NTV Telugu Site icon

Cognizant: లేఆఫ్స్ జాబితాలోకి మరో టెక్ దిగ్గజం.. 3,500 మంది తొలగింపు..

Cognizant

Cognizant

Cognizant: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, ఆర్థిక మాంద్యం భయాలు టెక్ కంపెనీలను భయపెడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, గూగుల్, యాక్సెంచర్ వంటి సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ జాబితాలో మరో టెక్ సంస్థ కాగ్నిజెంట్ కూడా చేరింది. 2023లో తమ ఆదాయాలు తగ్గుముఖం పట్టడంతో కాగ్నిజెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. కాగ్నిజెంట్కు ప్రధాన ఆదాయం యూఎస్ నుంచి వస్తోంది.

Read Also: Press Freedom Index: మీడియా స్వేచ్ఛలో మరింత దిగువకు ఇండియా.. ఎన్నో స్థానం అంటే..

తగ్గిన ఆదాయాలతో ఖర్చులను తగ్గించుకునేందుకు కాగ్నిజెంట్ 3500 మంది ఉద్యోగులను తొలగించడానికి నిర్ణయించుకుంది. యాక్సెంచర్, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థలతో పోటీ పడటంలో కాగ్నిజెంట్ చాలా కష్టపడుతోంది. ఖర్చులను తగ్గించుకోవడం కోసం కాగ్నిజెంట్ భారతదేశంలోని పెద్ద నగరాల్లో 11 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను కూడా వదులుకుంది. కొత్తగా సీఈఓగా నియమితులైన రవికుమార్ వచ్చీరావడంతోనే ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని తీసుకున్నారు.

పెరుగుతున్న వడ్దీ రేట్లు, ఆర్థిక మాంద్యం భయాల వల్ల అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో ఉద్యోగులను తొలగించుకుంటున్నాయి టెక్ కంపెనీలు. ఇప్పటికే ఫేస్ బుక్ పేరెంట్ కంపెనీ మెటా రెండు పర్యాయాలుగా వేలల్లో ఉద్యోగులను తీసేసింది. ఈ ఏడాది గత నెలలో 10,000 మందిని, గతేడాది నవంబర్ లో 11,000 మందిని తొలగించింది. అమెజాన్ 18,000 మందిని, గూగుల్ 12,000, మైక్రోసాఫ్ట్ 10,000 మందిని, ట్విట్టర్ 50 శాతం మందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. రానున్న కాలంలో యూఎస్, యూరోపియన్ దేశాలు ఆర్థిక మాంద్యం బారిన పడుతాయనే వార్తల నేపథ్యంలో ఐటీ కంపెనీల పరిస్థితి కష్టతరంగా మారుతోంది. రానున్న కాలంలో మరిన్ని లేఆఫ్స్ ఉండే అవకాశం ఉంది.