Elon Musk-Twitter Deal Details: ఎలాన్ మస్క్ ఎట్టకేలకు ట్వి్ట్టర్‌ను కొనుగోలు చేయటం వారం పది రోజుల నుంచి ప్రపంచం మొత్తం పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఆ సామాజిక మాధ్యమాన్ని తాను డబ్బు సంపాదన కోసం సొంతం చేసుకోలేదని కొత్త యజమాని చెప్పటం కొంత ఆశ్చర్యకరంగానే అనిపించింది. ఎందుకంటే.. ట్విట్టర్‌ను తన వ్యాపార సామ్రాజ్యంలో కలుపుకునేందుకు ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్లు చెల్లించారు. అంత ఖర్చు పెట్టిన వ్యక్తి దాన్నుంచి ఆదాయాన్ని రాబట్టుకోవటంపై ఫోకస్ పెట్టరంటే ఎవరూ నమ్మరు. అదే సమయంలో అసలు ఎలాన్ మస్క్‌కి అంత మనీ ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. దానికి సమాధానమే ఈ స్టోరీ.
ఫోర్బ్స్ మేగజైన్ లెక్కల ప్రకారం ఎలాన్ మస్క్ మొత్తం సంపద విలువ దాదాపు 220 బిలియన్ డాలర్లు. అందులో నుంచి కేవలం 44 బిలియన్ డాలర్లను ట్వి్టర్ కోసం చెల్లించటం ఆయనకు పెద్ద కష్టం కాదు. కానీ.. ఆ మొత్తం అమౌంట్‌ను ఎలాన్ మస్క్ ఒక్కడే ఇవ్వలేదు. కొంత మంది షేర్ హోల్డర్లతో కలిసి డీల్ పూర్తి చేశాడు. ఈ షేర్ హోల్డర్లలో బ్యాంకులు, ఈక్విటీ ఇన్వెస్టర్లు ఉన్నారు. సౌదీ యువరాజు అల్వలీద్ బిన్ తలాల్ మరియు ట్విట్టర్ కోఫౌండర్ జాక్ డోర్సెతోపాటు ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ కూడా ఉన్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్స్ చెబుతున్నాయి.
read more: L & T Company: ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్
మొత్తం 44 బిలియన్ డాలర్లలో ఎలాన్ మస్క్ సొంత ఫండ్స్ 15 బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో అధిక భాగం.. అంటే.. 12 పాయింట్ 5 బిలియన్ డాలర్లను రుణాల రూపంలో సమకూర్చారు. తన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లాలోని షేర్లను హామీగా చూపి ఈ లోన్లు తీసుకున్నారు. అంతేతప్ప ఆ వాటాలను అమ్మేయాలని ఆయన అనుకోలేదు. నిజానికి ఎలాన్ మస్క్ ఈ లావాదేవీలో ఇంత కన్నా ఎక్కువ పర్సనల్ మనీ పెట్టొద్దని మొదట్లో భావించారు. కానీ.. కుదరలేదు.
ఈ ఒప్పందం కోసం లోన్లు తీసుకోకూడదని తొలుత నిర్ణయించుకున్న ఎలాన్ మస్క్.. ఏప్రిల్, ఆగస్ట్ నెలల్లో 15 పాయింట్ 5 బిలియన్ డాలర్ల విలువైన టెస్లా షేర్లను విక్రయించిన సంగతి తెలిసిందే. ఆవిధంగా ఆయన ఈ ట్రాన్సాక్షన్‌లో 27 బిలియన్ డాలర్లకు పైగా పేమెంట్‌ని క్యాష్ రూపంలో చేశారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్‌కి చెల్లించిన 44 బిలియన్ డాలర్లలో 5 పాయింట్ 2 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్స్ మరియు ఇతర లార్జ్ ఫండ్స్ నుంచి వచ్చినవి ఉన్నాయి.
ఈ లిస్టులో సాఫ్ట్‌వేర్ కంపెనీ ఒరాకిల్ కోఫౌండర్ ల్యారీ ఎల్లిసన్ సైతం ఉండటం గమనించాల్సిన విషయం. ఆయన ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టారు. ఈ మేరకు చెక్ రాసిచ్చారు. ఖతార్ హోల్డింగ్ అనే సంస్థ కూడా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసింది. సౌదీ యువరాజు అల్వలీద్ బిన్ తలాల్ సుమారు 35 మిలియన్ షేర్లను ఎలాన్ మస్క్‌కి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ పెట్టుబడులన్నింటికీ ప్రతిఫలంగా ట్విట్టర్‌లో షేర్లు ఇస్తారు. ఈ సామాజిక మాద్యమాన్ని కొనుగోలు చేసేందుకు ఎలాన్ మస్క్ బ్యాంకుల నుంచి దాదాపు 13 బిలియన్ డాలర్లను లోన్ల రూపంలో తీసుకున్నారు.
రుణాలిచ్చిన బ్యాంకుల జాబితాలో మోర్గాన్ స్టాన్లీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా, జపాన్ బ్యాంకులు మిత్సుబిషి, మిజుహో, బార్‌క్లేస్, ఫ్రెంచ్ బ్యాంకులు సొసైటే జనరల్, బీఎన్‌బీ పరిబాస్ వంటివి ఉన్నాయి. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కి సమర్పించిన డాక్యుమెంట్స్ ప్రకారం మోర్గాన్ స్టాన్లీ ఒక్కటే సుమారు 3 పాయింట్ 5 బిలియన్ డాలర్లను మంజూరు చేసింది. ఈ బ్యాంక్ లోన్లను తిరిగి చెల్లించే బాధ్యత తనదేనని ట్విట్టర్ సంస్థ గ్యారంటీ ఇచ్చింది. ఎలాన్ మస్క్ వ్యక్తిగతంగా ఎలాంటి హామీ ఇవ్వకపోవటం ముఖ్యమైన విషయం.
ఫైనాన్షియల్‌గా ట్విట్టర్ ఇప్పటివరకు మంచి పనితీరును కనబరచలేకపోయింది. లాభాల బాట పట్టడానికి ఆపసోపాలు పడుతోంది. 2022 ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో ఆపరేటింగ్ నష్టాలతో నెట్టుకొచ్చింది. ఇలాంటి స్థితిలో మరిన్ని రుణాలకు హామీగా ఉండటం వల్ల ట్విట్టర్ మరింత ఆర్థిక ఒత్తిణ్ని ఎదుర్కోబోతోందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాన్ మస్క్ కూడా ఈ సంస్థను నష్టాల ఊబి నుంచి గట్టెక్కించటం కోసం అప్పుడే కఠిన చర్యలకు ఉపక్రమించారు. దాదాపు సగం మంది ఉద్యోగులను ఇప్పటికే తొలగించారు. ఇంకెన్ని సంస్కరణలు చేపడతారో చూడాలి.