Byju Raveendran: కటకటాల్లోకి బైజూస్ బాస్.. సింగపూర్ కోర్టు సంచలన తీర్పు, అసలు ఏం జరిగిందంటే?

  • బైజూ రవీంద్రన్‌కు ఆర్నెల్ల జైలు..
  • కుప్పకూలిన ఎడ్‌టెక్ సామ్రాజ్యం
Byju Raveendran

Byju Raveendran

Byju Raveendran: సింగపూర్ కోర్టు సంచలన తీర్పుతో బైజూస్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. కోర్టు ధిక్కరణ నేరం కింద ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తాజాగా సింగపూర్ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు 90,000 సింగపూర్ డాలర్ల (సుమారు 70,500 అమెరికన్ డాలర్లు) భారీ జరిమానా కూడా విధించింది. ఏప్రిల్ 2024 వరకు ఆస్తుల వెల్లడికి సంబంధించి కోర్టు ఇచ్చిన కీలక ఉత్తర్వులను రవీంద్రన్ పదేపదే ఉల్లంఘించడంతో న్యాయస్థానం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఒకప్పుడు భారతీయ ఎడ్‌టెక్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి, వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన రవీంద్రన్ ప్రస్థానంలో ఈ జైలు శిక్ష అత్యంత దారుణమైన మలుపుగా మారిందని చెబుతున్నారు.

కోర్టు ఆదేశాల బేఖాతర్..
నిజానికి ఈ కేసులో సింగపూర్ న్యాయస్థానం అత్యంత కఠిన వైఖరిని అవలంబించింది. బైజు రవీంద్రన్ వెంటనే అధికారుల ముందు లొంగిపోవాలని, జరిమానా మొత్తాన్ని తక్షణమే చెల్లించాలని తన తీర్పులో స్పష్టం చేసింది. వీటితో పాటు, మరో సంస్థలో వాటాలు కలిగి ఉన్న ‘బీయార్ ఇన్వెస్ట్‌కో ప్రైవేట్ లిమిటెడ్’ యొక్క చట్టబద్ధమైన యాజమాన్య పత్రాలను కూడా కోర్టుకు సమర్పించాలని ఈ సందర్భంగా ఆదేశించింది. బైజూస్ తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉండి, ఉద్యోగుల కోతలు విపరీతంగా జరుగుతున్న సమయంలో అందులో పెట్టుబడులు పెట్టిన ‘ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ’కి చెందిన ఒక అనుబంధ సంస్థ ఈ న్యాయపోరాటాన్ని నడిపిస్తోంది. ఈ హై-ప్రొఫైల్ కేసులో ఖతార్ హోల్డింగ్స్ తరఫున ‘డ్రూ & నేపియర్’ న్యాయవాదులు వాదించగా, బైజు ఇన్వెస్ట్‌మెంట్స్ తరఫున ‘ఫెర్వెంట్ ఛాంబర్స్’ వాదనలు వినిపించింది.

అమెరికాలోనూ ముదిరిన సంక్షోభం..
బైజు రవీంద్రన్ కష్టాలు కేవలం సింగపూర్‌కే పరిమితం కాలేదు. అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి ఆయన నలువైపులా తీవ్రమైన వ్యాజ్యాలను, క్లెయిమ్‌లను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అమెరికాలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. బైజూస్ తీసుకున్న 1.2 బిలియన్ డాలర్ల భారీ రుణాన్ని తిరిగి రాబట్టుకునేందుకు అంతర్జాతీయ రుణదాతలు అక్కడ సుదీర్ఘ న్యాయపోరాటం చేస్తున్నారు. ‘థింక్ & లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్’ (బైజూస్) సంస్థను స్థాపించి, భారతీయ స్టార్టప్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు సృష్టించిన రవీంద్రన్.. విదేశీ పెట్టుబడులతో ప్రపంచ బిలియనీర్ల జాబితాలోకి ఎక్కారు. అయితే ప్రస్తుత పరిణామాలతో ఆయన ఆర్థికంగా పూర్తిగా పతనమయ్యే స్థితికి చేరుకున్నారు.

రవీంద్రన్ ఆచూకీ ఎక్కడ
సింగపూర్ కోర్టు జైలు శిక్ష విధించిన ఈ దిగ్భ్రాంతికర పరిణామం తర్వాత బైజు రవీంద్రన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ విషయమై మీడియా ప్రతినిధులు వివరణ కోరినప్పటికీ ఆయన స్పందించలేదు. వీటన్నింటికీ మించి, ప్రస్తుతం రవీంద్రన్ సింగపూర్‌లోనే ఉన్నారా? లేదా మరే దేశంలోనైనా ఉన్నారా? అనే దానిపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆయన ఆచూకీపై ఎవరికీ స్పష్టమైన సమాచారం లేదు.