NTV Telugu Site icon

Indias trade: విదేశాల్లో భారతీయ వస్తువులకు డిమాండ్..భారీగా పెరిగిన ఎగుమతులు

Indias Trade

Indias Trade

విదేశాల్లో భారతీయ వస్తువులకు విపరీతమైన డిమాండ్ ఉందని ఎగుమతి లెక్కలు చెబుతున్నాయి. సోమవారం వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాత్కాలిక వాణిజ్య డేటా ప్రకారం.. భారతదేశం మొత్తం ఎగుమతులు (వస్తువులు మరియు సేవలతో సహా) ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికంలో $200.3 బిలియన్లకు చేరాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో $184.5 బిలియన్లు గా ఉండింది. జూన్‌లో దేశంలో వస్తువుల ఎగుమతులు 2.56 శాతం పెరిగి 35.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ తెలిపారు. ఏడాది క్రితం ఇదే నెలలో ఎగుమతులు 34.32 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. జూన్‌లో దిగుమతులు దాదాపు 5 శాతం పెరిగాయి. 56.18 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే నెలలో 53.51 బిలియన్ డాలర్లుగా ఉండింది.

READ MORE: Punjab: పంజాబ్లో ఆయుధ స్మగ్లింగ్ రాకెట్ను ఛేదించిన పోలీసులు..

జూన్‌లో దేశ వాణిజ్య లోటు (దిగుమతులు, ఎగుమతుల మధ్య వ్యత్యాసం) 20.98 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుత ట్రెండ్‌ను పరిశీలిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం వస్తువులు, సేవల ఎగుమతులు 800 బిలియన్ డాలర్లను దాటుతుందని సునీల్ బర్త్‌వాల్ అశాభావం వ్యక్తం చేశారు. 2024-25 మొదటి త్రైమాసికంలో వస్తువులు, సేవల ఎగుమతి సుమారు 200 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తెలిపారు. సుమారు 800 బిలియన్ డాలర్లను దాటడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. మే నెలలో భారత సరుకుల ఎగుమతులు 9.1 శాతం పెరిగి 38.13 బిలియన్ డాలర్లకు చేరుకోగా, వాణిజ్య లోటు ఏడు నెలల గరిష్ట స్థాయి 23.78 బిలియన్ డాలర్లకు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో ఎగుమతులు 5.84 శాతం పెరిగి 109.96 బిలియన్ డాలర్లకు చేరుకోగా, దిగుమతులు 7.6 శాతం పెరిగి 172.23 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇంకా భవిష్యత్తులో భారీగా పెరిగే అవకాశం ఉంది.

Show comments