Cigarette Price Hike: సిగరెట్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. మే నెలలో పెరగనున్న సిగరెట్ ధరలు?

Cigarette

Cigarette

Cigarette Price Hike: సిగరెట్ లవర్‌కు భారీ షాక్ తగిలే వార్త ఇది. దేశవ్యాప్తంగా సిగరెట్ ధరలు మే నెల నుంచి గణనీయంగా పెరకబోతున్నాయని సమాచారం. కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై పన్నులను పెంచుతూ తీసుకున్న నిర్ణయం ప్రభావం ఇప్పుడు సిగరెట్ ధరలపై పడబోతోంది. దేశీ దిగ్గజ సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను ఏకంగా 17 శాతం వరకు పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఈ వార్త వెలువడగానే స్టాక్ మార్కెట్‌లో సిగరెట్ కంపెనీల షేర్లు రాకెట్లా దూసుకుపోయాయి.

ఎంత పెరగనున్నాయంటే..
మీడియా నివేదికల ప్రకారం.. ఐటీసీ (ITC) కి చెందిన పాపులర్ బ్రాండ్ గోల్డ్‌ఫ్లేక్ ప్రీమియం ప్యాక్ ధర ప్రస్తుతం ఉన్న రూ.115 నుంచి సుమారుగా రూ.135కు పెరగనుంది. అంటే ఒక్కో సిగరెట్ మీద కనీసం రూ.2 నుంచి రూ.3 వరకు భారం పడవచ్చు. ఈ ధరల మంట ఎందుకంటే.. ఈ ఏడాది ప్రారంభంలో పార్లమెంట్ ఆమోదించిన సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు, 2025 ప్రకారం పొగాకు ఉత్పత్తులపై సుంకాన్ని ప్రభుత్వం భారీగా పెంచింది. సిగరెట్లపై అదనంగా 40 శాతం జీఎస్టీ విధించబడుతుంది. సిగరెట్ పొడవును బట్టి ప్రతి 1,000 సిగరెట్లపై రూ.2,050 నుంచి రూ.8,500 వరకు ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల ముఖ్యంగా 75-85 మిల్లీమీటర్ల పొడవున్న సిగరెట్ల ధర 22-28 శాతం పెరిగే అవకాశం ఉందని ఐసిఐసిఐ సెక్యూరిటీస్ విశ్లేషకులు చెబుతున్నారు.

ధరల పెంపు వార్త ఇన్వెస్టర్లకు కిక్కునిచ్చింది. ధరలు పెరిగితే కంపెనీ లాభాలు మెరుగవుతాయన్న ఆశతో ఈ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు పెరిగాయి. గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా కంపెనీ షేర్లు ఇంట్రాడేలో 8% పెరిగి రూ.2,280 వద్ద ట్రేడయ్యాయి. గత నెల రోజుల్లోనే ఈ స్టాక్ 21% లాభపడటం విశేషం. మార్కెట్ లీడర్ ఐటీసీ షేర్లు 4% లాభపడి రూ.315.95 వద్ద స్థిరపడ్డాయి. గత నెల రోజుల్లో ఈ షేర్ 10% వృద్ధిని నమోదు చేసింది. సిగరెట్ ధరల పెంపు వల్ల కంపెనీల ఆదాయం పెరిగినా, గత ఆరు నెలల కాలంలో ఈ రెండు కంపెనీల షేర్లు ఇంకా 25-27 శాతం నష్టాల్లోనే ఉండటం గమనార్హం. తాజా ధరల పెంపుతో ఈ నష్టాల నుంచి కంపెనీలు కోలుకుంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.