12 నెలల గరిష్టానికి పారిశ్రామిక ఉత్పత్తి
దేశ పారిశ్రామిక ఉత్పత్తి మే నెలలో 19 పాయింట్ 6 శాతానికి పెరిగింది. ఇది 12 నెలల గరిష్టం కావటం విశేషం. ఏప్రిల్ నెలలో ఇందులో దాదాపు సగం మాత్రమే అంటే 6 పాయింట్ 7 శాతమే నమోదైంది. ఆర్థిక వ్యవస్థ బాగానే కోలుకుంటోందనటానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది.
‘5జీ’కి జియో ఖర్చు 60 వేల కోట్లు!
5జీ స్పెక్ట్రం కేటాయింపుల కోసం కేంద్రం ఈ నెల 26న వేలం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు వివిధ టెలికం కంపెనీలు బిడ్లు కూడా వేశాయి. అయితే ఏ సంస్థ ఎంత మొత్తానికి బిడ్ వేసిందనేది ఆసక్తికరంగా మారింది. జియో, ఎయిర్‌టెల్ 55 నుంచి 60 వేల కోట్ల రూపాయల వరకు క్వోట్ చేసినట్లు అంచనా వేస్తున్నారు. కొత్తగా వచ్చిన అదానీ నెట్‌వర్క్ 13 నుంచి 15 వేల కోట్ల వరకు బిడ్ వేసి ఉండొచ్చని అంటున్నారు. వొడాఫోన్ అతి తక్కువగా 5 వేల కోట్లే ఖర్చుచేయనుందని చెబుతున్నారు.
డాలర్‌కి సమానమైన యూరో
యూరో, డాలర్ సమానమయ్యాయి. ఈ రెండు కరెన్సీలూ ఈక్వల్ కావటం 20 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ పరిణామం యూరోపియన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర మాంద్యం దిశగా పయనిస్తోందనటానికి సంకేతమని మార్కెట్ వర్గాలు ఊహాగానాలు చేస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధమే దీనికి కారణమని పేర్కొంటున్నాయి.
రూపాయల్లో చెల్లిస్తే 36 బిలియన్ డాలర్లు ఆదా
అంతర్జాతీయ లావాదేవీలను రూపాయల్లో నిర్వహించటం వల్ల ఏటా 36 బిలియన్ డాలర్ల హార్డ్ కరెన్సీ ఆదా అవుతుంది. ఫలితంగా రూపాయి విలువ పెరుగుతుంది. రష్యాతో వాణిజ్యారంభం కోసం చేపట్టనున్న ఈ చర్య భారత ప్రభుత్వ బాండ్లకు కూడా అనుకూలంగా మారనుంది.
105 బిలియన్ డాలర్లకు కరంట్ అకౌంట్ లోటు
ఈ ఆర్థిక సంవత్సరంలో కరంట్ అకౌంట్ లోటు 105 బిలియన్ డాలర్లకు లేదా జీడీపీలో 3 శాతానికి చేరుకుంటుందని అంచనా. దేశ వాణిజ్య లోటు స్థిరంగా పెరుగుతుండటమే దీనికి ప్రధాన కారణమని నివేదికలు చెబుతున్నాయి.