Business Headlines: 4,500 మంది ఉద్యోగులకు వీఆర్‌ఎస్
ఎయిరిండియాలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునేందుకు 4 వేల 500 మంది పర్మనెంట్ ఉద్యోగులు ముందుకొచ్చారు. జూన్, జూలై నెలల్లో వీఆర్‌ఎస్‌కి అప్లై చేసేవాళ్లకి ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. వీఆర్‌ఎస్ అర్హత వయసును సైతం 55 ఏళ్ల నుంచి 40 ఏళ్లకి తగ్గించింది.
రెమిటెన్స్‌లో ఇండియా టప్
విదేశాల నుంచి ఎక్కువ చెల్లింపులు పొందుతున్న దేశాల్లో ఇండియా టాప్‌లో నిలిచింది. గతేడాది మన దేశం ఇతర దేశాల నుంచి 87 బిలియన్ డాలర్ల రెమిటెన్స్‌ను స్వీకరించింది. తద్వారా చైనా, మెక్సికో దేశాలను వెనక్కి నెట్టింది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో పేర్కొంది.
5జీకి 10-20 శాతం ఎక్కువ ఛార్జ్
4జీ మొబైల్ డేటా ప్లాన్లతో పోల్చితే 5జీ డేటా ప్లాన్లకి 10 నుంచి 20 శాతం ఎక్కువ ఛార్జ్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కో వినియోగదారుడి నుంచి సగటున వసూలు చేసే రెవెన్యూని పెంచుకుందుకు టెలికం కంపెనీలు ఈ నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. 5జీ సర్వీస్ అందుబాటులోకి వచ్చిన తొలి రోజుల్లేనే ఈ ఛార్జ్‌ని వసూలు చేయొచ్చని, తర్వాత మరింత పెంచొచ్చని అంచనా వేస్తున్నారు.
షేర్లకు ‘విండ్‌ఫాల్’ బూస్ట్
ఇంధన ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ని తగ్గించటం ఆయిల్ కంపెనీలకు, ప్రొడ్యూజర్లకు బాగా కలిసొచ్చింది. ముఖ్యంగా రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు 2 పాయింట్ 5 శాతం లాభపడ్డాయి. విండ్‌ఫాల్ ట్యాక్స్‌ని తగ్గించటం ఆయా కంపెనీల షేర్లకు సెంటిమెంటల్‌గా మరింత వర్కౌట్ కానుందని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
14 శాతం పెరిగిన గోధుమల ధరలు
గోధుమల ధరలు గత 6 వారాల్లో 14 శాతం పెరిగాయి. వర్షాల వల్ల సప్లై తగ్గటం, మిల్లింగ్ డిమాండ్ పెరగటమే దీనికి కారణమని అంటున్నారు. ఈ నేపథ్యంలో గోధుమ పిండి, మైదా, బిస్కెట్లు, బ్రెడ్ తదితర ఉత్పత్తుల ధరలు పెరగొచ్చని భావిస్తున్నారు. ఈ మార్పును సరిగా అంచనా వేయలేక స్టాక్ మార్కెట్లలోని చిన్న వ్యాపారులు షేర్లను అమ్ముకోగా పెద్ద వ్యాపారులు మాత్రం అట్టిపెట్టుకున్నారు.
గోల్డ్‌మన్ శాక్స్‌కు మాంద్యం భయం
గోల్డ్‌మన్ శాక్స్ వచ్చే రెండేళ్లలో 50 శాతం మాంద్యంలో కూరుకుపోయే అవకాశం ఉందని ఎకనమిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే ఆ బ్యాంక్ సీఈఓ డేవిడ్ సోలోమన్ మాత్రం వచ్చే ఏడాది కాలంలోనే 30 శాతం మాంద్యంలో చిక్కుకోవచ్చని పేర్కొన్నారు.
స్టాక్ మార్కెట్ అప్‌డేట్
స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమైనప్పటికీ త్వరగానే కోలుకున్నాయి. సెన్సెక్స్ 150 పాయింట్లు పెరిగి ప్రస్తుతం 55,530 పాయింట్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. నిఫ్టీ 40 పాయింట్లు పెరిగి 16,560 వద్ద ట్రేడ్ అవుతోంది. మిడ్, స్మాల్ క్యాప్‌ల వ్యాల్యూ 0.9 శాతం పెరిగింది. గ్లాండ్ ఫార్మా కంపెనీ స్టాక్స్ 11 శాతం లాభపడ్డాయి.
