December Rule Changes: డిసెంబర్ 1 నుంచి మారబోతున్న రూల్స్ ఇవే.. ఎస్‌బీఐ కార్డుల బాదుడు నుంచి ఆధార్ ఫ్రీ అప్‌డేట్ వరకు!

December 1 Rule Changes

December 1 Rule Changes

December Rule Changes: ఈ ఏడాది చివరి నెల డిసెంబర్ మరికొద్ది రోజుల్లోనే మొదలవబోతోంది. కొత్త నెలతో పాటు మన జేబుపై ప్రభావం చూపే పలు ముఖ్యమైన ఆర్థిక రూల్స్ కూడా మారబోతున్నాయి. క్రెడిట్ కార్డు ఛార్జీలు, లోన్ వడ్డీ రేట్ల నుంచి మొదలుకుని పెన్షన్, ఆధార్ అప్‌డేట్ వరకు పలు కీలక మార్పులు డిసెంబర్‌లో జరగనున్నాయి. సామాన్యుల నుంచి ఇన్వెస్టర్ల వరకు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆ 6 ప్రధాన మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడేవాళ్లకు కొత్త ఛార్జీల షాక్!

డిసెంబర్ 1, 2026 నుంచి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఎక్స్‌ట్రా ఛార్జీల భారం పడనుంది. కొన్ని రకాల ట్రావెల్ (ప్రయాణ) బిల్లులు ఒక్కసారి రూ.30,000 దాటితే, ఆ మొత్తం బిల్లుపై 1 శాతం అదనపు ఛార్జీ కట్టాలి. ఉదాహరణకు మీరు రూ.40,000 పే చేస్తే, రూ.400 ఎక్స్‌ట్రా ఫీజుతో పాటు ట్యాక్స్‌లు పడతాయి. అలాగే, ఒక బిల్లింగ్ సైకిల్‌లో పెట్రోల్, డీజిల్ ఖర్చులు మొత్తం రూ.50,000 దాటితే, ఆ మొత్తం బిల్లుపై కూడా 1 శాతం ఛార్జీ వేస్తారు. అంటే నెలలో రూ.60,000 ఇంధనానికి వాడితే రూ.600 అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

2. పెరగనున్న లోన్ ఈఎంఐలు? డిసెంబర్ 2న ఆర్‌బీఐ కీలక మీటింగ్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పాలసీ మీటింగ్ డిసెంబర్ 2 నుంచి 4 వరకు జరగనుంది. అక్టోబర్ మీటింగ్‌లో ఆర్‌బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చింది. ఇప్పుడు మరోసారి రెపో రేటు పెంచితే, హోమ్ లోన్ సహా ఫ్లోటింగ్ వడ్డీ రేటుతో లోన్లు తీసుకున్న వాళ్లపై ఈఎంఐ (EMI) భారం మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

3. నవంబర్ 30 లోపు లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వకపోతే పెన్షన్ ఆగిపోతుంది!

ఇది డిసెంబర్ 1 నుంచి వచ్చే కొత్త రూల్ కాకపోయినా, డిసెంబర్ నెల పెన్షన్ రావాలంటే చాలా ముఖ్యమైన పని. పెన్షనర్లు ఏడాదికొకసారి ఇచ్చే లైఫ్ సర్టిఫికెట్ (జీవన్ ప్రమాణ్) ను నవంబర్ 30 లోపు కచ్చితంగా ఇచ్చేయాలి. గడువు దాటితే డిసెంబర్ నుంచి పెన్షన్ రావడం ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది.

4. ఆధార్‌లో ఈ-మెయిల్ అప్‌డేట్ పూర్తిగా ఫ్రీ!

ఆధార్ కార్డు ఉన్నవాళ్లకు యూఐడీఏఐ గుడ్ న్యూస్ చెప్పింది. అధికారిక ఆధార్ మొబైల్ యాప్ ద్వారా మీ ఈ-మెయిల్ ఐడీని కొత్తగా యాడ్ చేయాలన్నా, మార్చుకోవాలన్నా మామూలుగా రూ.75 ఫీజు కట్టాలి. అయితే, ఇప్పుడు ఆ ఫీజును తాత్కాలికంగా ఎత్తేశారు. డిసెంబర్ 31, 2026 వరకు ఈ అప్‌డేట్‌ను పూర్తిగా ఫ్రీగా చేసుకోవచ్చు.

5. ఎన్‌ఆర్‌ఐ ఇన్వెస్టర్లకు డిసెంబర్ 3 నుంచి డిజిటల్ కేవైసీ

భారత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే ఎన్‌ఆర్‌ఐలు (NRIs), ఓసీఐ కార్డుదారులు, విదేశీ ఇన్వెస్టర్లకు సెబీ శుభవార్త చెప్పింది. డిసెంబర్ 3 నుంచి వీళ్లు కేవైసీ ప్రాసెస్ కోసం స్వయంగా ఇండియాకు రావాల్సిన పనిలేదు. విదేశాల్లో ఉంటూనే సెబీ రిజిస్టర్డ్ సంస్థల ద్వారా డిజిటల్ కేవైసీని పూర్తి చేసుకునే ఛాన్స్ అందుబాటులోకి రానుంది.

6. కమోడిటీ మార్కెట్లో కొత్త మార్జిన్ రూల్స్

కమోడిటీ డెరివేటివ్స్ ట్రేడర్లకు డిసెంబర్ 1 నుంచి సెబీ కొత్త రూల్స్ అమల్లోకి తెస్తోంది. కమోడిటీల ధరల్లో ఉండే మార్పుల ఆధారంగా కనీస ఇనీషియల్ మార్జిన్‌ను ఫిక్స్ చేశారు. తక్కువ హెచ్చుతగ్గులు ఉండే వాటికి 6%, మీడియంగా ఉండే వాటికి 8%, ఎక్కువగా ఉండే వాటికి 10% కనీస మార్జిన్ కచ్చితంగా ఉండాలి. వ్యవసాయ, ఇతర అన్ని రకాల కమోడిటీలకు ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయి.