రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం కారణంగా పలు దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి. ఈ జాబితాలో భారత్ కూడా ఉంది. ముఖ్యంగా చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోవడంతో భారత్‌లో టోకు విక్రయదారులకు అమ్మే డీజిల్ ధరను లీటరుకు రూ.25 పెంచారు. ఈ మేరకు దేశంలోని ప్రధాన చమురు సంస్థలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి.
రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం ప్రభావంతో అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధర 40 శాతం పెరిగింది. బ్యారెల్ క్రూడాయిల్ ధర 140 డాలర్లకు చేరింది. ఈ క్రమంలో భారత్ చమురు సంస్థలు కూడా కీలక నిర్ణయం తీసుకున్నాయి. అయితే డీజిల్ టోకు ధర పెంచినా ప్రస్తుతానికి రిటైల్ ధరలో మార్పేమీ లేదు. మరికొన్నిరోజుల్లో దీనిపై సమీక్ష జరిగే అవకాశం ఉంది. మరోవైపు లీటర్ పెట్రోల్ ధర కూడా రూ.25 పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన వంట నూనె ధరలతో బెంబేలెత్తుతున్న సామాన్యులకు పెట్రోల్ రెట్లు పెరిగితే మరింత ఇబ్బందికరంగా మారనుంది.
