Site icon NTV Telugu

Rules Changed: సామాన్యులకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు

October 1st

October 1st

అమ్మో ఒకటో తారీఖు.. ఇది సినిమా పేరు కాదండి. నిజంగానే ఒకటో తారీఖు వచ్చిందంటే సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. అలా శాలరీ క్రెడిట్ కాగానే ఇలా డబ్బులన్నీ అయిపోతాయి. ఉద్యోగులకే కాదు సామాన్యులందరికీ ఒకటో తారీఖు అంటే ఓ రకమైన ఫీలింగ్. అయితే అక్టోబర్ 1వ తేదీ సామాన్యుల జీవితాల్లో మరింత పెనుభారం కాబోతోంది. ఎందుకంటే అక్టోబర్ 1 నుంచి పలు నిబంధనలు మారనున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ సిస్టమ్‌లో నిబంధనలు, ఎల్‌పీజీ గ్యాస్ రేట్లు వంటి అనేక అంశాలు మారనున్నాయి.

ఈఎంఐ ధరలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ సమీక్ష సమావేశం ఈనెలాఖరులో జరగనుంది. సెప్టెంబర్ 30న జరిగే ఈ సమావేశంలో ఆర్‌బీఐ వడ్డీరేట్లను ప్రకటించనుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ రెపో వడ్డీ రేటును పెంచే అవకాశం ఉంది. దీంతో అక్టోబర్ 1 నుంచి లోన్‌లపై ఈఎంఐల భారం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గ్యాస్ ధరలు
అటు ప్రతినెల ఒకటో తేదీ ఎల్పీజీ గ్యాస్ రేట్లు పెరగడం లేదా తగ్గడం జరుగుతున్నాయి. అయితే రూపాయి పతనం అయిన నేపథ్యంలో అక్టోబర్ 1న మరోసారి గ్యాస్ ధరలు పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

అటల్ పెన్షన్ యోజన
అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టేవారు రూ. 5వేల వరకు నెలవారీ పెన్షన్ పొందుతారు. 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల ఎవరైనా ఈ ప్రభుత్వ పథకాన్ని పొందవచ్చు. కానీ అక్టోబర్ 1 నుంచి ఈ ప్లాన్‌లో మార్పు రానుంది. కొత్త నిబంధనల ప్రకారం ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఈ పథకం ప్రయోజనం పొందరు. మీరు పన్ను చెల్లింపుదారులైతే ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి మీకు సెప్టెంబర్ 30 వరకే సమయం ఉంది.

కార్డు టోకనైజేషన్ నియమాలు
సైబర్ మోసాలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అక్టోబర్ నుంచి భారీ మార్పులను తీసుకురానుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వినియోగదారుల కోసం కార్డ్ ఆన్ ఫైల్ టోకనైజేషన్ నియమాలను ఆర్‌బీఐ అమలు చేస్తోంది. గతంలో ఈ నిబంధనను జనవరి 1, 2022 నుండి అమలు చేయాల్సి ఉంది. అయితే ఆర్‌బీఐ ఈ గడువును జూన్ 30 వరకు పొడిగించింది. ఆ తర్వాత అక్టోబర్ 1, 2022 నుంచి ఈ నిబంధనను అమలు చేయనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది.

డీమ్యాట్ ఖాతా
షేర్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయడానికి డీమ్యాట్ ఖాతా అవసరం. దీని ద్వారా స్టాక్ మార్కెట్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడతారు. కానీ ప్రస్తుతం డీమ్యాట్ ఖాతాదారులకు రెండు రకాల ప్రమాణీకరణ అవసరం. సెప్టెంబర్ 30లోగా మీ డీమ్యాట్ ఖాతాలో టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆప్షన్‌ ఎనేబుల్ చేయాలి. లేకపోతే మీ డీమ్యాట్ ఖాతాను తెరవలేరు.

రెస్టారెంట్ యజమానులపై భారం
ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు గత ఏడాది అక్టోబర్ 1 నుండి నగదు రసీదులపై FSSAI లైసెన్స్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్‌ను పేర్కొనాలి. FSSAI ఆర్డర్ ప్రకారం, లైసెన్సింగ్, రిజిస్ట్రేషన్ అధికారులు ఈ పాలసీకి విస్తృత ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Exit mobile version