Disney Follows Amazon Prime: అమేజాన్ ప్రైమ్ మాదిరిగానే డిస్నీ కస్టమర్లకి కూడా త్వరలో డిస్నీ ప్రైమ్ అందుబాటులోకి రానున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. సబ్‌స్క్రిప్షన్ సర్వీసులను ప్రారంభించేందుకు ఈ సంస్థ కసరత్తు చేస్తోంది. డిస్నీ ప్లస్ అనే స్ట్రీమింగ్ సర్వీస్‌తోపాటు డిస్నీ ప్రైమ్ కూడా ఆరంభమైతే బ్రాండెడ్ మర్చెండైజ్‌లు, థీమ్ పార్క్‌లు, ప్రొడక్ట్‌లపై డిస్కౌంట్లు ప్రకటించనుంది. అమేజాన్ ప్రైమ్‌ని స్ఫూర్తిగా తీసుకొని డిస్నీ ఎగ్జ్‌క్యూటివ్‌లు ఈ కొత్త ప్రణాళికను రచించారు. దీనికి డిస్నీ ప్రైమ్ అనే పేరును ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇంటర్నల్‌గా మాత్రమే వాడుతున్నారు.
జీడీపీ 7% దాటడం ఖాయం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన దేశ వాస్తవ స్థూల దేశీయ ఉత్పత్తి 7 శాతం దాటడం ఖాయమని కేంద్ర ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది. దీంతో ఇండియా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని సెంట్రల్ ఫైనాన్స్ సెక్రెటరీ టీవీ సోమనాథన్ పేర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసిక జీడీపీ డేటాను విడుదల చేసిన అనంతరం ఆయన ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు దాదాపు ఒకటీ పాయింట్ నాలుగు రెండు ట్రిలియన్ రూపాయలకు చేరొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
First Virtual School in India: దేశంలోనే తొలి వర్చువల్ స్కూల్. ఢిల్లీ, కేంద్రం పోటాపోటీ ప్రకటనలు.
‘విండ్‌ఫాల్’ పెంపు
డీజిల్ మరియు విమాన ఇంధన ఎగుమతులపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌లను కేంద్రం పెంచింది. డీజిల్‌పై గతంలో విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ లీటర్‌కి ఏడు రూపాయలు ఉండగా దాన్ని ఇప్పుడు పదమూడున్నర రూపాయలు చేసింది. లీటర్ జెట్ ఫ్యూయెల్‌పై గతంలో రెండు రూపాయలు వసూలు చేయగా ఇప్పుడు 9 రూపాయలకు పెంచింది. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న క్రూడాయిల్‌పై లేవీని కూడా టన్నుకి 300 చొప్పున పెంచింది. దీంతో ఒక టన్ను క్రూడాయిల్ రేటు ప్రస్తుతం 13,300 రూపాయలకి చేరింది.
ఇండిగో-వర్జిన్ ఒప్పందం
ఇండియా ఎయిర్‌లైన్స్ అయిన ఇండిగో మరియు బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ అయిన వర్జిన్ అట్లాంటిక్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం విమానాల్లో సీట్ల బుకింగ్, టికెట్ల అమ్మకాలకి ఇరు సంస్థలు పరస్పర అంగీకారం తెలిపాయి. దీంతో వర్జిన్ అట్లాంటిక్ ప్యాసింజర్లు ఇకపై సింగిల్ టికెట్‌తో లండన్ నుంచి ఢిల్లీకి లేదా ముంబైకి వచ్చి అక్కడి నుంచి ఇండిగో విమానాల్లో మన దేశంలోని ఏడు నగరాలకు ప్రయాణం చేయొచ్చు. త్వరలో మరో తొమ్మిది నగరాలకు ఈ సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఇండిగో ఇప్పటికే ఐదు ఎయిర్‌లైన్లతో ఈ కోడ్‌షేర్ పార్ట్నర్‌షిప్‌లను కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
17 ఏళ్లుగా..
నిప్పన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్ గత 17 ఏళ్లుగా ఎన్నో ఎత్తుపల్లాలను తట్టుకొని నిలబడుతోంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని, పెద్ద నోట్ల రద్దును, కొవిడ్ మహమ్మారి వల్ల తలెత్తిన పరిణామాలను విజయవంతంగా దాటుకొని ఈ కేటగిరీలో అత్యధిక రిటర్న్‌లను అందిస్తోంది. 2005 మార్చి 28వ తేదీన స్టాక్ మార్కెట్లలో నమోదైన ఈ సంస్థ షేర్లు ఇన్వెస్టర్లకు భారీ లాభాలను ఆర్జించి పెడుతున్నాయి. అప్పటినుంచి ప్రతి నెలా 10 రూపాయలు పెట్టుబడి పెట్టినవారికి ఇప్పుడు దాదాపు 90 లక్షల రూపాయలు వస్తుండటం విశేషం.
పెరిగిన రిజిస్ట్రేషన్లు
జులై నెలతో పోల్చితే ఆగస్టులో ఇ-స్కూటర్ల రిజిస్ట్రేషన్లు 10 శాతానికి పైగా పెరిగాయి. ఏథర్ ఎనర్జీ అనే సంస్థ ఈ విషయంలో నాలుగు రెట్ల వృద్ధిని సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మే నెల నుంచి నామమాత్రంగా సాగుతున్న (లేదా) తగ్గుకుంటూ వస్తున్న రిజిస్ట్రేషన్లు జులైలో ఒక్కసారే పెరగటం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఇ-స్కూటర్ల కొనుగోళ్లు పెరుగుతున్నాయనటానికి ఇదొక నిదర్శనమని చెబుతున్నారు. ఆ మధ్య విద్యుత్ స్కూటర్ల బ్యాటరీలు పేలిపోయి మంటలు వ్యాపించిన ఘటనలు వరుసగా చోటుచేసుకోవటం వల్లే అప్పట్లో సేల్స్, రిజిస్ట్రేషన్లు మందకొడిగా సాగినట్లు భావిస్తున్నారు.