Business Headlines: ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్.. ఇండియాలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించాలనుకున్న ఫస్ట్ రిటైల్ ఔట్‌లెట్ మరింత ఆలస్యం కానుంది. వచ్చే ఏడాది జనవరి-మార్చి మధ్య కాలంలో అందుబాటులోకి రానుంది. మన దేశంలో యాపిల్ కంపెనీ సొంత స్టోర్ ముంబైలో వాస్తవానికి గతేడాదే ఓపెన్ కావాల్సి ఉంది. ముంబై తర్వాత ఢిల్లీలోనూ ఔట్‌లెట్‌ను ప్రారంభించేందుకు యాపిల్ ప్రయత్నిస్తోంది.
3వ రోజూ ‘5జీ’ వేలం
5జీ స్పెక్ట్రం వేలం ప్రక్రియ ఇవాళ మూడో రోజూ కొనసాగనుంది. నిన్న రెండో రోజు నిర్వహించిన ఆక్షన్‌లో ఒకటీ పాయింట్ నాలుగు, తొమ్మిది లక్షల కోట్ల రూపాయల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. మొన్న మొదటి రోజు ఒకటీ పాయింట్ నాలుగు, ఐదు లక్షల కోట్ల రూపాయల విలువైన దరఖాస్తులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మొత్తం 9 రౌండ్లు సాగిన ఈ వేలం ప్రక్రియ ఈరోజు ముగుస్తుంది.
read also: America: అగ్రరాజ్యం అమెరికాలో ‘టాప్’ స్టార్టప్ హీరోలూ మనోళ్లే
ఫెడ్ వడ్డీ 0.75% పెంపు
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును మరో ముప్పావు శాతం పెంచింది. దీంతో గడచిన రెండు నెలల్లో వడ్డీ రేటు ఒకటీ పాయింట్ ఐదు శాతం పెరిగింది. నిత్యావసరాల చిల్లర ధరలు 40 ఏళ్ల గరిష్టానికి పెరగటంతో వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రభావం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లపై కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు.
‘ఈవీ’ అంచనాలు భళా
విద్యుత్ వాహన రంగంలో 2030 నాటికి ప్రత్యక్షంగా కోటి మందికి, పరోక్షంగా 5 కోట్ల మందికి ఉపాధి లభించనుంది. గతేడాది ఈ సెక్టార్ 6 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించగా మరో ఎనిమిదేళ్లలో 20 బిలియన్ డాలర్ల స్థాయికి వృద్ధి చెందనుంది. ఈ విషయాన్ని ఇండియన్ ప్రైవేట్ ఈక్విటీ అండ్ వెంచర్ క్యాపిటల్ అసోసియేషన్ తన రిపోర్ట్‌లో పేర్కొంది.
బీపీసీఎల్‌కి గ్రీన్ సిగ్నల్
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బ్రెజిల్ ఆయిల్ ప్లాంట్‌లో అదనపు పెట్టుబడులు పెట్టనుంది. ఒకటీ పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసేందుకు కేంద్ర కేబినెట్ నిన్న ఆమోదం తెలిపింది. ఈ బ్లాక్‌లో మన కంపెనీ షేరు 40 శాతం కాగా బ్రెజిల్ వాటా 60 శాతం. మరో నాలుగైదేళ్లలో ఇక్కడ పెట్రోలియం ఉత్పత్తి ప్రారంభం కానుంది.
సంస్థల లాభనష్టాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి మూడు నెలల్లో మారుతీ సుజుకీ ఇండియా వెయ్యీ 36 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది. గతేడాదితో పోల్చితే ఇది రెట్టింపు కన్నా ఎక్కువ కావటం విశేషం. మరోవైపు టాటా మోటార్స్ 4 వేల 951 కోట్ల రూపాయల నష్టాన్ని మూటగట్టుకుంది. బ్రిటిష్ విభాగమైన జాగ్వార్ ల్యాండ్ రోవర్ వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.
స్టాక్ మార్కెట్ అప్‌డేట్
స్టాక్ మార్కెట్లలో మూడు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఇవాళ నాలుగో రోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 700 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 16,800 పాయింట్ల పైనే ట్రేడింగ్ అవుతోంది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచటం దేశీయ స్టాక్ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. బ్యాంకులు, ఐటీ సంస్థల షేర్లు లాభాలు ఆర్జించాయి. బజాజ్ ఫైనాన్స్ స్టాక్స్ విలువ రెండు రోజుల్లో 10% పెరగటం విశేషం. మరోవైపు.. ఆటోమొబైల్, ఫార్మా సంస్థల షేర్లు నష్టాలను నమోదుచేశాయి.