Apple Pay: భారత డిజిటల్ చెల్లింపుల మార్కెట్లోకి ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. గ్లోబల్ మార్కెట్‌లో యాపిల్ పే అందుబాటులోకి వచ్చిన దాదాపు పుష్కర కాలం తర్వాత భారత్‌లో లాంచ్ కానుండటం టెక్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ప్రస్తుతం దేశీయంగా 84 శాతానికి పైగా మార్కెట్‌ను శాసిస్తున్న ఫోన్‌పే, గూగుల్ పే ఆధిపత్యానికి ఇది ఎంతవరకు గండి కొడుతుందనే దానిపై ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ప్రస్తుతం భారత్‌లో వీధి వ్యాపారుల నుంచి భారీ షాపింగ్ మాల్స్ వరకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నేరుగా బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు పంపే యూపీఐ పద్ధతే అత్యంత ప్రాచుర్యంలో ఉంది.
ఇలాంటి టైంలో ఇండియా మార్కెట్‌లోకి అడుగు పెట్టడానికి రెడీ అవుతున్న యాపిల్ పే ఎలాంటి సేవలతో యూజర్స్‌ను ఆకట్టుకుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా సమాచారం ప్రకారం.. భారత్‌లో యాపిల్ పే ప్రారంభ దశలో ప్రధానంగా క్రెడిట్ కార్డుల ఆధారిత ‘ట్యాప్ అండ్ పే’ (POS మెషీన్లపై కార్డుతో పనిలేకుండా స్వైప్ చేసే విధానం) సేవలతోనే రావచ్చని తెలుస్తోంది. ప్రాథమికంగా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో ఈ సేవలు స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ మొదటి దశలో క్యూఆర్ కోడ్ ఆధారిత యూపీఐ సదుపాయం లేకపోతే, నిత్యం చిన్న మొత్తాల లావాదేవీలు జరిపే సాధారణ యూజర్స్‌ను ఇది పెద్దగా ఆకర్షించలేకపోవచ్చనే అభిప్రాయాలు మార్కెట్ వర్గాల నుంచి వ్యక్తం అవుతున్నాయి. పైగా ఫోన్‌పే, గూగుల్ పేలు ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలోనూ పనిచేస్తుండగా, యాపిల్ పే కేవలం ఐఫోన్, యాపిల్ వాచ్ యూజర్లకు మాత్రమే పరిమితం కానుంది.
అయితే యాపిల్ పే భారత్‌లో యూపీఐ సపోర్ట్‌తో కూడా రావచ్చని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. ఒకవేళ నేరుగా యూపీఐ నెట్‌వర్క్‌తో యాపిల్ పే మార్కెట్‌లో దిగితే అప్పుడు సమీకరణాలు పూర్తిగా మారిపోయే ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రత్యేకంగా ఎలాంటి థర్డ్ పార్టీ యాప్‌లు తెరవాల్సిన అవసరం లేకుండా, ఫోన్ లాక్ స్క్రీన్‌లో ఉన్నప్పుడే కేవలం ‘ఫేస్ ఐడీ’ లేదా ‘టచ్ ఐడీ’ బయోమెట్రిక్ వెరిఫికేషన్‌తో పేమెంట్ పూర్తయ్యేలా యాపిల్ పే పనిచేస్తుంది. దీంతో ఐఫోన్ వాడుతున్న ప్రీమియం కస్టమర్లు ఫోన్‌పే, గూగుల్ పేలకు బదులుగా ఇన్-బిల్ట్‌గా ఉండే యాపిల్ పే వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తొలి దశలో కేవలం క్రెడిట్ కార్డుల చెల్లింపులకే పరిమితమైతే, దేశీయ పేమెంట్ యాప్‌లకు తక్షణ ముప్పు లేకపోయినప్పటికీ, భవిష్యత్తులో యాపిల్ పే యూపీఐ సేవలపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తే మాత్రం భారత డిజిటల్ చెల్లింపుల రంగంలో తీవ్ర పోటీ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

