియో ఇండియాకు చెందిన యునైటెడ్ స్పిరిట్స్, ఇన్‌బ్రూ బెవరేజెస్, మోహన్ రాకీ స్ప్రింగ్‌వాటర్ తయారు చేసిన మద్యంపై ఈ చర్యలు తీసుకున్నారు. నియంత్రణ సంస్థ దర్యాప్తులో ఈ కంపెనీలు.. సహజమైన రుచిని కలిగి, దీర్ఘకాలిక నిల్వ (ఏజింగ్ ప్రాసెస్) ద్వారా రావాల్సిన పానీయాలలో కృత్రిమ రుచులను కలుపుతున్నాయని వెల్లడైందని చెబుతున్నారు. అందుకే వాటిపై తక్షణం నిషేధం విధించినట్లు తెలిపారు.

వాస్తవానికి మంచి మద్యం అనేది దాని నాణ్యత, దానికి ఉపయోగించిన ముడి పదార్థాలు, నిల్వ సామర్థ్యం ద్వారా గుర్తిస్తారు. అయితే కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తులకు రమ్ లాంటి రుచిని ఇవ్వడానికి “రమ్ ఫ్లేవర్”ను, విస్కీకి “విస్కీ ఫ్లేవర్”ను కలుపుతున్నట్లు FSSAI తాజాగా నిర్వహించిన పరీక్షలలో వెల్లడైంది. ఆదివారం రాత్రి ఆలస్యంగా జారీ చేసిన ఒక ప్రకటనలో.. రమ్‌కు కృత్రిమ రమ్ ఫ్లేవరింగ్‌ను జోడించడానికి అనుమతించే అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన మద్యం తయారీ ప్రక్రియ ఏదీ జరగలేదని FSSAI స్పష్టం చేసింది. అలా చేయడం అనేది ఉత్పత్తి ప్రమాణాలను నేరుగా ఉల్లంఘించడమే అని చెప్పింది. ఈ కఠినమైన నిర్ణయం పలు ప్రఖ్యాత కంపెనీల ఉత్పత్తులపై ప్రభావం చూపింది. పలు నివేదికల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని యునైటెడ్ స్పిరిట్స్ ఉత్పత్తి చేసే ‘యాంటిక్విటీ బ్లూ విస్కీ’, ‘రాయల్ ఛాలెంజ్ విస్కీ’లపై ఈ నిషేధం వర్తిస్తుంది. అదే రాష్ట్రంలో ఇన్‌బ్రూ బెవరేజెస్ ఉత్పత్తి చేసే ‘బాగ్ పైపర్ డీలక్స్ విస్కీ’, ‘ఓల్డ్ కాస్క్ డీలక్స్ XXX రమ్’ అమ్మకాలను కూడా నిలిపివేశారు.

అంతేకాకుండా మహారాష్ట్రలోని మోహన్ రాకీ స్ప్రింగ్‌వాటర్ ఉత్పత్తి చేసే, దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘ఓల్డ్ మాంక్’ రమ్‌కు చెందిన మూడు వేర్వేరు రకాలను కూడా ఈ నిషేధంలో చేర్చారు. ఈ నిషేధం కేవలం ఈ నిర్దిష్ట ఫ్యాక్టరీలలో ఉత్పత్తి అయ్యే మద్యంపై మాత్రమే వర్తిస్తుందా లేక దేశవ్యాప్తంగా ఉన్న ఇతర యూనిట్లను కూడా ప్రభావితం చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. FSSAI నిబంధనల ప్రకారం.. మద్యం తయారీలో సహజమైన రుచిని పెంచే పదార్థాలు మాత్రమే అనుమతించబడతాయి. అయితే తాజాగా దర్యాప్తులో దీనికి విరుద్ధంగా కృత్రిమంగా తయారు చేసిన రసాయనాలను పలు బ్యాండ్రలలో మద్యం ఉత్పత్తుల్లో FSSAI ఉన్నట్లు గుర్తించింది. FSSAI ఈ ఉత్పత్తులన్నింటినీ “నాసిరకం”గా ప్రకటించింది. ఆహార, పానీయాల రంగంపై FSSAI పెంచుతున్న కఠిన చర్యలలో ఈ చర్య ఒక భాగం అని విశేషకులు చెబుతున్నారు. ఇటీవల పెప్సీ, రెడ్ బుల్ వంటి ప్రధాన కంపెనీలు తమ అధిక కెఫిన్ పానీయాలను “ఎనర్జీ డ్రింక్స్”గా మార్కెటింగ్ చేయడాన్ని ఆపాలని కూడా FSSAI ఆదేశించిన సంగతి తెలిసిందే.